https://oktelugu.com/

Dubai Rains: దుబాయ్.. ఎన్నడూ చూడని ఉపద్రవం ఇదీ

ఏడాదంతా కురిసే వర్షం.. దుబాయ్‌లో మంగళవారం ఒక్కరోజే కురిసింది. భారీ వర్షం కారణంగా దుబాయ్‌ మొత్తం అస్తవ్యస్తమైంది. షాపింగ్‌ మాల్స్‌లోకి మోకాలిలోతు నీరు చేరింది.

Written By:
  • Dharma
  • , Updated On : April 17, 2024 / 01:10 PM IST

    Dubai Rains

    Follow us on

    Dubai Rains: దుబాయ్‌.. ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఎడారి. అక్కడ వర్షాలే కురవవు. ఏడాదిలో ఒకటి రెండుసార్లు మాత్రమే వానలు కురుస్తాయి. అలాంటి దేశంలో ఇప్పుడు అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో దుబాయ్‌ అతలాకుతలమవుతోంది. మంగళవారం(ఏప్రిల్‌ 16న) ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్‌పోర్టు అయిన దుబాయ్‌ విమానాశ్రయానికి వరద పోటెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అనేక విమానాలను దారిమళ్లించారు. కొన్ని సర్వీసులను రద్దు చేశారు.

    అస్తవ్యస్తం..
    ఏడాదంతా కురిసే వర్షం.. దుబాయ్‌లో మంగళవారం ఒక్కరోజే కురిసింది. భారీ వర్షం కారణంగా దుబాయ్‌ మొత్తం అస్తవ్యస్తమైంది. షాపింగ్‌ మాల్స్‌లోకి మోకాలిలోతు నీరు చేరింది. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపనోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు భవనాలపైకి ఎక్కారు.

    సోషల్‌ మీడియాలో వరద దృశ్యాలు..
    దుబాయ్‌లో వరదల దృశ్యాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పర్యావరణ మార్పులపై ఆందోళన రెకెత్తించాయి. వర్షం ఒక్క దుబాయ్‌లోనే కాకుండా యూఏఈ పొరుగున ఉన్న బహ్రెయిన్‌ వరకు ఉన్నట్లు తెలుస్తోంది. బహ్రెయిన్‌లోనూ అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద చేరింది. దీంతో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

    మళ్లీ వర్షం కురిసే అవకాశం..
    ఇదిలా ఉండగా, బుధవారం(ఏప్రిల్‌ 17న) కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రభుత్వం తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అవకాశం కల్పించింది. ఇక ఒమన్‌లో వర్ష బీభత్సానికి 18 మంది మరణించారు. దుబాయ్‌లో వర్షపునీరు రోడ్లపైకి చేరడంతో వాహనాలు ఆ నీటిలో నెమ్మదిగా వెళ్తున్నాయి దుబాయ్‌లో వర్షాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఇది ముంబై కాదు.. దుబాయ్‌’ అని క్షాన్‌ ఇచ్చారు.

    145 మిల్లీ మీటర్ల వర్షం..
    రాతి ఎడారిగా పేరున్న ఎమిరేట్‌ ఆఫ్‌ ఫుజైరాలో కూడా 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూఏఈలో ఈ స్థాయి వర్షాలు చాలా చాలా అరుదు. వాతావరణ మార్పుల కారణంగా 2–3 ఏళ్లుగా ఇలా కుంభవృష్టి కురుస్తోంది.