TAL Badminton Competitions: తెలుగు అసోసియేషన్ ఆఫ్ అండన్(టీఏఎల్) జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసింది. పశ్చిమ లండన్‌లోని అస్టర్లీ స్పోర్ట్, అథ్లెటిక్స్ సెంటర్‌లో మార్చి 16 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పోటీలు నిర్వహించింది.
ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు ఆటగాళ్లు..
లండన్‌తోపాటు యూకేలోని ఇతర కౌంటీల నుంచి ఔత్సాహిక తెలుగు ఆటగాళ్లు ఈ ఛాంపియన్‌షిప్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మెన్స్ డబుల్స్, మెన్స్ 40+, మిక్స్‌డ్ డబుల్స్, విమెన్స్ డబుల్స్, విమెన్స్ 35+ అండర్ 16 ఇలా వివిధ కేటరిరీల్లో పోటీలు నిర్వహించారు. మొత్తం 250 మంది క్రీడాకారులు ఇందులో భాగస్వాములయ్యారు.
బహుమతులు అందజేసిన అలీ..
ఇక ఏప్రిల్ 6వ తేదీతో పోటీలు ముగిశాయి. ఫైనల్ ఏప్రిల్ 6న నిర్వహించారు. తర్వాత నిర్వహించిన ముగింపు వేడుకలకు టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛాంపియన్‌షిప్ విజేతలతోపాటు వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. లండన్‌లోని తెలుగు కుటుంబాలను కలిపేందుకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్న టీఏఎల్‌ను అభినందించారు. తెలుగు వారంతా సమష్టిగా పోటీలను విజయవంతం చేశారని ప్రశంసించారు. టీఏఎల్ ప్రతినిధులు మాట్లాడుతూ దాదాపు 20 రోజులపాటు నిర్వహించిన ఛాంపియన్‌షిప్ విజయవంతం చేయడంలో తెలుగువారంతా భాగస్వాములయ్యారని తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.