Homeఅంతర్జాతీయంAmerica imperialist arrogance: బలవంతులదే రాజ్యమా... అమెరికా సామ్రాజ్యవాద అహంకారం ప్రపంచానికే చేటు!

America imperialist arrogance: బలవంతులదే రాజ్యమా… అమెరికా సామ్రాజ్యవాద అహంకారం ప్రపంచానికే చేటు!

America imperialist arrogance: అమెరికా.. ప్రపంచంలో అగ్రరాజ్యంగా.. ప్రపంచ పెద్దన్నగా కొనసాగుతోంది. ఆర్థికంగా బలమైన దేశం కావడంతో తాము ఏం చేసినా చెల్లుతుంది అన్నట్లు వ్యవహిస్తోంది అమెరికా. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడు అయ్యాక.. ప్రాచీన కాలం తరహాలో ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే అన్ని దేశాలపై 5 శాతం నుంచి 500 శాతం టారిఫ్‌లు విధించారు. అయినా మాట వినని, తన దారిలోకి రాని భారత్, చైనా వంటి దేశాలను దారికి తెచ్చుకునేందుకు టారిఫ్‌లు భారీగా పెంచాలని చూస్తున్నారు. ఇక చిన్న దేశాలపై ఏకంగా దాడులు చేసి ఆ దేశాల్లో అమెరికా ఆధ్వర్యంలో పాలన ప్రారంభించాలని చూస్తున్నారు. తాజాగా వెనుజువెలాపై జరిపిన దాడి ఇందులో భాగమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల వెనెజువెలా రాజధాని కరాకస్‌లోని దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్య తోపాటు కుమారుడిని కస్టడీలోకి తీసుకుని న్యూయార్క్‌కు తరలించారు. ఈ ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. అమెరికా చర్యను ఒక్క దేశం కూడా సమర్థించడం లేదు. ఒక దేశ సార్వభౌమాధికారంలో జోక్యంగా భావిస్తున్నాయి.

భిన్నంగా ప్రపంచ దేశాల స్పందన..
ఈ సంఘటనపై దేశాల స్పందనలు వైవిధ్యంగా ఉన్నాయి. రష్యా, చైనా, బ్రెజిల్‌తోపాటు లాటిన్‌ అమెరికా దేశాలు అమెరికా చర్యను తీవ్రంగా ఖండించాయి. ఐరోపా మిత్రరాజ్యాలు మెల్లగా స్పందిస్తూ అంతర్జాతీయ చట్టాల పాటను సూచించాయి. ఐరోపా యూనియన్‌ మదురో పాలన చట్టబద్ధతపై సందేహాలు వ్యక్తం చేస్తూ అమెరికాకు మద్దతు పలికింది. భారత్‌ మాత్రం ఆచితూచి స్పందించింది. ఢిల్లీలో జారీ చేసిన ప్రకటనలో వెనెజువెలా పరిస్థితులపై ఆందోళన తెలిపి, ప్రజల భద్రతకు మద్దతు ప్రకటించింది. సంబంధిత పక్షాలు దౌత్య మార్గాల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. అమెరికా వాణిజ్య ఒత్తిళ్లు, టారిఫ్‌ పెంపులు, ఇంకా ఖరారు కాని ఫ్రీ ట్రేడ్‌ అంగీకారాల నేపథ్యంలో భారత్‌ స్పందన ఇది.

ప్రమాదంలో చిన్న దేశాల భద్రత..
ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో బల ప్రదర్శనలు పెరుగుతున్నాయి. రష్యా–ఉక్రెయిన్, అజర్‌బైజాన్‌–ఆర్మేనియా, ఇజ్రాయెల్‌–హమాస్‌ ఘర్షణలు, ఇరాన్‌ అణు సైట్లపై దాడులు దీనికి ఉదాహరణలు. ఇలాంటి ’బలమే బలము’ విధానం వ్యాప్తి చెందితే, రక్షణ బలహీనంగా ఉన్న దేశాలపై ఒత్తిడి పెరుగుతుంది. వెనెజువెలా వంటి దేశాలు బలమైన దేశాలకు టార్గెట్‌గా మారే ప్రమాదం ఉంది.

చమురే అసలు లక్ష్యం…
వెనెజువెలాలోని భారీ చమురు భండారాలు అమెరికాకు ఆకర్షణ. ఆంక్షలు తొలగితే భారత్‌ వంటి దేశాలు దిగుమతులు పెంచుకోవచ్చు. కానీ ట్రంప్‌ పాలన అక్కడి వనరులను స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇది కొత్త వలసవాద రూపంగా కనిపిస్తోంది, న్యాయ పాలన కవర్‌గా ఉపయోగపడుతోంది.

డాన్రో విధానం పునరుజ్జీవనం..
బ్రిక్స్‌ దేశాలు డాలర్‌ బదులు స్థానిక కరెన్సీలో, లేదా సరికొత్త కరెన్సీ తీసుకువచ్చి వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మదురో చైనాకు చమురు యువాన్‌లో అమ్మడం ట్రంప్‌ను కోపం తెప్పించింది. ఇది అమెరికా డాలర్‌ బలాన్ని తగ్గించేలా ఉంది. 1823 మన్రో సిద్ధాంతాన్ని పునరుద్ధరిస్తూ, పశ్చిమ గోళంలో అమెరికా మాత్రమే ఆధిపత్యం చెలాయించాలని ట్రంప్‌ ప్రకటిస్తున్నారు. దీన్ని ’డాన్రో’గా పిలుస్తున్నారు. అంతా తన ఆధిపత్యమే ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా సామ్రాజ్యవాద విస్తరణకు దాడులు చేస్తున్నారు.

అమెరికా ఒకప్పుడు పాటించిన గ్లోబల్‌ నియమాలను ఇప్పుడు ఉల్లంఘిస్తూ ద్వంద్వ నీతి పాటిస్తోంది. భారత్‌ వంటి దేశాలు ఖండనలకు దిగకుండా దౌత్య పరిష్కారాలు సూచించడం ద్వారా స్వంత ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయి. ఇలాంటి టెన్షన్లు పెరిగితే ప్రపంచ శాంతి ప్రమాదంలో పడుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular