Homeఅంతర్జాతీయంDonald Trump: పౌరసత్వంతో ట్రంప్‌ ఆటలు.. వలసదారులకు అమెరికా రియాలిటీ షో..!

Donald Trump: పౌరసత్వంతో ట్రంప్‌ ఆటలు.. వలసదారులకు అమెరికా రియాలిటీ షో..!

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, 2025లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులపై కఠిన విధానాలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వలసదారులకు అమెరికా పౌరసత్వం కల్పించేందుకు ఒక నూతన, వివాదాస్పద ప్రతిపాదన రూపుదిద్దుకుంటోంది ఒక రియాలిటీ షో ద్వారా పౌరసత్వం అందించడం. ఈ ఆలోచన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (DHS) పరిశీలనలో ఉందని, ఇంకా ఆమోదం లేదా తిరస్కరణ పొందలేదని ఈఏ ప్రజావ్యవహారాల విభాగం వెల్లడించింది. ఈ ప్రతిపాదన సాంప్రదాయ వలస విధానాలను దాటి, వినూత్న కానీ వివాదాస్పద మార్గాన్ని సూచిస్తుంది. ఇది రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది.

Also Read: ప్రధాని చెంతకు లోకేష్.. చంద్రబాబు నయా ప్లాన్!

ప్రతిపాదిత రియాలిటీ షో ఎల్లిస్‌ ఐలాండ్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఇది చారిత్రాత్మకంగా వలసదారుల ప్రవేశ ద్వారంగా పిలవబడుతుంది. ఈ షోలో వలసదారులు అమెరికాపై తమ దేశభక్తిని, నిబద్ధతను చాటుకునేందుకు వివిధ పోటీలలో పాల్గొనాలి. ఈ పోటీలలో గోల్డ్‌ రష్‌ స్టైల్‌ టాస్క్‌లు, కార్‌ అసెంబ్లీ వంటి సాంకేతిక పనులు, అమెరికా చరిత్ర, సంస్కృతిపై పరీక్షలు ఉండవచ్చని సమాచారం. ప్రతి ఎపిసోడ్‌లో ఒక పోటీదారుడిని ఎలిమినేట్‌ చేసే విధానం అనుసరించవచ్చు, చివరి విజేతకు అమెరికా పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది. ‘‘ఇది వలసదారులను హీనంగా చూసే ‘హంగర్‌ గేమ్స్‌’ లాంటిది కాదు, దేశభక్తిని పరీక్షించే ఒక సానుకూల ప్రక్రియ’’ అని ఈఏ అధికారులు స్పష్టీకరించారు.

ట్రంప్‌ విధానాల నేపథ్యం
ట్రంప్‌ హయాంలో వలస విధానాలు కఠినంగా మారాయి. ఇటీవల వివిధ దేశాల నుండి వలసదారులకు అందించే తాత్కాలిక రక్షణ హోదా (TPS)ను రద్దు చేయాలని నిర్ణయించారు. యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, రాజకీయ అస్థిరత వంటి కారణాలతో స్వదేశానికి తిరిగి వెళ్లలేని విదేశీయులకు TPS రక్షణ కల్పిస్తుంది. ఈ రద్దు నిర్ణయం వల్ల వేలాది మంది వలసదారులు స్వదేశానికి తిరిగి వెళ్లవలసి రావచ్చు. ఈ నేపథ్యంలో, రియాలిటీ షో ద్వారా పౌరసత్వం అందించే ప్రతిపాదన అనూహ్యంగా, వివాదాస్పదంగా మారింది. విమర్శకులు దీనిని ‘‘వలసదారుల హక్కులను ఆటలాడుకునే రాజకీయ స్టంట్‌’’గా అభివర్ణిస్తున్నారు.

స్క్విడ్‌ గేమ్‌తో పోలిక..
ఈ రియాలిటీ షో ఆలోచన ప్రముఖ నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ‘స్క్విడ్‌ గేమ్‌’తో పోలికలను రేకెత్తిస్తోంది, దీనిలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న 456 మంది పోటీదారులు జీవన్మరణ పోటీలలో డబ్బు కోసం పోటీపడతారు. ‘స్క్విడ్‌ గేమ్‌’లో రెడ్‌లైట్, గ్రీన్‌ లైట్, టగ్‌ ఆఫ్‌ వార్‌ వంటి ఆటలు ఉండగా, ఈ షోలో అమెరికా సంస్కృతి, చరిత్రకు సంబంధించిన టాస్క్‌లు ఉండవచ్చు. స్క్విడ్‌ గేమ్‌ రెండు సీజన్లు విపరీతమైన ప్రజాదరణ పొందగా, మూడో సీజన్‌ 2025లో విడుదల కానుంది. ఈ పోలిక వలసదారుల హక్కులను, మానవత్వాన్ని ఆటల రూపంలో తేలికచేసే ప్రమాదం గురించి సామాజిక విమర్శలను రేకెత్తిస్తోంది.

విమర్శలు, సవాళ్లు
ఈ ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డెమోక్రటిక్‌ పార్టీ నాయకులు, మానవ హక్కుల సంస్థలు దీనిని ‘‘వలసదారుల గౌరవాన్ని కించపరిచే ఆలోచన’’గా ఖండించాయి. అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ (ACLU) ఈ షో ‘‘పౌరసత్వ ప్రక్రియను వినోదంగా మార్చి, వలసదారుల జీవితాలను తేలిగ్గా చిత్రీకరిస్తుంది’’ అని హెచ్చరించింది. అదనంగా, ఈ షో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది, ఎందుకంటే పౌరసత్వం కల్పించే ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. రియాలిటీ షో ఫార్మాట్‌ ఈ సూత్రాలను ఉల్లంఘించవచ్చని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version