India-Pak border : భారత్, పాక్ సరిహద్దుల్లో జింకల కొట్లాట: వీడియో వైరల్

ఇటీవల భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో రెండు జింకలు పోట్లాడుకున్నాయి. ఆ సరిహద్దులకు అవతల ఇవతల పచ్చిక మైదానాలు ఉన్నాయి. ఆ మైదానాల్లో గడ్డిని తినేందుకు జింకలు వస్తూ ఉంటాయి. అయితే అటు పాకిస్తాన్ సరిహద్దుల్లో, ఇటు భారత్ సరిహద్దుల్లో పచ్చికను మేస్తున్న రెండు జింకలు కయ్యానికి కాలు దువ్వాయి. కొమ్ములతో పరస్పరం పోట్లాడుకున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : July 30, 2024 12:15 pm
Follow us on

India-Pak border :  భారీ ఇనుప స్తంభాలు.. వాటిని అనుసంధానిస్తూ అల్లిన ముళ్ళకంచె. కనుచూపుమేర ఆ ఫెన్సింగ్ ఉంది. పై వరుసలో ముళ్ల కంచెకు సౌర విద్యుత్ ప్రసారం అవుతుంది. పొరపాటున ఆ తీగలను ముట్టుకుంటే అంతే సంగతులు. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి చోట రెండు జింకలు హోరాహోరిగా పోట్లాడుకున్నాయి.. కయ్యానికి కాలు దువ్వింది ఏ జింకో తెలియదు గానీ.. మొత్తానికి ఆ ప్రాంతం చిన్నపాటి యుద్ధ రంగాన్ని తలపించింది. ఒక జింక నాలుగు అడుగులు వెనక్కి వేసి ఒక్కసారిగా ముందుకు వస్తే.. మరో జింక కూడా అదే స్థాయిలో దూసుకు వచ్చింది. రెండు జింకలకు కొమ్ములు బలంగా ఉండడంతో ఒకదాని ఒకటి గట్టిగా పొడుచుకున్నాయి. ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. పాకిస్తాన్ – భారత్ సరిహద్దు మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఉగ్రమూకల రాక తగ్గింది

పాక్ – భారత్ సరిహద్దుల్లో భారీ ఇనుప కంచె ఉంటుంది. ఇక్కడ నిరంతరం ఇరు దేశాలకు చెందిన జవాన్లు కాపలా కాస్తుంటారు. అట నుంచి ఇటు, ఇటు నుంచి అటు చొరబాట్లు జరగకుండా చూస్తుంటారు. సాధారణంగా పాకిస్తాన్ నుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తుంటారు. వారి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు మన దేశ సైనికులు తిప్పి కొడుతుంటారు. ఇలాంటి సమయంలో కాల్పులు చోటుచేసుకుంటాయి. అప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయితే దేశ విభజన నాటి నుంచి పాకిస్థాన్ వల్ల భారత్ ఏదో ఒక రూపంలో ఇబ్బంది పడుతూనే ఉంది. అలాంటి ఇబ్బందికి శాశ్వత పరిష్కారంగా కంచె నిర్మించింది. ప్రతి ఏడాది ఆ కంచెకు మరమ్మతులు చేస్తూనే ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. భారీ ఎత్తున సైనికులను మోహరించింది. అందువల్లే మన దేశంలోకి ఉగ్రమూకల రాక తగ్గింది..

భారత్ – పాక్ సరిహద్దు వద్ద..

భారత్ – పాక్ సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు ఇరు దేశాలకు చెందిన సైనికులు గస్తీ కాస్తుంటారు. 24 గంటల్లో మూడు షిఫ్టుల వారీగా సాయుధ బలగాలు కాపలాగా ఉంటాయి. ఎలాంటి వాతావరణం ఉన్నప్పటికీ సైనికులు తమ విధి నిర్వహణను మాత్రం విస్మరించరు. భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో కఠినమైన వాతావరణం ఉంటుంది. ఎండాకాలంలో మే నెల మినహా మిగతా అన్ని రోజులు అక్కడ విపరీతమైన చలి ఉంటుంది. ఎముకలు కొరికేలా శీతల గాలులు వీస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోనూ సైనికులు కాపలా కాస్తుంటారు. అయితే ఇటీవల భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో రెండు జింకలు పోట్లాడుకున్నాయి. ఆ సరిహద్దులకు అవతల ఇవతల పచ్చిక మైదానాలు ఉన్నాయి. ఆ మైదానాల్లో గడ్డిని తినేందుకు జింకలు వస్తూ ఉంటాయి. అయితే అటు పాకిస్తాన్ సరిహద్దుల్లో, ఇటు భారత్ సరిహద్దుల్లో పచ్చికను మేస్తున్న రెండు జింకలు కయ్యానికి కాలు దువ్వాయి. కొమ్ములతో పరస్పరం పోట్లాడుకున్నాయి. ఈ దృశ్యాన్ని ఓ భారత జవాన్ తన ఫోన్లో బంధించాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో.. నెట్టింట చర్చకు దారితీస్తోంది..”సరిహద్దుల్లో సైనికుల పోరాటాలు సర్వసాధారణం. అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత్ – పాకిస్తాన్ దేశాల్లోని జింకలు పరస్పరం పోట్లాడుకోవడమే విచిత్రంగా ఉంది. కంచెకు రెండువైపులా జింకలు పోట్లాడుకోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని” నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో #India vs Pakistan అనే యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.