Pakistan: ఎవరో వస్తున్నారు. హఠాత్తుగా తుపాకీ ఎక్కు పెడుతున్నారు. గుళ్ళు ఒకసారిగా శరీరంలోకి దూసుకెళ్తున్నాయి. చూస్తుండగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాడు. చుట్టూ ఉన్న జనం భయపడి పరుగులు తీస్తున్నారు. అక్కడ ఉన్న పోలీసులు కూడా ఆ ఘటనా స్థలం వద్దకి రావడానికి ఇష్టపడటం లేదు. సహజంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీడియాలో వార్తలు రావడం పరిపాటి. కానీ అందులోనూ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత వార్త ప్రసారమవుతున్నది. ఇదంతా చదువుతుంటే జేమ్స్ బాండ్, స్పై సినిమాలు గుర్తుకొస్తున్నాయి కదూ. ఆ సినిమాలను తలదన్నే విధంగానే భారత దేశానికి శత్రువులుగా ఉన్న వారిని తుద ముట్టిస్తున్న తీరు ఒళ్ళు గగుర్పోడిచేలా చేస్తున్నది.
పరిస్థితి మారింది
ఒకప్పుడు భారత వ్యతిరేకులు దేశాన్ని ఒక ఆట ఆడించేవారు. పాలకులు కూడా వారు చెప్పిన విధంగానే నడుచుకునేవారు. ఫలితంగా దేశంలో అల్లకల్లోలాలు జరిగేవి. శాంతి భద్రతలు కట్టు తప్పేవి. అరాచక శక్తులు రాజ్యమేలేవి. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ రక్షణ వ్యవస్థ సమూలంగా మారిపోయింది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో దేశ ఆర్మీకి సంపూర్ణ స్వేచ్ఛ లభించింది. ఫలితంగానే శత్రువుల సొంత స్థలాల్లోకి వెళ్లి దాడులు చేసే స్థాయికి భారత ఆర్మీ ఎదిగింది. ఇందులో కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఉన్నప్పటికీ.. భారత సైనిక విభాగం సాధించిన విజయాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే గతంలో డైరెక్ట్ ఎటాకింగ్ వ్యవస్థనే ఆర్మీ నమ్ముకునేది. ఇప్పుడు అందులోనూ సమూలంగా మార్పులు చేర్పులు చేసింది.
సినిమాలో మాదిరిగానే
. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రావడం.. ఆకస్మాత్తుగా కాల్పులు జరపడం.. టార్గెట్ వ్యక్తి కన్నుమూయడం వంటి ఘటనలు ఈమధ్య చకచకా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా ఇదే తీరుగా అంతర్ధానమవుతున్నారు. ఇటీవల పాకిస్తాన్ దేశంలో జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన మౌలానా రహీం ఉల్లా అనే ఉగ్రవాది ఖరాచీలో హతమయ్యాడు. అతడిని కొంతమంది దుండగులు కాల్చి హతమార్చారు. రహీం ఒక సమావేశానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. కాగా ఇలా ఉగ్రవాదులు హఠాత్తుగా హతమవడం ఇదే తొలిసారి కాదు.. ఇటీవల లష్కరే తోయిబాకు చెందిన అక్రమ్ ఖాన్, పటాన్ కోట్ దాడుల సూత్రధారి లతీఫ్, ఖ్వాజా షహీద్, రియాజ్ అహ్మద్ వంటి ముష్కరులు కూడా ఇలానే అనుమానాస్పద స్థితిలో ప్రత్యర్థుల చేతిలో కన్నుమూశారు.. కాగా భారతదేశానికి సంబంధించి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులు మొత్తం ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం వెనుక అజిత్ దోవల్ మాస్టర్ ప్లాన్ ఉందని చర్చ జరుగుతున్నది. రక్షణ శాఖ సలహాదారుగా నియమితులైన ఆయన.. దేశ అంతర్గత భద్రతకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల వల్లే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు నేలమట్టమవుతున్నాయి.. ఇదే సమయంలో భారత సైనిక విభాగానికి తిరుగులేని శక్తి యుక్తులు లభిస్తున్నాయి. అందువల్లే దేశానికి వ్యతిరేకంగా ఏ ప్రతిపశక్తి మాట్లాడటం లేదు.