Afghanistan Durand Line: ఆఫ్గానిస్తాన్-పాకిస్తాన్ మధ్య ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆఫ్గానిస్తాన్ భారత్‌కు దగ‍్గరవడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే కాబూల్ సమీపంలో తెహ్రిక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ ఉగ్రవాదులు ఉన్నారని సాకుతో వైమానిక దాడులు చేసింది. దీంతో ఆఫ్గానిస్తాన్ కూడా ప్రతిదాడి చేసింది. ఉద్రిక్తతలు పెరగడంతో ఖతార్ మధ్యవర్తిత‍్వంతో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. అయితే ఖతార్ చేసిన ఒప్పందంలో సరిహద్దు వివాదం సమసిపోయిందని పేర్కొనడం ఆఫ్గానిస్తాన్‌కు ఆగ్రహం తెప్పించింది. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన డ్యూరాండ్ లైన్‌ను ఆఫ్గానిస్తాన్ సరిహద్దుగా అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఆఫ్గానిస్తాన్-పాకిస్తాన్ మద్య సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
1893లో కుదిరిన ఒప్పందం..
1893లో బ్రిటిష్ భారతదేశ దౌత్యవేత్త సరహెండ్రి మార్టిమర్ దురాండ్ మరియు ఆఫ్ఘాన్ రాజు అబ్దుర్ రహ్మాన్ ఖాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పుట్టిన ఈ రేఖ, బ్రిటిష్–రష్యన్ పోటీ సమయానికి భౌగోళిక రక్షణ రేఖగా పరిగణించబడింది. కానీ ఆ ఉద్దేశ్యం పూర్తయ్యాక కూడా ఈ రేఖ రెండు దేశాల సంబంధాల్లో శాశ్వత తగాదాలకు కేంద్రంగా మారింది. ఇది పశ్తూన్ తెగలను విభజించి సామాజిక, రాజకీయ అస్థిరతకు దారి తీసింది. దురాండ్ లైన్ రెండు వైపులా పశ్తూన్ జాతి నివసిస్తోంది. ఒకవైపు ఆప్గాన్ పశ్తూన్లు, మరోవైపు పాకిస్తాన్ ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏరియాలో ఉన్న తెగలు. వీరిని డ్యూరాండ్ సరిహద్దు కృత్రిమంగా వేరు చేసింది. ఈ విభజన వల్లే పశ్తూనిస్తాన్ అనే ఆలోచన పుట్టింది. అంటే, రెండు దేశాల పశ్తూన్ ప్రాంతాలను కలిపి ఒక స్వతంత్ర దేశం సృష్టించాలన్న డిమాండ్. ఈ సిద్దాంతం ఇప్పటికీ ఆప్గాన్ రాజకీయ చైతన్యంలో అంతర్భాగంగా ఉంది.
డ్యూరాండ్ లైన్‌ను అంగీకరించని పాకిస్తాన్..
1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి కాబూల్ ప్రభుత్వం డూ‍్యరాండ్ రేఖను చట్టబద్ధ సరిహద్దుగా అంగీకరించలేదు. పాక్ మాత్రం బ్రిటిష్ వారసత్వంగా దానిని అధికారిక సరిహద్దుగా గుర్తించింది. ఈ విభేదమే రెండు దేశాల నమ్మకం, వాణిజ్యం, సైనిక సహకారాలపై ప్రభావం చూపింది. ఆప్గానిస్తాన్ మళ్లీ మళ్లీ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌పై భూభాగ విస్తరణ ఆరోపణలు చేస్తూ వస్తోంది.
తాలిబన్ పాలనలో మారిన సమీకరణ
2021లో తాలిబన్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్యూరాండ్ లైన్ వివాదం మళ్లీ జ్వాలలు ఎగరేసింది. తాలిబన్ బలగాలు పాకిస్తాన్ సరిహద్దులోని చోక్ పోస్ట్‌లను లక్ష్యంగా చేసుకుంటుండగా, పాకిస్తాన్ ప్రతిగా వైమానిక దాడులు చేస్తోంది. పాకిస్తాన్ తాలిబన్ గుంపుల ఆశ్రయం, ఆఫ్ఘాన్ భూభాగం నుంచి జరుగుతున్న దాడులపై ఇస్లామాబాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. తాలిబన్ మాత్రం పాకిస్తాన్‌ను తమ భూభాగం ఉల్లంఘన చేస్తున్నదని ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రాంతం చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్, ఇరాన్–పాక్ మార్గాలు, మధ్య ఆసియా సహజ వనరుల మార్గాలపైనా ప్రభావాన్ని చూపుతుంది. అమెరికా విడిపోయిన తర్వాత ఈ సరిహద్దు అనిశ్చితితో రష్యా, ఇరాన్, చైనా వంటి శక్తులు ఇక్కడ తమ మిత్ర సంబంధాలను బలోపేతం చేయాలనే యత్నంలో ఉన్నాయి.
125 ఏళ్లు డ్యూరాండ్ లైన్ వివాదం సైనిక బలంతో ముదురుతోంది. ఈ లైన్ కేవలం రెండు దేశాల సరిహద్దు మాత్రమే కాదు.. అది ఒక జాతి గాయానికి ప్రతీక. ఆప్గానిస్తాన్ దృష్టిలో ఇది చరిత్రలో మోసం. పాకిస్తాన్ దృష్టిలో ఇది జాతీయ భద్రతా గోడ. మధ్యలో మాత్రం నిరంతరం బలి అవుతున్న ప్రజలు, రక్తంతో తడిసే నేల ఇందుకు సాక్ష్యం.