Bangladesh And Pakistan: ఆకులు నాకేవాడు ఒకడుంటే.. మూతులు నాకడానికి మరొకడు ఉంటాడు. ఈ సామేత మన తెలుగు రాష్ట్రాలలో చాలా సుపరిచితం. ఇప్పుడు ఇది బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆ దేశాలు వ్యవహరిస్తున్న తీరు అలా ఉంది కాబట్టి..
పాకిస్తాన్ దేశంలో ప్రస్తుతం దుర్భరమైన దరిద్రం ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అప్పులు ఇవ్వకపోతే పాకిస్తాన్ దేశానికి పూట గడిచే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే ఆ దేశంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయి. ఇంధనం నుంచి మొదలు పెడితే ఆహార పదార్థాల వరకు అన్ని దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విదేశీ మారకద్రవ్య నిల్వలు లేవు. అంతర్జాతీయ కంపెనీలు రావడం లేదు. ఉన్న కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి స్థితిలో పాకిస్తాన్ దేశంతో ఏ దేశం కూడా సంబంధాలు కొనసాగించలేదు. కనీసం ఆ దేశం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ, అలాంటి పని బంగ్లాదేశ్ చేస్తోంది.
బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య ఒకప్పుడు ఉప్పు నిప్పులాగా వ్యవహారం ఉండేది. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో తాత్కాలిక సారధిగా మహమ్మద్ యునస్ కొనసాగుతున్న నేపథ్యంలో.. పరిణమాలు వేగంగా మారిపోతున్నాయి. పాకిస్తాన్ విషయంలో బంగ్లాదేశ్ వైఖరి సానుకూలంగా మారిపోవడం విశేషం.
తాజాగా పాకిస్తాన్ (Pakistan) నుంచి బంగ్లాదేశ్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. పాకిస్తాన్, చైనా జాయింట్ వెంచర్లో డెవలప్ చేసిన జెఎఫ్17 (JF -17 thunder fight aircraft) యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి బంగ్లాదేశ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ సైన్యం లో పనిచేసే మీడియా విభాగం కీలకమైన వివరాలను బయటకు వెల్లడించింది.
బంగ్లాదేశ్ (Bangladesh) ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ హసన్ మహమ్మద్ ఖాన్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు ఇస్లామాబాద్ లో ఇటీవల సమావేశమయ్యారు. ఈ క్రమంలో జె ఎఫ్ 17 యుద్ధ విమానాలకు సంబంధించి విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఆ తర్వాత అత్యున్నత స్థాయి యుద్ధ విమానాల నుంచి మొదలు పెడితే ప్రాథమిక స్థాయి సాంకేతిక పరిజ్ఞానం వరకు.. అన్ని విషయాలలో బంగ్లాదేశ్ కు తాము శిక్షణ ఇస్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తినే పద్యంలో బంగ్లాదేశ్ బృందం పాకిస్థాన్లో పర్యటించింది. అనేక సైనిక కేంద్రాలను పరిశీలించింది. ఈ పరిశీలనలో భాగంగా సూపర్ ముషాక్ ట్రైనింగ్ ఫ్లైట్ తో పాటు ట్రైనింగ్ కు కావలసిన ఎక్విప్మెంట్ మొత్తాన్ని అందిస్తామని పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు హామీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందింది. 2010లో షేక్ హసీనా ప్రభుత్వం పాకిస్తాన్ దేశంతో జరిగిన యుద్ధంలో.. ఆ దేశ దళాలకు సహాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ నిర్వహించారు. ఫలితంగా రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు యూనస్ ఆధ్వర్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ బలోపేతమవుతున్నాయి.