https://oktelugu.com/

US President Facilities : ఉండడానికి వైట్ హౌస్.. తిరగడానికి విలాసవంతమైన బీస్ట్.. అమెరికా అధ్యక్షుడికి ఎన్ని సదుపాయాలంటే..

అమెరికా.. ఈ పేరు చెప్తే ప్రపంచ దేశాలు అలెర్ట్ అవుతాయి. చైనా నుంచి కంబోడియా దాకా సలాం చేస్తాయి. అమెరికా వలస దేశం అయినప్పటికీ.. వలసదారులతో నిండిపోయినప్పటికీ.. ప్రపంచానికి అది పెద్దన్న. ఆర్థిక రంగం నుంచి మొదలుపెడితే సైనిక సామర్థ్యం వరకు అన్ని దేశాల కంటే అమెరికాదే అగ్రస్థానం.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 6, 2024 / 10:27 PM IST

    US President Facilities

    Follow us on

    US President Facilities :  అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయంటే ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఎవరు గెలుస్తారు? గెలిస్తే మా దేశంతో అమెరికా ఎలా మెలుగుతుంది? అనే విషయాలను పదేపదే చర్చించుకుంటారు. సరే ఆ సంగతులను పక్కన పెడితే.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఆ ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి.

    ఈగ కూడా వాలనివ్వరు

    అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లో నివాసం ఉంటాడు. అక్కడ 24/7 పాటు సెక్యూరిటీ ఉంటుంది. ఈగ కూడా వాలనివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది చూసుకుంటారు.. అమెరికా అధ్యక్షుడికి వార్షిక వేతనంగా నాలుగు లక్షల డాలర్ల వేతనం లభిస్తుంది. భారతీయ కరెన్సీ ప్రకారం చూసుకుంటే అది 3.3 కోట్ల వరకు ఉంటుంది. ఆ మొత్తాన్ని ఇవ్వాలని 2001లో అమెరికా కాంగ్రెస్ నిర్ణయించింది. అప్పటినుంచి అమెరికా అధ్యక్షుడి వేతన విషయంలో ఎటువంటి మార్పు లేదు. అయితే సింగపూర్ ప్రధానికి 16 లక్షల డాలర్లు వార్షిక వేతనంగా లభిస్తా యి. ఆ ప్రకారం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడి వేతనం నాలుగో వంతు మాత్రమే. ఇక అమెరికా అధ్యక్షునిగా పనిచేసి.. రిటైర్ అయిన వారికి ప్రయోజనాల రూపంలో ప్రతి ఏడాది రెండు లక్షల డాలర్లు లభిస్తాయి. ఇతర అలవెన్స్ ల కింద లక్ష డాలర్లు అందుతాయి.

    వేతనం మాత్రమే కాకుండా అధికారిక ఖర్చులకోసం, వ్యక్తిగత ఖర్చులకోసం జీతంతో పాటు 50 వేల డాలర్లు లభిస్తాయి. అయితే ఇవి పన్ను రహితంగా ఉంటాయి. ప్రయాణ ఖర్చులకు 1,00,000 డాలర్లు లభిస్తాయి. అధ్యక్షుడు వినోదం కోసం 19 వేల డాలర్లు అందుతాయి. ఈ ప్రకారం చూసుకుంటే అధ్యక్షుడికి ప్రతి సంవత్సరం 5.69 లక్షల డాలర్లు లభిస్తాయి. కొత్త అధ్యక్షుడు వైట్ హౌస్ లో అడుగు పెట్టడానికి ముందు దానిని అందంగా అలంకరిస్తారు. దీనికోసం లక్ష డాలర్లు వెచ్చిస్తారు.

    ఇక అమెరికా అధ్యక్షుడు నివాసముండే వైట్ హౌస్ ను 1800 సంవత్సరంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ భవన సముదాయం 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఇందులో 132 గదులు ఉన్నాయి. 35 బాత్ రూం లు ఉన్నాయి. ఇందులో టెన్నిస్ కోర్టు ప్రత్యేకంగా ఉంటుంది. జాగింగ్ ట్రాక్ అధునాతనంగా ఉంటుంది. మూవీ థియేటర్, ఈతకొలను వంటి సదుపాయాలు కూడా ఉంటాయి. అధ్యక్షుడి కోసం ఇక్కడ నిత్యం ఐదుగురు వంటవాళ్లు పనిచేస్తుంటారు. అధ్యక్షుడు కోరుకున్న విధంగా వంటలు వండి సర్వ్ చేస్తుంటారు.

    వైట్ హౌస్ మాత్రమే కాకుండా అమెరికా అధ్యక్షుడికి బ్లయిర్ హౌస్ అనే గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది. ఇది వైట్ హౌస్ కంటే చాలా పెద్దది. 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఇందులో 119 గదులు ఉంటాయి. గెస్ట్ ల కోసం 20 పడక గదిలో ఉంటాయి. 35 స్నానాల గదులు ఉంటాయి. ఇందులో నాలుగు డైనింగ్ హాల్స్, జిమ్, సెలూన్ వంటివి కూడా ప్రత్యేకంగా ఉంటాయి.

    అమెరికా అధ్యక్షుడు కోసం క్యాంప్ డేవిడ్ పేరుతో హిల్ గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది. ఇది మేరీ ల్యాండ్ రాష్ట్రంలో 128 ఎకరాలలో విస్తరించి ఉంది. హిల్ గెస్ట్ హౌస్ ను మొదట రుజ్ వెల్ట్ ఉపయోగించాడు. దీనిని ఎక్కువగా దౌత్యపరమైన విషయాలు చర్చించడానికి ఉపయోగిస్తారు.. అప్పట్లో ఈ కేంద్రం వేదికగానే ఈజిప్టు – ఇజ్రాయిల్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిని క్యాంపు డేవిడ్ ఒప్పందం అని కూడా పిలుస్తారు.

    అమెరికా అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తారు. ఇందులో అనేక సౌకర్యాలు ఉంటాయి. ఈ విమానం గాలిలో ఉండగానే ఇంధనం నింపుకుంటుంది. ఇక మెరైన్ వన్ అనే హెలికాప్టర్ అమెరికా అధ్యక్షుడికి సేవలు అందిస్తుంది. ఇది గంటకు 241 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. బాంబు పేలుళ్లను కూడా ఇది తట్టుకుంటుంది. దీనికి మూడు ఇంజిన్లు ఉంటాయి. ఒక్కటి విఫలమైనా మిగతా రెండు ఇంజన్లతో ఆ హెలికాప్టర్ నడుస్తుంది. అయితే ఇలాంటి హెలికాప్టర్లు ఐదు ఉన్నాయి. శత్రువుల నుంచి అధ్యక్షుడిని కాపాడేందుకు ఇలా హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు.

    ఇక అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కారు పేరు బీస్ట్. ఇది అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. అత్యంత భారీ భద్రత ప్రమాణాలతో దీనిని రూపొందించారు. అమెరికా అధ్యక్షుడు తను వెళ్లిన ప్రతి దేశానికీ.. ఈ కారు పరుగులు పెడుతుంటుంది. అమెరికా అధ్యక్షుడు మాత్రమే కాదు.. వారి కుటుంబ సభ్యులకు ఈ కారులో 24/7 అత్యంత రహస్య భద్రత ఉంటుంది.