Gaza Water Crisis: గాజా ఖాళీ.. గుక్కెడు నీరు దొరక్క విలవిల

ఏకే 47 తుపాకులు భుజాన వేసుకున్న హమాస్‌ ఉగ్రవాదులు చిన్నారులను లాలిస్తూ బుజ్జగించే వీడియో ఒకటి బయటకు వచ్చింది. తల్లిదండ్రు ల కోసం ఏడుస్తున్న చిన్న పిల్లలను భుజాన వేసుకొని కొందరు లాలిస్తుండగా

Written By: K.R, Updated On : October 16, 2023 11:07 am
Follow us on

Gaza Water Crisis: తినేందుకు తిండి లేదు. ఉండేందుకు ఇల్లున్నా ఏ క్షణంలో బాంబు దాడులకు గురవుతుందో తెలియదు. కరెంట్‌ లేదు. బయటి ప్రపంచంతో సంబంఽధం లేదు. బాంబుల మోతలు, ఇజ్రాయిల్‌ సైన్యం పదఘట్టనలు. క్షణం క్షణం భయం భయం.. ఇదీ గాజాలో అక్కడి ప్రజలు అనుభవిస్తున్న నరకం. గుక్కెడు నీరు దొరకడం లేదంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడి పరిస్థితిని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి కంటే నరకం నయం అని వ్యాఖ్యానించింది.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని..

ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి పాలస్తీనీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దక్షిణ ప్రాంతాల వైపు తరలిపోతున్నారు. ఇజ్రాయెల్‌ హెచ్చరించటంతో దాదాపు నాలుగు లక్షల మంది పౌరులు నివాసాలను వదిలిపెట్టి వెళ్లిపోయారు. మరోవైపు, గాజా సమీపంలో మోహరించిన తమ దేశ సైనిక బలగాల్ని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సందర్శించారు. తదుపరి దశకు మీరు సిద్ధమే కదా అని సైనికులను ఆయన ప్రశ్నించారు. వారు సిద్ధమేనని చెప్పారు. గాజాలో భూతల యుద్ధానికి ఇజ్రాయెల్‌ సిద్ధమవుతున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది. గాజాలో ‘సురక్షిత ప్రాంతాలను’ ఏర్పాటు చేసి, అక్కడికి పౌరులను తరలించే అంశాన్ని కూడా ఇజ్రాయెల్‌ పరిశీలిస్తోంది. దీనిపై ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు.. గల్ఫ్‌ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో చర్చించారు. కాగా, ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల వల్ల గాజాలో 1300కుపైగా భవానాలు నేలమట్టమయ్యాయి. 55 వేల నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకూ 2,215 మంది పాలస్తీనీయులు మరణించారు. 8,714 మంది గాయపడ్డారు.

హిజబుల్లా దిగితే భూకంపమే: ఇరాన్‌

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను ఆపకపోతే పశ్చిమాసియా అంతటా హింసాకాండ విస్తరిస్తుందని ఇరాన్‌ హెచ్చరిస్తోంది. హిజబుల్లా రంగంలోకి దిగితే ఇజ్రాయెల్‌లో భూంకంపమేనని ప్రకటించింది. దాదాపు లక్షన్నర రాకెట్లు, క్షిపణులను కలిగి ఉన్న హిజబుల్లాతో తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఇజ్రాయెల్‌ కూడా భావిస్తోంది. తాము పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని, సరైన సమయంలో యుద్ధంలోకి దిగుతామని హిజబుల్లా ఉప అధిపతి నాయిమ్‌ ఖాసిమ్‌ ప్రకటించారు. గాజా మీద ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా పశ్చిమాసియా వ్యాప్తం గా నిరసనలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా జోర్డాన్‌, బహ్రెయిన్‌లలో ప్రజలు భారీఎత్తున ఆందోళనలు జరుపుతున్నారు.

చిన్నారులను లాలించిన ఉగ్రవాదులు

ఏకే 47 తుపాకులు భుజాన వేసుకున్న హమాస్‌ ఉగ్రవాదులు చిన్నారులను లాలిస్తూ బుజ్జగించే వీడియో ఒకటి బయటకు వచ్చింది. తల్లిదండ్రు ల కోసం ఏడుస్తున్న చిన్న పిల్లలను భుజాన వేసుకొని కొందరు లాలిస్తుండగా, ఓ వ్యక్తి ఒక పాప షూ లేసు కడుతుండటం ఈ వీడియోలో కనిపించింది. మరో మిలిటెంట్‌ ఓ చిన్నారికి తాగటానికి నీళ్లిస్తూ.. బిస్మిల్లా అని చెప్పాలని సూచించాడు. ఆ చిన్నారి కూడా బిస్మిల్లా అని నీళ్లు తాగింది.

విమాన సర్వీసుల రద్దు పొడగింపు

ఇజ్రాయెల్‌, హమాస్‌ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న పోరు నేపథ్యంలో ప్రకటించిన విమాన సర్వీసుల రద్దును ఎయిరిండియా పొడిగించింది. అక్టోబరు 18 వరకు ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరం టెల్‌ అవీవ్‌కు తమ విమానాల రాకపోకలు ఉండవని ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి టెల్‌ అవీవ్‌కు బుధ, శుక్రవారాలు మినహా వారానికి ఐదు ఎయిరిండియా విమానాలు ఉన్నాయి. యుద్ధ నేపథ్యంలో ఈ సర్వీసులను తొలుత అక్టోబరు 14 వరకు సస్పెండ్‌ చేశారు. ఆ సస్పెన్షన్నే ఇప్పుడు పొడిగించారు. అయితే, షెడ్యూల్‌ సర్వీసులు తాత్కాలికంగా ఉండవని, అవసరమైతే ఇజ్రాయెల్‌కు చార్టెర్‌ విమాన సర్వీసులు నడుపుతామని ఎయిరిండియా పేర్కొంది.