Corona In China: చైనాలో జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేసిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఆసుపత్రులు రోగులతో కిట కిట లాడుతున్నాయి. 20 రోజుల్లో 248 మిలియన్ల మందికి కోవిడ్ సోకి ఉండొచ్చని ఒక అంచనా. అంటే చైనా జనాభాలో దాదాపు 18 శాతం మందికి కోవిడ్ నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఇదే కొనసాగితే డిసెంబర్ చివరి వారంలో ఒక్కరోజులోనే 3.7 కోట్లకు పైగా కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాప్తిగా పరిణామం చెందే అవకాశం ఉంది. దేశంలో కోవిడ్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అత్యవసరంగా భేటీ అయింది.. కోవిడ్ వ్యాప్తిని ఎలా అరికట్టాలనే అంశంపై తీవ్రంగా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.. మరోవైపు కోవిడ్ ను కట్టడి చేసేందుకు అవలంబించిన జీరో కోవిడ్ పాలసీ వల్ల హార్డ్ ఇమ్యూనిటీ తగ్గి… ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వ్యాప్తి చెందేందుకు దారి తీసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. తాజా వ్యాప్తిలో చిచువాన్ ప్రావిన్స్ లోని సౌత్ వెస్ట్, బీజింగ్ లో సగానికి పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అంచనా వేస్తోంది. అయితే చైనా హెల్త్ రెగ్యులేటరీ ఈ అంచనాలకు ఎలా వచ్చిందని అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు.
పిసిఆర్ టెస్టింగ్ సెంటర్లను మూసివేసింది
కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల ప్రారంభంలో దేశవ్యాప్తంగా పిసిఆర్ టెస్టింగ్ సెంటర్లను చైనా మూసివేసింది. అందువల్ల ఎంతమందికి కోవిడ్ సోకుతుందన్న అంశంపై ఖచ్చితమైన లెక్కలు బయటకు రావడం లేదు. ఇక వ్యక్తిగత శ్రద్ధతో రాపిడ్ యాంటిజెంట్ టెస్టులు చేయించుకున్న వారు సైతం పాజిటివ్ వస్తే ప్రభుత్వ అధికారులకు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు.. దీంతో ప్రతిరోజు ఎన్ని కేసులు నమోదవుతున్నాయనే విషయాన్ని చైనా ప్రభుత్వం చెప్పడం లేదు. మరోవైపు జనవరి చివరి నాటికి చైనాలోని ప్రధాన నగరాల్లో కరోనా మహమ్మారి తారస్థాయికి చేరుకునే అవకాశం ఉందని డేటా కన్సల్టెన్సీ సంస్థ మెట్రో డేటా టెక్ చీఫ్ ఎకనామిస్ట్ చెన్ క్వీన్ వెల్లడించారు. గత వేరియంట్ల వ్యాప్తిని పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపించిన ఈ వైరస్ క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంది. వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా మరణాలు నమోదయ్యాయి..
బ్లూం బర్గ్ ఏమంటున్నదంటే..
అయితే ప్రముఖ వార్తా సంస్థ బ్లూం బర్గ్ మాత్రం ఈ అంచనాలను కొట్టిపారేస్తున్నది. డిసెంబర్ 20న కేవలం 3,049 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని, అలాంటిది ఈ వారంలో ఒక్కరోజులోనే 3.7 కోట్ల కేసులు నమోదు కావడం సాధ్యం కాకపోవచ్చని తెలిపింది.. కోవిడ్ వ్యాప్తి ఉచితంగా ఉన్న సమయంలో జనవరి 19 2022న అత్యధికంగా 40 లక్షల కేసులు నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా ఆ వార్త సంస్థ ప్రస్తావించింది.
షాంగై లో ఇలా…
చైనాలో జనాభా పరంగా అతిపెద్ద నగరమైన షాంగై లో వారం రోజుల్లో గరిష్ట కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చైనా ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.. వైరస్ వ్యాప్తి ఉదృతంగా ఉన్నప్పటికీ దానిని చైనా అధికారులు తక్కువ చేసి చూపుతున్నారు.. మరోవైపు మరణాలు కూడా ఎటువంటివి సంభవించలేదని వెల్లడిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.. 2.4 కోట్ల జనాభా ఉన్న షాంగై లో కోవిడ్ గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అంటువ్యాధుల నివారణ కేంద్రం డైరెక్టర్ జాంగ్ వెన్ హాంగ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇది దేశ వైద్య వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ వేవ్ రెండు నెలల పాటు కొనసాగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.. ఇదే సమయంలో షాంగై నగరంలోని ఆసుపత్రులను సందర్శించినప్పుడు తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్న వృద్ధుల సంఖ్య తక్కువ ఉండటం సానుకూల అంశం.. అయితే ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎఫ్.7 వల్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. చాంగ్ కింగ్ నగరంలోని స్మశాన వాటికకు రెండు గంటల వ్యవధిలోనే 40 మృతదేహాలు వచ్చినట్టు ఓ వార్తా సంస్థ తెలిపింది. శ్వాసకోశ వ్యవస్థ వైఫల్యంతో మరణించిన వారిని మాత్రమే చైనా తన కోవిడ్ మరణాల లెక్కలోకి తీసుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మరణాల సంఖ్యలో భారీ వ్యత్యాసం కనిపిస్తోందని లండన్ కు చెందిన ఎయిర్ ఫినిటీ లిమిటెడ్ తెలిపింది. అయితే రాబోయే రోజుల్లో రోజుకు 10 లక్షల కేసులు, 5000 చొప్పున మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కోవిడ్ అనేది చైనా దేశాన్ని వణికిస్తూనే ఉంది. ప్రపంచాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని భావించిన చైనాకు గుణపాఠం చెబుతూనే ఉంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: China estimates 37 million people have covid in a single day a record
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com