Israel Hamas Conflict: “ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇజ్రాయిల్ నిఘా వ్యవస్థ ఇట్టే పసిగడుతుంది” ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్య ఇది. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ఆ వ్యాఖ్యలు చేశారంటే ఇజ్రాయిల్ నిఘా వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చుట్టూ శత్రు దేశాలు ఉన్న నేపథ్యంలో ఇజ్రాయిల్ కనివిని ఎరుగని స్థాయిలో రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. శత్రు దేశాలు దాడి చేసేటపుడు పసిగట్టే విధంగా ఐరన్ డోమ్ వ్యవస్థను నిర్మించుకుంది. ఇంతటి అధునాతన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఇజ్రాయిల్ ఎక్కడ కంగుతిన్నది? గాజాకు చెందిన అమాస ఉగ్రవాదులు ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ తో దాడికి తెగబడటంతో ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ మీద నమ్మకం మొత్తం ఒక్కసారిగా పటాపంచలైపోయింది.
వాస్తవానికి భారత్ సహా అనేక దేశాలు, నిఘా, ఇతర ఆపరేషన్ కోసం ఇజ్రాయిల్ పైన అధికంగా ఆధారపడుతుంటాయి. హమాస్ దాడి చేయడంతో ఇప్పుడు ఆ దేశాన్ని మొత్తం తమ నిర్ణయాన్ని పున; సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వందలాదిమంది హమాస్ మూకలు వివిధ మార్గాల ద్వారా ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ పై విరుచుకుపడిన తీరు.. దాదాపు 1000 మంది సైనికులను, సామాన్యులను హతమార్చిన తీరును ఇప్పటికీ ప్రపంచం మర్చిపోలేక పోతోంది. 150 మందికి పైగా ఇజ్రాయిల్ దేశస్తులను బంధించి తీసుకెళ్లారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయిల్ స్వతంత్ర దేశంగా ఏర్పాటైనప్పటి నుంచి దాడులకు గురవుతూనే ఉంది. అయితే వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆ దేశ తొలి ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ ” అమాన్” పేరుతో సైనికనిగా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇజ్రాయిల్ అంతర్గత భద్రత కోసం ఇజ్రాయిల్ సెక్యూరిటీ ఏజెన్సీ ని నెలకొల్పారు. మరోవైపు విదేశాల్లో నిఘా వ్యవహారాలు చూసేందుకు విదేశాంగ శాఖ పరిధిలో రాజకీయ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అనేక పరిణామాల నేపథ్యంలో “మొస్సాద్” అనే రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనిని వాస్తవంగా “ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్” అని పిలుస్తారు.
మొస్సాద్ ఏర్పాటైనప్పటినుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కీలకమైన ఆపరేషన్లు నిర్వహించింది. పాలస్తీనా మిలిటెంట్లు 1976 జూన్ 27న ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీన్ నుంచి పారిస్ వెళ్తున్న ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని హైజాక్ చేసి ఉగాండా తరలించారు. మొస్సాద్ ఫైటర్లు ఆపరేషన్ థండర్ బోల్డ్ పేరుతో జూలై 4వ తేదీన ఉగాండా విమానాశ్రయంలో హైజాకార్లపై దాడి చేసి వారిని హతమార్చారు. తక్కువ సమయంలో 102 మందిని సురక్షితంగా విడిపించుకుని వెళ్లారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇజ్రాయిల్ మొస్సాద్ సాధించిన విజయాలు అన్ని ఇన్ని కావు.
వాస్తవానికి ఇజ్రాయిల్ పేరు చెబితేనే సాంకేతిక పరిజ్ఞానం గుర్తుకొస్తుంది. గత రెండు సంవత్సరాలుగా హమాస్ నుంచి ఎటువంటి హడావిడి లేకపోవడంతో ఇజ్రాయిల్ సైనిక వ్యవస్థ కూడా నిశ్శబ్దంగా ఉంది.. అయితే తాను చైతన్య రహితంగా ఉన్నట్టు ఇజ్రాయిల్ సైన్యాన్ని హమాస్ నమ్మించింది. పైపెచ్చు అధికారికంగా అప్పుడప్పుడు ఇజ్రాయిల్ తో సంప్రదింపులు జరిపింది. చివరికి ఇజ్రాయిల్ హమాస్ ను ఎంతగా నమ్మింది అంటే.. గాజాలో ఏదో జరుగుతోంది నిఘా సమాచారం వచ్చినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇజ్రాయిల్ దళాలు అయితే హమాస్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు బంకర్లలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. సమాచార సేకరణ కోసం సాంకేతిక పరిజ్ఞానంపై అతిగా ఆధారపడటం వల్లే ఇజ్రాయిల్ క్షేత్రస్థాయి నిఘా బలహీనపడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హమాస్ దీన్ని తనకు అనుకూలంగా మలుచుకుంది. శనివారం నాటి దాడికి రెండేళ్ల కిందటే వ్యూహం రచించింది. ఈ దాడిని అమలు చేసేందుకు మెరికల లాంటి యువకులను ఎంపిక చేసుకుంది. వారెవరూ స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకుండా చూసుకుంది. ఇజ్రాయిల్ ఉపగ్రహాలకు దొరకకుండా అత్యంత ఎరుకైన భవనాల్లోనే వారికి శిక్షణ ఇచ్చింది. ఆయుధాల సరఫరాకు భారీగా సొరంగాలు నిర్మించింది. ఒకవైపు వారికి శిక్షణ ఇస్తూనే.. “మరోవైపు మేము యుద్ధం చేయలేము” అనే భ్రమ కల్పించింది. చివరికి ఇజ్రాయిల్ దేశాన్ని చిగురుటాకులా వణికించింది.