Ketireddy Venkat Rama Reddy: కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి( ketireddy Venkat Rama Reddy).. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రముఖంగా ఈ పేరు వినిపించేది. అంతలా సుపరిచితులు అయ్యారు సోషల్ మీడియా వేదికగా. ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట నిర్వహించిన కార్యక్రమం చాలా ఆకట్టుకుంది. ప్రజలను మరింత దగ్గర చేసింది. విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయితే ఆయన ఓటమి అందర్నీ ఆశ్చర్యపరిచింది. చివరకు తెలంగాణ లోని కేటీఆర్ కు సైతం. అయితే అంతలా గుర్తింపు తెచ్చి పెట్టింది గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం. అయితే ఆ కార్యక్రమంతో క్రేజ్ అయితే వచ్చింది కానీ.. 2024 ఎన్నికల్లో గెలుపు మాత్రం దక్కలేదు.
* ఎన్నికల ఫలితాల తర్వాత..
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు. ప్రజలకు ఎంతో చేశానని.. అటువంటి తననే ఓడించారని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆయన ఓడిన వెంటనే ఈవీఎంల కారణం అని చెప్పుకొచ్చారు. వాటి గురించి ప్రత్యేకంగా చాలా విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పారు. కానీ ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు అంటారు. గెలిచాక ప్రజలు తమను గుర్తించారంటారు. ఆ విషయాన్ని పక్కన పెడితే గుడ్ మార్నింగ్ ధర్మవరం ఎప్పుడు మొదలు పెడతారు అంటూ కేతిరెడ్డిని ప్రశ్నించిన వారు ఉన్నారు. అయితే ఇటీవల మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు వెంకట్రామిరెడ్డి. వివిధ యూట్యూబ్ ఛానల్ లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. చాలా విషయాలపై నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారు.
* ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా..
అయితే ఇప్పుడు ఉన్నఫలంగా ధర్మవరంలో పర్యటనలు మొదలుపెట్టారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఆయనపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు సత్యకుమార్ యాదవ్. ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ప్రతిపక్షంలో ఉండగా గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం విశేషం. ద్విచక్ర వాహనంపై నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అవ్వ, అమ్మ, అన్నా అంటూ పలకరిస్తూ గుడ్ మార్నింగ్ ధర్మవరం మొదలుకావడం విశేషం. అయితే అప్పట్లో గుడ్ మార్నింగ్ ధర్మవరం ఒక ప్రచార స్టంట్ గా ప్రత్యర్థులు ఆరోపించేవారు. నియోజకవర్గంలో దోపిడీ కోసమే అలా కేతిరెడ్డి వెళ్లేవారని ఎద్దేవా చేసేవారు. కానీ గుడ్ మార్నింగ్ ధర్మవరం సూపర్ హిట్ అయ్యింది. కానీ కేతిరెడ్డికి ఓట్లు తెచ్చి పెట్టలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా అయినా 2029 ఎన్నికల్లో కేతిరెడ్డి నెగ్గుతారా? లేదా? అనేది చూడాలి.