మన దగ్గర జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం సాధారణ స్థితికి వచ్చేసింది. రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. దాదాపుగా అందరూ ఏసీలు వాడడం తగ్గించేశారు. ఫ్యాన్లతోనే గడిపేస్తున్నారు. కానీ.. అమెరికాలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఏసీలు 18 పాయింట్ మీదకు తెచ్చి పెట్టినా.. చల్లగాలి తగిలి చావట్లేదట! ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. చివరకు తాగునీటికి సైతం కటకట ఏర్పడింది! ఎండలు ఆ స్థాయిలో మండిపోతున్నాయి మరి! అవును.. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రత నిన్న నమోదైంది!
ప్రధానంగా పశ్చిమ అమెరికాలోని రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వాటి పరిధిలోని సుమారు నాలుగు కోట్ల మంది ప్రజలు నెత్తిన కుంపటి పెట్టినంతగా ఇబ్బంది పడుతున్నారు. ఆ దేశంలోని 12 రాష్ట్రాల్లో గతంలో కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో ఎండలు మండిపోతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
కాలిఫోర్నియాలో 47 డిగ్రీలు, ఫీనిక్స్ ప్రాంతంలో ఏకంగా 46 డిగ్రీల ఎల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 60 ఏళ్లలో ఇదే గరిష్టంగా చెబుతున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు ఉన్న గరిష్ట ఉష్ణోగ్రత రికార్డులను ఇప్పటి ఎండలు అధిగమిస్తున్నాయి.
సముద్రంలో ఏర్పడిన ఉష్ణోగ్రతల తేడాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ పరిస్థితిని హీట్ డోమ్ అంటారని తెలిపింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగానే తరచూ ఈ పరిస్థితి సంభవిస్తోందని, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇదే విధంగా నమోదవుతాయని తెలిపింది. ఎండలు మండిపోతుండడంతో.. ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో.. తప్పని పరిస్థితుల్లో కొవిడ్ నిబంధనలను కూడా సడలించింది.
భౌతిక దూరం వంటివి పక్కన పెట్టి.. చల్లటి ప్రదేశాలకు వెళ్లి సేదతీరేందుకు అనుమతించింది. దీంతో.. ప్రజలు తమకు అందుబాటులో ఉన్న స్విమ్మింగ్ పూల్స్, ఏసీ థియేటర్లలో చేరిపోయి ఉక్కపోత నుంచి విశ్రాంతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. రాబోయూ మూడునెలలు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.