Alaska Airlines : గాల్లోనే ఊడిపోయిన విమానం డోర్‌.. వీడియో వైరల్‌!

అయితే తర్వాత విమానం సేఫ్‌గా ల్యాండ్‌ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Written By: Raj Shekar, Updated On : January 6, 2024 9:46 pm
Follow us on

Alaska Airlines : విమానం గాలిలో ఉన్నప్పుడు ఏదైనా సాంకేతిక సమస్య వచ్చిందంటే.. అందులోని ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపంలా మారతాయి. విమానం సేఫ్‌గా ల్యాండ్‌ అయ్యే వరకూ ఊపిరి బిగబట్టుకోవాల్సిందే. ఇక అనుకోకుండా ఏదైనా జరిగితే అంతే సంగతులు.. కానీ ఇక్కడ ఓ విమానం గాల్లో ఉండగానే దాని డోర్‌ ఊడిపోయింది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాలకే ఈ ఘటన జరిగింది. అయితే తర్వాత విమానం సేఫ్‌గా ల్యాండ్‌ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అలస్కా విమానం..
అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 9(1282) విమానం పోర్టులాండ్‌ నుంచి ఒంటారియాకు(కెనడా) గురువారం సాయంత్రం బయల్దేరింది. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఈ విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే మిడ్‌ క్యాబిన్‌ ఎగ్జిట్‌ డోర్‌ ఊడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, పైలెట్‌ విమానాన్ని తిరిగి పోర్ట్‌లాండ్ విమానాశ్రయానికి మళ్లించారు. బలమైన గాలి లోనికి వస్తున్నా.. సురక్షితంగా ల్యాండ్ చేశారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
అలస్కా విమానం ఆకాశంలో ఉండగా డోర్‌ ఊడిపోయి దృశ్యాలను అందులోని ప్రయాణికులు తమ సెల్‌ ఫోన్లలో వీడియో తీశారు. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై అలస్కా ఎయిర్‌లైన్స్‌ స్పందించింది. ఈ ఘటనతో ప్రభావితులైన ప్రయాణికులు, సిబ్బందిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఆ విమానాల నిలిపివేత..
ఇదిలా ఉండగా సేఫ్‌గా ల్యాండ్‌ అయిన అలాస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్‌ 9(1282) విమానంతోపాటు ఆ కంపెనీకి చెందిన విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ‘ఫ్లైట్ 1282లో గురువారం రాత్రి జరిగిన పరిణామంతో మా బోయింగ్ 737-9కు సంబంధించిన 65 విమానాలను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నిలిపివేశాం’ అని ఎయిర్‌లైన్సన్‌ సీఈవో బెన్స్‌ మినికుచి తెలిపారు. పూర్తి మెయింటెనెన్స్, సేఫ్టీ తనిఖీల తర్వాత తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.