India And US: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి ఏడాదైంది. మొదటిసారి అధ్యక్షుడు అయ్యాక భారత్‌కు మంచి మిత్రుడిగా ఉన్నాడు. మోదీకి అత్యంత సన్నిహితంగా మెదిలాడు. 2.0 పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోంది. అమెరికా ప్రయోజనాలకన్నా వ్యక్తిగత ప్రయోజనాలకే ట్రంప్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రపంచ దేశాలపై రివర్స్ టారిఫ్‌లు విధించారు. ఇప్పటికీ తన మాట వినని దేశాలపై కక్ష్య సాధింపునకు దిగుతున్నాడు. ట్రంప్ భారత ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించి వాణిజ్య ఒత్తిడి తీర్చుకుంటుంటే, మోదీ సైలెంట్‌గా ట్రంప్ కీలెరిగి వాత పెడుతున్నారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే తృణధాన్యాలు, ముఖ్యంగా పప్పు దినుసులపై 30 శాతం సుంకం వేసి రాయితీలు రద్దు చేసింది. ఈ వ్యూహాత్మక చర్య అమెరికా రైతులను వణికిస్తుంది.
ట్రంప్ ఒత్తిడి.. భారత్ స్పందన..
ట్రంప్ గతంలో రష్యన్ చమురు దిగుమతులు, గ్రీన్ ఎనర్జీ విషయాలతో భారత వస్తువులపై 50 శాతం వరకు సుంకాలు పెంచాడు. భారతదేశం దీనికి ప్రకటనలు చేయకుండా, అక్టోబర్‌లో ఈ నిర్ణయం తీసుకుని నవంబర్ నుంచి అమలు ప్రారంభించింది. ప్రచారం లేకుండా జరిగిన ఈ చర్య అమెరికా పప్పు ఎగుమతులను గణనీయంగా ప్రభావితం చేసింది.
అమెరికాలో ఆందోళనలు
అమెరికాలోని నార్త్ డకోటా, మోంటానా రాష్ట్రాల్లో పప్పు దినుసుల సాగు ప్రధానం. ఈ సుంకాల వల్ల భారత మార్కెట్‌లో వాటా తగ్గడంతో స్థానిక రైతులు కష్టాలు అనుభవిస్తున్నారు. సెనేటర్లు కెవిన్ క్రామర్, స్టీవ్ డెయిన్స్ ట్రంప్‌కు లేఖ రాసి, భారతీయులు పప్పులు ఎక్కువగా తినే దేశమని, ఈ సుంకాలు తొలగించాలని మొరపెట్టారు. మూడున్నర నెలల తర్వాత ఈ లేఖతో మాత్రమే విషయం వెలుగులోకి వచ్చింది.
గత సంఘటనలు..
2019లో కూడా ట్రంప్ సుంకాలకు భారత్ ఇలాంటి సమాధానం ఇచ్చి, అతన్ని మోదీకి లేఖ రాయించింది. ఇప్పుడు అదే భావన పునరావృతం అవుతోంది. ట్రంప్ అరవటలతో ముందుకు వెళ్తుంటే, భారత్ అమలును ఆయుధంగా చేసుకుంది. దేశీయ రైతుల రక్షణకు ’నో కాంప్రమైజ్’ విధానం పాటిస్తూ, వాణిజ్య యుద్ధంలో బలమైన స్థానం సంపాదించింది.
మోదీ, జైశంకర్, పీయూష్ గోయల్, దోవల్‌లాంటి నాయకులు కలిసి ఈ వ్యూహాన్ని రూపొందించారు. ఒకరు విదేశీ వ్యూహాలు రూపొందించగా, మరొకరు పరిణామాలను అంచనా వేసి అమలు చేశారు. ఈ చర్య అమెరికా మార్కెట్‌పై ఆధారపడకుండా భారత బలాన్ని చూపించింది. నెటిజన్లు ఈ సైలెంట్ రెస్పాన్స్‌ను సంబరాలతో అభినందిస్తున్నారు.
