Covid Cases: మన దేశంలో గత కొంతకాలంగా కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు తగ్గడంతో ప్రజల్లో సైతం కరోనా గురించి టెన్షన్ తగ్గుతోంది. అయితే బ్రిటన్ లో మాత్రం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలలో ఎక్కువమంది వ్యాక్సిన్లు తీసుకోవడంతో అక్కడి ప్రభుత్వం కరోనా నిబంధనలను అమలు చేయడం లేదు. ఫలితంగా రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

మాస్క్ లు ధరించకపోవడం, పాఠశాలలు తిరిగి తెరుచుకోవడం, అన్ని కార్యకలాపాలకు అనుమతులు లభించడంతో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అయితే గత రెండు వారాలుగా బ్రిటన్ లో రోజుకు 35,000 నుంచి 40,000 వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 100కు పైగా మరణాలు నమోదవుతుండగా బ్రిటన్ లో మొత్తం మరణాల సంఖ్య 1,38,000గా ఉంది.
బ్రిటన్ లో మిగతా దేశాలతో పోలిస్తే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం గమనార్హం. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రులలో చేరే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని అక్కడి వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్ లో ప్రధానంగా ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. కొంతమంది బూస్టర్ డోసులు తీసుకుంటున్నా కొత్త కేసులు మాత్రం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు బ్రిటన్ లో కేసులు పెరగడానికి గల కారణాలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటే మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.