Trump 2.0 : అమెరికాలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఒకదాని తర్వాత ఒకటిగా అనేక పెద్ద అపాయింట్‌మెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలోకి ఓ హిందూ నాయకుడు కూడా చేరాడు. అమెరికా కొత్త డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డిఎన్‌ఐ)గా తులసీ గబ్బర్డ్‌ను ట్రంప్ నియమించారు. మాజీ కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్ అమెరికా మొదటి హిందూ కాంగ్రెస్ మహిళగా కూడా గుర్తింపు పొందారు. తులసి అనుభవజ్ఞురాలైన సైనికురాలు, మిడిల్ ఈస్ట్ ఆఫ్రికాలోని యుద్ధ ప్రాంతాలకు వివిధ సందర్భాలలో ఆమె మోహరించారు. కొంతకాలం క్రితం డెమొక్రాట్ పార్టీ నుంచి విడిపోయిన ఆమె ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీలో చేరారు. తులసితో పాటు విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి పేర్లను కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
విదేశాంగ మంత్రిగా మార్కో రూబియో
అమెరికా కొత్త విదేశాంగ మంత్రి పేరును కూడా డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. అమెరికా విదేశాంగ మంత్రిగా ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోను ట్రంప్ నియమించారు. రూబియో సంప్రదాయవాద నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తరచుగా చైనా, క్యూబా, ఇరాన్‌లకు వ్యతిరేకంగా తన బలమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రూబియో 2010లో తొలిసారిగా సెనేట్‌కు ఎన్నికయ్యారు. 2016లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోటీ సందర్భంగా రూబియో ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఆయనను లిటిల్ మార్కో అని కూడా పిలిచారు. అయితే, ఇప్పుడు రూబియో ట్రంప్‌కు అతిపెద్ద మద్దతుదారులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
న్యూస్ యాంకర్‌కి రక్షణ మంత్రి పదవి
అంతే కాకుండా అమెరికా కొత్త డిఫెన్స్ సెక్రటరీ పేరును కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫాక్స్ న్యూస్ హోస్ట్, రచయిత, రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ పీట్ హెగ్‌సేత్‌ను డిఫెన్స్ సెక్రటరీ పదవికి ట్రంప్ ఎంపిక చేశారు. 44 ఏళ్ల పీట్ హెగ్‌సేత్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌లలో సైన్యంలో పనిచేశారు. పీట్‌ను నియమిస్తున్నప్పుడు, ట్రంప్ ఆయనను కఠినమైన, తెలివైన, అమెరికా ఫస్ట్‌లో నిజమైన విశ్వాసం ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు. దీనితో పాటు, ట్రంప్ ఆ దేశ కొత్త అటార్నీ జనరల్‌గా ఫ్లోరిడాకు చెందిన కెమెట్ గేట్జ్‌ను ఎన్నుకున్నారు.
అలాగే ట్రంప్ మరికొన్ని పదవులను నియమించారు..
* వైస్ ప్రెసిడెంట్ – జేడీ వాన్స్
* గవర్నమెంట్ ఎఫిషియన్సీ అడ్వైజర్స్ – మస్క్, వివేక్ రామస్వామి
* డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ – తులసీ గబ్బార్డ్
* సెక్రటరీ ఆఫ్ స్టేట్ – మార్కో రూబియో
* అటార్నీ జనరల్ – మ్యాట్ గేజ్
* డిఫెన్స్ సెక్రటరీ – పేట్ హెసెత్
* నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ – మైక్ వాల్ట్జ్
* వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ – సూసీ వైల్స్