Gen Z travel trends: లోకా సమస్త సుఖినోభవంతు.. ఆ వేదం మా నాదం. అందరిలా నిద్రలో ఉండిపోక.. పాప ప్రక్షాళన చేస్తాం. మోసాన్ని పసిగట్టే చూపులతో .. ఎంత దాకా అయినా వెళ్తాం.. అప్పట్లో విడుదలైన యువసేన అనే సినిమాలోని ఓ పాట ఇది.
ఆ పాటలో పల్లవి, చరణాలు అద్భుతంగా ఉంటాయి. సమాజాన్ని ఉద్ధరించడానికి యువకులు పడే కష్టాన్ని చూపుతాయి. ఈ సినిమా ఎలా ఉన్నప్పటికీ.. ఈ పాట మాత్రం ఇప్పటికి ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. సమాజాన్ని బాగు చేయాలనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పాట నచ్చుతుంది. సరిగా ఈ పాట మాదిరిగానే ప్రస్తుత జనరేషన్ జెడ్ వ్యవహరిస్తోంది. ఇటీవల కాలంలో నేపాల్ లో అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయడంలో జనరేషన్ జెడ్ విస్తృతంగా పనిచేసింది. నచ్చని ప్రభుత్వాన్ని కిందికి దింపడంలోనూ.. నచ్చిన ప్రభుత్వాన్ని నెత్తి మీదకి ఎక్కించుకోవడంలోనూ కీలకపాత్ర పోషించింది. ఏ రోడ్ల మీదికి అయితే వచ్చి ధర్నాలు చేసిందో.. అదే రోడ్లను ఆ తరం బాగు చేసింది. ఉడుకు నెత్తురు, ఉక్కు కండరాలు, ఉవ్వెత్తున ఎగిసిన ఉత్సాహంతో మా దేశాన్ని బాగు చేసుకోవడానికి కంకణం కట్టుకుంది. ఇందులో అనేక రకాలుగా సాధక బాధకాలు ఉన్నప్పటికీ.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. దేశ అభివృద్ధిలో ముందడుగు వేస్తోంది.
జనరేషన్ జెడ్ కేవలం ఉద్రేకాలకు మాత్రమే లోను కావడం లేదు. వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్తోంది. తాజాగా క్లియర్ ట్రిప్ అనే సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఈ తరం కొత్త ప్రదేశాలను చూసేందుకు అన్వేషిస్తుంది. సాంస్కృతికంగా కొత్త విషయాలను తెలుసుకోవడానికి.. సామాజికంగా అనుభవాలను పెంచుకోవడానికి.. సాహసోపేతమైన ప్రయాణాలను ఆస్వాదించడానికి ముందడుగు వేస్తోంది. 2025లో ట్రావెల్ బుకింగ్ లో జనరేషన్ జెడ్ దే అవ్వ కొనసాగింది. గడచిన కొన్ని సంవత్సరాలుగా పరిశీలిస్తే ఈ ఏడాది బుకింగ్స్ ఏకంగా 650 శాతం పెరిగాయి. వియత్నం, అండమాన్, వారణాసి ప్రాంతాలకు జనరేషన్ జెడ్ ఎక్కువగా వెళ్ళింది. అయితే ఇందులో కొంతమంది సోలోగా వెళ్తే, మరి కొంతమంది బృందంగా వెళ్లారు. అందరూ చూసిన ప్రదేశాలను కాకుండా.. కొత్త ప్రాంతాలను వారు సందర్శించారు. అక్కడి వివరాలను ప్రపంచానికి సరికొత్తగా చూపించారు.
ప్రయాణాలు చేస్తూనే, సామాజిక విషయాల్లోనూ జనరేషన్ జెడ్ విస్తృతమైన ఆసక్తిని చూపించిందని క్లియర్ ట్రిప్ తన నివేదికలో పేర్కొంది. సోలో ట్రావెలర్లు ఢిల్లీ, బెంగళూరు వెళ్తే.. విశ్రాంతి కోసం గోవాను ఎంచుకున్నారు. అయితే జనరేషన్ జెడ్ అంటే ఎక్కువగా మద్యం తాగుతారు అనే అపోహ ఉంటుంది. కానీ మద్యం తాగడానికంటే, విచ్చలవిడిగా ప్రవర్తించడానికంటే.. బాధ్యతాయుత పౌరులుగా వారు మెలి గారు. కొత్త ప్రాంతాలను చూస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటూనే.. ఆ ప్రాంత విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తద్వారా తాము నూతన తత్వానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటామని సంకేతాలు ఇచ్చారు.