India multi-static radar strategy: యుద్ధ విధానాలు మారుతున్నాయి. ఒకప్పుడు భూమిపై మాత్రమే యుద్ధాలు జరిగేవి తర్వాత నీటిపై యుద్ధాలు వచ్చాయి. ఆ తర్వాత విమానాలతో యుద్ధాలు మొదలయ్యాయి. తాజాగా టెక్నాలజీ వార్ కూడా ప్రారంభమైంది. ఇటీవల వెనెజువెలాపై అమెరికా జరిపింది టెక్నాలజీ వారే. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఫైటర్‌జెట్ల ప్రాధాన్యం, డ్రోన్ల ప్రాధాన్యం పెరుగుతోంది. అదే సమయంలో వాటని పసిగట్టే టెక్నాలజీ, తిప్పికొట్టే సాంకేతికతకు అదేస్థాయిలో డిమాండ్ ఉంది. ఆధునిక యుద్ధాల్లో శత్రు విమానాలను ముందుగా గుర్తించడం కీలకం. అమెరికా ఎఫ్–35 వంటి స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు రాడార్‌లకు దొరకకుండా రూపొందించింది. భారత్ ఇలాంటి ముప్పును ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహం రూపొందించింది. ‘మల్టీ–స్టాటిక్ రాడార్’ (ఎంఎస్‌ఆర్) వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఇది సాంప్రదాయ రాడార్‌ల పరిమితులను అధిగమించి, దాదాపు అదృశ్య వస్తువులను కూడా పట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది.
స్టెల్త్ టెక్నాలజీ చిత్తే..
స్టెల్త్ విమానాలు రాడార్ తరంగాలను శోషించి లేదా చెదరగొట్టి సిగ్నల్‌లను బలహీనపరుస్తాయి. ఎంఎస్‌ఆర్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. బహుళ గ్రౌండ్ స్టేషన్ల నుంచి తక్కువ ఫ్రీక్వెన్సీ తరంగాలను పంపి, వాటి ప్రతిఫలనాన్ని విశ్లేషిస్తుంది. ఇది ఎఫ్–35 లాంటి విమానాల రాడార్ క్రాస్–సెక్షన్‌ను (ఆర్‌సీఎస్) 0.001 చదరపు మీటర్ల వరకు కూడా గుర్తించగలదు. భారత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఈ టెక్నాలజీని స్వదేశీయంగా తయారు చేస్తోంది, దీనివల్ల దిగుమతి ఆధారాలు తగ్గుతాయి.
వ్యూహాత్మక ప్రాముఖ్యత..
ఎంఎస్‌ఆర్ ఒకే రాడార్‌కు పరిమితం కాకుండా, బహుళ స్టేషన్ల నెట్‌వర్క్ ద్వారా వేలాది కిలోమీటర్లు కవర్ చేస్తుంది.శత్రు జామర్లను అధిగమించి, కచ్చితమైన ట్రాకింగ్ అందిస్తుంది. ఎస్–400, అకాష్ వంటి సిస్టమ్‌లతో సమన్వయం చేసి, మిస్సైళ్లు లాంచ్ చేయడానికి సహాయపడుతుంది. చైనా, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల స్టెల్త్ సామర్థ్యాలను ఎదుర్కొనేందుకు ఇది భారత వాయు రక్షణకు గట్టి మూలాలు. భవిష్యత్తులో ఏఎంసీఏ వంటి స్వదేశీ ఫైటర్‌లతో కలిపి ఉపయోగిస్తే, భారత్ గగనతలం దుర్భేధ్యంగా మారుతుంది.
డీఆర్డీవో ఇందుకు రూ.500 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేస్తోంది. 2027 నాటికి ప్రోటోటైప్ టెస్టులు పూర్తవ్బడతాయని అంచనా. ఇది ’ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి సరిపోతూ, డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్‌లకు కొత్త అవకాశాలను తెరుస్తుంది. అయితే, అమెరికా టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ పరిమితులు, సైబర్ థ్రెట్‌లు సవాల్‌గా ఉన్నాయి.
