Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. 2025, జనవరి 20న ఆయన అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగు పెట్టనున్నారు. అధికార బదిలీకి సమయం ఉండడంతో ఆయన మంత్రివర్గ కూర్పు, కార్యవర్గం ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే విధేయులకు మంత్రి పదవులు, సమర్థులకు వైట్‌హౌస్‌తోపాటు వివిధ విభాగాల బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. జనవరి 20 తర్వాత నియామకాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. అధికారంలోకి అమెరికాను గొప్పగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. యుద్ధాలు ఆపుతానన్నారు. అక్రమంగా అమెరికాలో ఉంటున్నవారిని తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ హామీల అమలుపైనా దృష్టి పెట్టారు. చట్టబద్ధంగా వచ్చేవారికి మార్గం సుగమం చేయడంలో భాగంగా చర్యలు చేపడుతన్నారు. ఇది భారతీయులకు శుభవార్తే అంటున్నారు నిపుణులు.
ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడి..
తాజాగా ట్రంప్ ఎన్‌బీసీ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు అంశాలను వెల్లడించారు. అమెరికా సాధికారికంగా ప్రవేశం పొందాలనుకునేవారు తమ దేశాన్ని కూడా ప్రేమించాలన్నారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటె చెప్పగలగాలని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో జైళ్ల నుంచి నేరస్తులు నేరుగా అమెరికాకు వస్తున్నారని అన్నారు. అలాంటివారు 13,099 మంది ఉన్నట్లు తెలిపారు. నేరస్థులు అమెరికా వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదకర వ్యక్తులను దేశంలో ఉండకుండా వెళ్లగొడతామని తెలిపారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రుల సంతాన(డ్రీమర్స్)లో చాలా మంది ఇక్కడే పుట్టి పెరిగారని, వారిలో చాలా మంది మంచి స్థాయిలో స్థిరపడ్డారని పేర్కొన్నారు. వారి సమస్యను పట్టించుకుంటామని చెప్పారు. ప్రతిపక్ష డెమొక్రాట్లతోకలిసి వలసలకు పరిష్కారం కనుగొంటామన్నారు.
అమెరికాలో చేరడం మంచిది..
పొరుగు దేశాలైన కనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి లక్షల మంది అక్రమంగా వలస వస్తున్నారని ట్రంప్ తెలిపారు. దీనిని నిరోధంచకపోతే.. రెండు దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని తెలిపారు. దీంతో ఆ రెండు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అలా కుదరని పక్షంలో అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా, 52వ రాష్ట్రంగా మెక్సికో చేరిపోవడం మంచిదని వెల్లడించారు.
భారీగా రాయితీలు..
ఇదిలా ఉంటే కెనడాకు అమెరికా 10 వేల కోట్ల డాలర్లు, మెక్సికోకు 30 వేల కోట్ల డాలర్ల చొప్పున రాయితీ అందిస్తోంది. వలసలు ఆగకపోతే వీటిని నిలిపివేసే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. చైనా తదితర దేశాలపై సుంకాలు పెంచితే సరుకుల ధరలు పెరిగి సామాన్య అమెరికన్ పౌరులు ఇబ్బంది పడతారని కంపెనీల సీఈవోల హెచ్చరికలను ట్రంప్ తోసి పుచ్చారు.