Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ట్రంప్.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే జన్మతః పౌరసత్వం రద్దు చేశారు. ఉద్యోగులను 8 నెలల వేతనం తీసుకుని వెళ్లిపోవాలని సూచించారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినం చేశారు. అక్రమ వలసదారులను గుర్తించి సైనిక విమానాల్లో వారి దేశాలకు తరలిస్తున్నారు. తాజాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాలపై సుంకాలు విధించి ఝలక్ ఇచ్చారు. మెక్సికో, కెనడా, చైనా దేశాలపై టారిఫ్లు విధించారు. ఈక్రమంలో దేశీయ ఆదాయం పెంచడానికి ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆ సుంకాలను వినియోగిస్తామని ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయంపై సర్వత్ర చర్చ జరుగుతోంది.
అన్నంత పనిచేసిన ట్రంప్..
తాను అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత దూకుడు పెంచిన ట్రంప్.. ముందు నుంచి చెబుతున్నట్లుగానే దిగుమతులపై సుంకాలు పెంచారు. ఒకేసారి మూడు దేశాలకు ఒక్క కలం పోటుతో షాక్ ఇచ్చారు. మెక్సికో, కెనడా దిగుమతులపై 25 శాతం, చైనా దిగుమతులపై 10 శాతం సుంకం పెంచారు. ఈమేరకు ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ఫెంనాలిల్ సహా అమెరికాలోకి వస్తున్న అక్రమ విదేశీయులు, ప్రాణాంతక మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ) ప్రకారం సుకాలు విధించినట్లు వెల్లడించారు. అమెరికన్ల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అందరి భద్రతను నిర్ధారించడం అధ్యక్షుడిగా తన బాధ్యత అని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నాను అని తెలిపారు.
ఆ దేశాలపై తీవ్ర ప్రభావం..
అమెరికా విధించిన సుంకాలతో అమెరికాలో వృద్ధి తగ్గుతుందని తెలుస్తోంది. ఇదే సమయంలో కెనడా, మెక్సికో దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది అమెరికా ఆర్థిక వృద్ధి 1.5 శాతం తగ్గుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ట్రంప్ ఆదేశాల ప్రకారం మంగళవారం రాత్రి 12:01 గంటలకు(భారత కాలమానం ప్రకారం.. ఉదయం 5:01) గంటలకు సుంకాలు అమలులోకి వస్తాయి. రవాణాలో ఉన్న వస్తువులు, కటాఫ్ సమయానికి ముందే అమెరికా సరిహద్దుల్లోకి ప్రవేశిస్తే మినహాయింపు ఉంటుంది.