Homeఅంతర్జాతీయంBeavers save drying River: మ్యాజిక్‌ చేసిన ఎలుకలు.. ఎండిపోతున్న నదికి ప్రాణం.. రూపాయి ఖర్చులేని...

Beavers save drying River: మ్యాజిక్‌ చేసిన ఎలుకలు.. ఎండిపోతున్న నదికి ప్రాణం.. రూపాయి ఖర్చులేని ప్రయోగం!

Beavers save drying River: ఎలుకలు.. మనకు కనిపించగానే తరిమేయాలనిపిస్తుంది. కొందరు చీదరించుకుంటారు. కొందరు వినాయకుడి వాహనం అని పూజిస్తారు. అయితే ఎలకలు చికాకు పెడతాయి. అందుకే చాలా మంది వాటిని వ్యతిరేకిస్తారు. కానీ ఎలుకలు మనకు మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు. మనం చీదరించుకునే ఎలుకలు అమెరికాలో ఓ నదికి ప్రాణం పోశాయి. ప్రకృతి వైవిధ్యం తెచ్చాయి. రూపాయి ఖర్చు లేకుండా పునరుజ్జీవం చేశాయి. అయితే ఈ పనిచేసింది దంతాలు ఉన్న ఎలుకలు(బీవర్స్‌). వీటిని ప్రకృతి సహజ ఇంజనీర్లు అని పిలుస్తారు. 2018లో ప్రారంభించిన ఈ ప్రయోగం రెండేళ్లలోనే విజయవంతమైంది. వంద బీవర్లను వదిలిన చోట 100కి పైగా చిన్న డ్యాంలు ఏర్పడ్డాయి. ఎండిపోయిన నది ఏడాదంతా ప్రవహించడం ప్రారంభమైంది. భూగర్భ జలాలు పెరిగాయి, పరిసరాలు పచ్చబడ్డాయి.

మానవాళి తప్పులతో నాశనం..
అమెరికాలోని ప్రైజ్‌ నది మనుషులు చేసిన తప్పుల వల్ల ఉనికి కోల్పోయే స్థితికి చేరుకుంది. సమస్య నీటి కొరత కాదు. నీరు వచ్చినా ఒడిసి పట్టలేకపోయింది. నీరు వేగంగా ప్రవహించి, భూమిలో ఇంకకుండా పోయేది. దీంతో భూగర్భ జలాలు ఎండిపోయాయి. నది మట్టి, ఇసుకను కూడా కొట్టుకుపోయింది. సారవంతమైన భూమి బంజరుగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడం శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలకు పెద్ద సవాల్‌గా మారింది.

ప్రకృతి సిద్ధంగా పరిష్కారం..
నీటిని నిల్వ చేయడానికి సంప్రదాయ పద్ధతి డ్యాంలు కట్టడం. కానీ ఇందుకు భారీ ఖర్చు అవుతుంది, పర్యావరణానికి హాని కలుగుతుంది. దీంతో అమెరికా నిపుణులు భిన్నంగా ఆలోచించారు. ప్రకృతి సహకారంతోనే సమస్యకు పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు. అప్పుడే వారి దృష్టి బీవర్లపై పడింది. ఈ ఎలుకలు ప్రవహిస్తున్న నీటిని ఆపడానికి చెట్లు, కొమ్మలు ఉపయోగించి చిన్నచిన్న డ్యాంలు కడతాయి. ఇవి వాటి సహజ అలవాటు. ఈ డ్యాంల వల్ల నీటి ప్రవాహం తగ్గి, నీరు నిల్వ ఉంటుంది. చిన్నచిన్న నీటికుంటలు ఏర్పడి పరిసరాలను మారుస్తాయి.

100 బీవర్లతో ప్రయోగం..
2018లో శాస్త్రవేత్తలు వైల్డ్‌లైఫ్‌ నిపుణులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం 100 బీవర్లను పట్టుకుని ప్రైజ్‌ నది వద్ద విడిచిపెట్టింది. కొత్త ప్రదేశంలో అవి అలవాటు పడతాయా అన్న సందేహాలు ఉన్నాయి. కానీ రెండేళ్ల తర్వాత జరిగిన మార్పు చూసి అందరూ షాక్‌ అయ్యారు. బీవర్లు తమ పని మొదలుపెట్టాయి. ఒకదాని తర్వాత ఒకటి 100కి పైగా డ్యాంలు నిర్మించాయి. దీంతోనీటికుంటలు ఏర్పడ్డాయి. భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఎండిపోయిన నది ఏడాదంతా ప్రవహించడం ప్రారంభమైంది. నది పరిసరాలు పచ్చబడ్డాయి, చుట్టూ చెట్లు పెరిగాయి. చేపలు వచ్చాయి. వాటికోసం పక్షులు వచ్చాయి. చెట్లు పెరగడంతో జంతువులు వచ్చాయి. జీవవైవిధ్యం పెరిగింది.

భారత్‌కు నేర్చుకోవాల్సిన పాఠాలు
ఈ విజయవంతమైన ప్రయోగం నుంచి భారత్‌ కూడా నేర్చుకోవాలి. నదులను కాపాడేందుకు ఈ పద్ధతిని అనుసరించవచ్చు. బీవర్ల లాంటి ప్రకృతి ఇంజనీర్లను ఉపయోగించుకోవడం వల్ల రూపాయి ఖర్చు లేకుండా నదులకు జీవం తెచ్చే అవకాశం ఉంది. మనం కూడా చిన్నచిన్న నీటికుంటలు, చెక్‌డ్యాంలు నిర్మించుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. రాజస్థాన్‌లో ఈ పద్ధతిని అమలు చేయడం ద్వారా ఎడారిలో కూడా నీళ్లు దొరుకుతున్నాయి. గుజరాత్‌లోని రుక్మావతి నది పునరుజ్జీవనం, తమిళనాడులోని కుడిమియార్‌ ప్రాజెక్ట్‌ ఇందుకు నిదర్శనాలు.

ఈ ప్రయోగం ప్రకృతి ఆధారిత పరిష్కారాల శక్తిని చాటిచెబుతోంది. డ్యాంలు కట్టడం కంటే బీవర్ల లాంటి జీవులను ఉపయోగించుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. పర్యావరణానికి హాని జరగదు. జీవవైవిధ్యం పెరుగుతుంది. స్థానికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. అమెరికా ఈ విధానాన్ని ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తోంది. కాలిఫోర్నియా, ఓరెగాన్, వాషింగ్టన్‌ రాష్ట్రాల్లో బీవర్లను నది పునరుజ్జీవనానికి వాడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version