Homeఅంతర్జాతీయంCovid Effect: కోవిడ్‌ తర్వాత పెరిగిన గుండెపోట్లు.. సంచలన క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Covid Effect: కోవిడ్‌ తర్వాత పెరిగిన గుండెపోట్లు.. సంచలన క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Covid Effect: కోవిడ్‌.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆర్థిక వ్యవస్థల కుప్పకూలాయి. విద్యా విధానంపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితిలో వ్యాక్సిన్‌ను హడావుడిగా రూపొందించాయి పలు దేశాలు. ఇందులో రష్యా, ఇండియా, చైనా తయారు చేసి వ్యాక్సిన్లు ఎక్కువ మంది ఉపయోగించారు. దీంతో కోవిడ్‌ నుంచి బయటపడ్డారు. అయితే కోవిడ్‌ తర్వాత గుండెపోటు మరణాలు పెరిగాయి. వ్యాక్సిన్‌ కారణంగానే గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో తాజాగా కేంద్రం కీలక ప్రకటన చేసింది.

కరోనా మహమ్మారి తర్వాత భారతదేశంలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి, ముఖ్యంగా 40 ఏళ్ల లోపు వయస్సు వారు కార్డియాక్‌ అరెస్ట్‌లతో ప్రాణాలు కోల్పోవడం కలవరపెడుతోంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌లతో ఈ మరణాలకు సంబంధం ఉందనే ఊహాగానాలు సోషల్‌ మీడియా, ఇతర వేదికలలో వ్యాప్తి చెందాయి. ఈ నేపథ్యంలో, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR), ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS), మరియు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (NCDC) వంటి సంస్థలు ఈ అంశంపై విస్తృత అధ్యయనాలు చేపట్టాయి, కీలకమైన అంశాలను వెల్లడించాయి.

కోవిడ్‌ వ్యాక్సిన్‌లకు సంబంధం లేదు..
2023 మే నుంచి ఆగస్టు వరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఆసుపత్రులలో సర్వేలు నిర్వహించాయి. 2021 అక్టోబరు నుంచి 2023 మార్చి వరకు ఆకస్మికంగా మరణించిన 18–45 ఏళ్ల వయస్సు గల వ్యక్తుల డేటాను విశ్లేషించాయి. ఈ అధ్యయనాలు ఆకస్మిక మరణాలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌లతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా నిర్ధారించాయి. బదులుగా, మునుపటి అనారోగ్య సమస్యలు, జన్యుపరమైన కారణాలు, జీవనశైలి అంశాలు ఈ మరణాలకు ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి. ఈ నివేదికలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది, వ్యాక్సిన్‌ల సురక్షితత్వాన్ని పునరుద్ఘాటించింది.

వ్యాక్సిన్‌లు సురక్షితం..
వ్యాక్సిన్‌లు హడావుడిగా తయారు చేయడం, ట్రయల్స్‌ తక్కువగా నిర్వహించడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్న ప్రచారం ఉంది. కానీ, తాజా అధ్యయనాలు భారతదేశంలో ఉపయోగించిన కోవిడ్‌ వ్యాక్సిన్‌లు సురక్షితమైనవిగా నిర్ధారించాయి. వ్యాక్సిన్‌ల కారణంగా దుష్ప్రభావాలు చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపించాయని,గుండె సంబంధిత ఆకస్మిక మరణాలకు వ్యాక్సిన్‌లు కారణం కాదని స్పష్టం చేశాయి. కోవిడ్‌ మహమ్మారి సమయంలో వ్యాక్సిన్‌లు లక్షలాది ప్రాణాలను కాపాడాయని, వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర పోషించాయని అధ్యయనాలు గుర్తుచేశాయి. ఈ సందర్భంలో, వ్యాక్సిన్‌లపై ఆధారరహిత ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని, ప్రజల్లో తప్పుడు అవగాహనలను సృష్టిస్తాయని నిష్కర్షించాయి.

ఆకస్మిక మరణాలకు కారణాలు
అధ్యయనాల ప్రకారం, ఆకస్మిక మరణాలకు జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి అంశాలు (ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం), మునుపటి అనారోగ్య సమస్యలు (గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు) ప్రధాన కారణాలుగా ఉన్నాయి. 40 ఏళ్లలోపు వారిలో కార్డియాక్‌ అరెస్ట్‌లు పెరగడం వెనుక ఈ అంశాలు కీలకంగా ఉన్నాయని, కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ లేదా వ్యాక్సిన్‌లతో సంబంధం లేని ఇతర ఆరోగ్య సమస్యలు ఈ ధోరణికి దోహదపడుతున్నాయని నిపుణులు విశ్లేషించారు. ముఖ్యంగా, కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ తర్వాత గుండె సంబంధిత సమస్యలు కొందరిలో తీవ్రమైనవిగా ఉండవచ్చని, ఇవి వ్యాక్సిన్‌లతో కాకుండా వైరస్‌ ప్రభావంతో ముడిపడి ఉండవచ్చని సూచించారు.

వ్యాక్సిన్‌లపై తప్పుడు ప్రచారం..
కోవిడ్‌ వ్యాక్సిన్‌లు ఆకస్మిక మరణాలకు కారణమనే ప్రచారం ఆధారరహితమని, ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాక్సిన్‌లపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పరిశోధన సంస్థలు స్పష్టం చేశాయి. ఈ ప్రచారం ప్రజారోగ్య కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తుందని, వ్యాక్సినేషన్‌ రేట్లను తగ్గించి భవిష్యత్తులో వ్యాధుల నియంత్రణను సవాలు చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేశాయి. వ్యాక్సిన్‌లు మహమ్మారి సమయంలో ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించాయని, వాటి సురక్షితత్వం, సమర్థత శాస్త్రీయంగా నిరూపితమైనవని సంస్థలు పునరుద్ఘాటించాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular