Mauritania : అమ్మాయిలు అందంగా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అందంగా ఉంటే ఏదో పెద్ద ఆస్తులు సంపాదించినట్టు చూస్తారు. ఇక కాస్త లావుగా ఉన్న అమ్మాయి కనిపిస్తే బాబోయ్ ఆమె ఏదో తప్పు చేసినట్టు చూస్తారు. అయ్యో తన వంక కన్నెత్తి కూడా చూడరు కొందరు. స్లిమ్ గా, అందంగా ఉంటే తెగ ఇంట్రెస్ట్ పెడుతారు. ఓన్లీ అబ్బాయిలు మాత్రమే కాదండోయ్ చాలా మంది ఇదే ఫాలో అవుతారు. ఇదంతా ఎందుకు ఇప్పుడు మాకు అనుకుంటున్నారా? మీరు లావుగా ఉన్నారా? అవును అంటూ బాధ పడుతున్నారా? కానీ ఒక ప్రాంతంలో మాత్రం లావుగా ఉన్నామని అదృష్టంగా ఫీల్ అవుతారు. వారు మాత్రమే కాదండోయ్ చుట్టూ ఉన్నవారు కూడా వారిని అదృష్టంగానే భావిస్తారు. ఇదేదో తేడాగా ఉందే అనుకుంటున్నారా? అయితే కన్ఫూజన్ ఎందుకు ఇదిగో క్లారిటీ…
ఓ దేశంలో లావుగా ఉన్న అమ్మాయిలను అదృష్టవంతులుగా భావిస్తారు ప్రతి ఒక్కరు. మన దగ్గర చాలా మంది లావుగా ఉంటే అన్నం తినకుండా తెగ డైటింగ్ లు చేస్తుంటారు. కానీ అక్కడ మాత్రం లావుగా అవ్వాలని పుల్ గా వండి పెడుతుంటారు. అంత గొప్ప దేశం ఏది అనుకుంటున్నారా? ఉత్తర పశ్చిమ ఆఫ్రికా దేశమైన మౌరిటానియా. ఇది చాలా వెనుకబడిన ఎడారి దేశం. నిజంగానే ఇక్కడ లావుగా ఉన్న అమ్మాయిలను ఇష్టపడతారు ప్రజలు. పురాతన ఆచారాల ప్రకారం.. ఈ దేశంలో లావుగా ఉండే ఆడపిల్లలను అదృష్టంగా భావించేవారట. గొప్ప సంపద, కుటుంబ ప్రతిష్టకు చిహ్నంగా ఉండేవారట. అందుకే అక్కడ పుట్టే ఆడపిల్లలు లావుగా ఉండాలని, లేదంటే పుట్టిన తర్వాత అయినా సరే లావుగా మారాలి అని తెగ ప్రయాస పడతారట తల్లిదండ్రులు.
మౌరిటానియాలో ఈ సంప్రదాయాన్ని లాబ్లౌ అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి బరువు పెరగడానికి అమ్మాయిలకు ప్రత్యేక ఆహారాన్ని ఇస్తుంటారట. ఇందుకోసం ఎక్కువ కేలరీలు ఉన్న పాలు, వెన్న వంటి ఆహార పదార్ధాలను బాల్యం నుంచే తినిపిస్తుంటారు. తినకపోతే బలవంతంగా తినిపిస్తారు. ఇప్పుడు కాదండోయ్ బాబు.. ఈ ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతుందట. లావుగా ఉన్న వధువు కుటుంబ ప్రతిష్టను పెంచుతుందని బాగా నమ్ముతారు అక్కడి ప్రజలు. ఇంటికి ఆర్థిక శ్రేయస్సును తెస్తుందని కూడా గట్టి నమ్మకం.
ఇక మన దగ్గర స్లిమ్ అవడానికి ట్రైనింగ్ సెంటర్లు, జిమ్ లకు వెళ్లడం చేస్తుంటారు కదా. అదేవిధంగా మారిటానియా దేశంలో లావు అవ్వడానికి, బరువు పెరగడానికి ‘ఫాటెనింగ్ ఫార్మ్స్’ లో జాయిన్ అవుతుంటారట. లావు పెంచే సెంటర్లు ఆ దేశంలో అడుగడుగునా ఉంటాయి. ఐదు సంవత్సరాల వయసు వస్తే చాలు ఆడపిల్లను తల్లిదండ్రులు ఈ ఫార్మ్స్‌లో జాయిన్ చేస్తారు. బరువు పెంచేవారిని ‘ఫాటెనర్లు’ అని కూడా పిలుస్తారు.. మౌరిటానియాలో చాలా మంది ఇప్పటికీ ఆడపిల్లలను లావుగా మార్చే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే అక్కడ ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తుండటంతో కొందరు ఈ ఆచారాన్ని పాటించడం లేదట. లావు ఉండటం వల్ల ఊబకాయం ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి కాబట్టి ఆలోచిస్తున్నారట కొందరు.