America Russia War: ‘నేను అధ్యక్షుడిని అయితే నెల రోజుల్లో ప్రపంచంలో యుద్ధాలన్నీ ఆపేస్తా..’ అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇది. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు దాటింది. అప్పటికే కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ఆగలేదు. కొత్తగా భారత్–పాకిస్తాన్, ఇజ్రాయెల్–ఇరాన్, కంబోడియా–థాయల్‌లాండ్ యుద్ధాలు మొదలయ్యాయి. తాజాగా అమెరికా కూడా రష్యాతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా సమీపంలోని సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను మోహరించినట్లు ప్రకటించడం, దీనికి రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని చెప్పడం అంతర్జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్సీ్క, తమ వద్ద కూడా తగిన సంఖ్యలో అణు జలాంతర్గాములు ఉన్నాయని, అమెరికా హెచ్చరికలకు స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, అమెరికా–రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
Also Read: ట్రంప్ ఎఫెక్ట్.. అగ్రరాజ్యంలో నిరుద్యోగ సంక్షోభం..!
ట్రంప్ ప్రకటనతో ఉద్రిక్తతలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదిక ద్వారా రష్యా సమీపంలో రెండు అణు జలాంతర్గాములను మోహరించినట్లు ప్రకటించారు. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు స్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. మెద్వదేవ్, ట్రంప్ ఆర్థిక ఆంక్షల హెచ్చరికలను ‘యుద్ధం వైపు ఒక అడుగు‘గా వ్యాఖ్యానించడం, అలాగే రష్యా సోవియట్ యుగంలోని ‘డెడ్ హ్యాండ్‘ అణు ఆయుధ వ్యవస్థను ప్రస్తావించడం ఈ ఉద్రిక్తతకు కారణమైంది. ట్రంప్ ఈ చర్యను ‘సన్నద్ధత‘ కోసం తీసుకున్నట్లు పేర్కొన్నప్పటికీ, ఈ ప్రకటన అణు ఆయుధాల రాజకీయ సంకేతాలను తీవ్రతరం చేసింది.
దీటుగా రష్యా స్పందన..
రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్సీ్క ఈ పరిణామంపై స్పందిస్తూ, రష్యా వద్ద కూడా అణు జలాంతర్గాముల సంఖ్య అమెరికా కంటే ఎక్కువగా ఉందని, అవి అమెరికా జలాంతర్గాములను నియంత్రణలో ఉంచగలవని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనకు స్పందించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్ ఫ్యోడర్ లుక్యానోవ్, ట్రంప్ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని, అవి ఎక్కువగా రాజకీయ సంకేతాల కోసం చేసినవని వ్యాఖ్యానించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా అమెరికాతో ప్రత్యక్ష సైనిక ఘర్షణలను నివారించాలనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదనతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు, ఇది రష్యా సంయమన వైఖరిని సూచిస్తుంది.
పరస్పర బెదిరింపులు..
ట్రంప్ ప్రకటన అణు జలాంతర్గాములను నిజంగా మోహరించారా లేక రాజకీయ సంకేతంగా ఈ ప్రకటన చేశారా అనేది స్పష్టంగా తెలియడం లేదు. అమెరికాకు చెందిన ఒహియో–క్లాస్ జలాంతర్గాములు ఇప్పటికే రష్యా సమీపంలోని సముద్రాల్లో తిరుగుతుంటాయని, ఈ ‘మోహరణ‘ కేవలం రాజకీయ సందేశం కావచ్చని భద్రతా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా సైన్యం జలాంతర్గాముల గురించి సాధారణంగా రహస్యంగా ఉంచుతుంది. ఈ చర్య నిజమైన సైనిక ఆపరేషన్ కంటే రాజకీయ ఒత్తిడి కోసం ఉద్దేశించినదిగా కనిపిస్తుంది. అయితే, ఈ రకమైన అణు సంకేతాలు రెండు అణు శక్తిగల దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Also Read: ట్రంపూ.. నికిదేం పోయేకాలంరా అయ్యా..
రష్యాపై ఆర్థిక ఆంక్షలు..
ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం. ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించే హెచ్చరికలు చేస్తూ, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాలని డెడ్‌లైన్ విధించారు. మొదట 50 రోజుల గడువు ఇచ్చిన ట్రంప్, దానిని 10–12 రోజులకు తగ్గించారు. మెద్వదేవ్ ఈ హెచ్చరికలను ‘యుద్ధం వైపు అడుగు‘గా విమర్శించారు, దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ అణు జలాంతర్గాముల మోహరణ ప్రకటన చేశారు. ఈ సందర్భంలో, రష్యా యొక్క ‘డెడ్ హ్యాండ్‘ వ్యవస్థను ప్రస్తావించడం అమెరికా–రష్యా సంబంధాలను మరింత దిగజార్చింది.