H1B Visa: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక భారత్‌పై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే అనేక నిబంధనలు విధించారు. టారిఫ్‌లు వేశారు. ఇక అక్రమ వలసదారులు అంటూ వేల మందిని వెనక్కు పంపించారు. గ్రీన్ కార్డు నిబంధనలు, హెచ్–1బీ వీసా నిబంధనలు కఠినతరం చేశారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని అమెరికా కంపెనీలను ఆదేశించారు. తాజాగా అమెరికా కాంగ్రెస్‌లో మరోసారి హెచ్–1బీ వీసా ప్రోగ్రామ్‌పై చర్చ మొదలైంది. ఈసారి పూర్తిగా రద్దు చేయాలన్న ప్రయత్నం జరుగుతోంది. రిపబ్లికన్ ప్రతినిధి మార్జరీ టేలర్ గ్రీన్ ఈ ప్రతిపాదనను తీసుకువచ్చాడు. అది రాజకీయ మద్దతు పొందే అవకాశమూ ఉంది. దశాబ్దాల కాలంగా టెక్ రంగం అభివృద్ధికి దోహదపడిన ఈ పథకం, ఇప్పుడు ‘‘అమెరికన్ ఉద్యోగాలపై భారంగా మారిందా?’’ అన్న ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది.
అమెరికన్‌లకే అవకాశాలు దక్కాలని..
టేలర్ వాదన ప్రకారం, విదేశీ నిపుణులు స్థానిక యువతకు ఉన్న ఉద్యోగ అవకాశాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. వైద్య, నర్సింగ్ రంగాల్లో మాత్రమే పరిమిత సంఖ్యలో వీసాలు ఇవ్వాలి అని సూచించారు. అయితే, ఈ వాదనకు ప్రతివాదంగా పరిశ్రమలు స్థానికంగా అంత నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో లేరని మరికొందరు వాదిస్తున్నారు.అంతేకాకుండా, అమెరికా వైద్యశాఖల్లో పలు గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ విదేశీ వైద్యులపై ఆధారపడుతున్నాయి.
భారతీయ నైపుణ్యానికి ఎదురువేగం
ప్రతీ ఏటా జారీ అయ్యే హెచ్–1బీ వీసాల్లో దాదాపు 70 శాతం భారతీయులకు చెందుతాయి. సిలికాన్ వ్యాలీ నుంచి న్యూయార్క్ ఆసుపత్రుల వరకు భారతీయ ఇంజనీర్లు, వైద్యులు విస్తారంగా ఉన్నారు. కొత్త ప్రతిపాదన వెనుక ఉన్న కఠిన నిబంధనలు అమలైతే, వేలాది భారతీయ కుటుంబాల వృత్తి జీవితం అంతరించిపోనుంది. ఐటీ దిగ్గజాలు కూడా తమ ప్రాజెక్టులు నెమ్మదిగా సాగవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది..
ట్రంప్ మార్గంలోనే?
హెచ్–1బీపై గట్టి అడ్డుకట్ట విధించే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షత కాలం నుంచే మొదలైంది. దరఖాస్తులపై అదనపు ఫీజులు, కఠిన ఎంపిక వ్యవస్థ వంటి చర్యలతో వలస నియంత్రణ బలోపేతం అయింది. ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త చర్చ ట్రంప్ శైలినే పునరావృతం చేస్తుంది. బైడెన్ ప్రభుత్వం సడలింపు వైఖరి చూపినా, రిపబ్లికన్ లాబీ ఒత్తిడి వలస విధానాలను మళ్లీ కఠినతరం చేయగలదు.
అమెరికా విద్యావిదేశాంగ విధానాల మార్పు వల్ల కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలు కొత్త గమ్యస్థానాలుగా మారే అవకాశం ఉంది. హెచ్–1బీ పరిమితులు పెరిగితే సాంకేతిక నైపుణ్య మేధావులు ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు మొగ్గుతారు. దీని వల్ల దీర్ఘకాలంలో అమెరికాకే నష్టం కలిగే సూచనలు నిపుణులు చెబుతున్నారు.