Srilanka : చైనా వద్దు.. భారత్ వద్దు.. శ్రీలంక దుస్థితితో కొత్త అధ్యక్షుడికి కనువిప్పు

క్షవరం అయితేనే వివరం అర్థమవుతుంది.. ఇది తెలిసే లోపే శ్రీలంక అప్పుల్లో కూరుకుపోయింది. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రాణాలు చేతిలో పెట్టుకొని పారిపోవాల్సి వచ్చింది. అయితే ఇదంతా గతమని.. గతం నుంచి మేము పాఠాలు నేర్చుకుందామని శ్రీలంక పాలకులు చెబుతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 24, 2024 9:38 pm

Srilanka President

Follow us on

Srilanka : శ్రీలంక అధ్యక్షుడిగా అసుర కుమార దిస నాయకే బాధ్యతలు స్వీకరించారు. శ్రీలంక ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో.. అధ్యక్షుడిగా తాను ఏం చేయాలో స్పష్టం చేశారు దిస నాయకే. ” ఇప్పటికే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏ దేశం వైపు వెళ్ళాలనుకోవడం లేదు. ఇదే సంఘ విధానంపై మాకు ఒక స్పష్టత ఉంది. భౌగోళిక రాజకీయ శత్రువుల మధ్య చిక్కుకోకూడదని భావిస్తున్నాం. ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉండాలని భావిస్తున్నాం. ఈ ఒక వర్గానికి మేము అనుకూలంగా ఉండదల్చుకోలేదు.. భారత్ – చైనా దేశాలతో సంబంధాలను తమ నేషనల్ పీపుల్స్ పవర్ ప్రభుత్వం సమానంగా చూసుకుంటూ వెళ్లాలని నిర్ణయించింది. భౌగోళిక యుద్ధంలో పోటీదారులం కావద్దని అంచనాకు వచ్చాం. భవిష్యత్తులోనూ వాటిలో మేము భాగస్వాములు కాదల్చుకోలేదు.. వీటివల్ల శ్రీలంక గతంలో శాండ్విచ్ లాగా నలిగిపోయింది. అందువల్లే ఆర్థిక కష్టాలు మా దేశాన్ని చుట్టుముట్టాయి. గత పరిపాలకుల నిర్లక్ష్యం వల్ల శ్రీలంక పరువు పోగొట్టుకుంది. ఇకపై అలాంటివి రావద్దని మేము భావిస్తున్నాం. సాధ్యమైనంతవరకు ప్రజలకు అనుగుణంగా పరిపాలన సాగించేందుకు ప్రణాళికలు రూపొందించాం. అనవసర ఖర్చులు పూర్తిగా తగ్గించాం.. ప్రజలపై పన్నుల భారాన్ని దశలవారీగా తగ్గించడానికి అడుగులు వేస్తున్నామని” దిస నాకే వ్యాఖ్యానించారు.

భారత్ – చైనా మధ్య మేము నలిగిపోం

భారత్ – చైనా మధ్య మేము నలిగిపోమని దిస నాయకే వ్యాఖ్యానించారు. ” రెండు దేశాలు మాకు విలువైనవి. ఆ దేశాలు మాకు బలమైన మిత్రులు.. మా ప్రభుత్వ హయాంలో రెండు దేశాలతో బలమైన స్నేహాన్ని కోరుకుంటున్నాం. ఐరోపా, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా దేశాలతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నాం. ప్రాంతీయ ఉధృతిలో పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంకలో సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలంటే తటస్థ వైఖరి చాలా అవసరం. ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో శ్రీలంక ఆ వ్యవహారాలలో వేలు పెట్టదు. ఉభయకుశలోపరి వంటి విధానాన్ని అవలంభిస్తుందని” దిస నాయకే పేర్కొన్నారు. కాగా ఇటీవల ఎన్నికల్లో దిస నాయకే విజయం సాధించారు. సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జయంత జయ సూరియా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుతం దిస నాయకే శ్రీలంక తొమ్మిదవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తాజా మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే కు దిస నాయకే కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, దిస నాయక్ అధ్యక్షుడు కావడంతో శ్రీలంక ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాలలో ముందడుగు వేస్తుందని భావిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.