US Presidential Election 2024: అమెరికా ఎన్నికల వేళ కీలక పరిణామం

నిక్కీహేలీ అధ్యక్ష రేసులో రిపబ్లిక్‌ పార్టీ తరఫున నిలిచారు. అయితే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్‌ కన్నా తక్కువ ఓట్లు సాధించారు. దీంతో చేసేది లేక పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Written By: Raj Shekar, Updated On : May 23, 2024 12:08 pm

US Presidential Election 2024

Follow us on

US Presidential Election 2024: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డోనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి పోటీ ఇచ్చిన నిక్కీ హేలీ ఎట్టకేలకు ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను ట్రంప్‌కే ఓటు వేస్తానని స్పష్టం చేశారు. హడ్సన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వాషింగ్‌టన్‌లో బుధవారం(మే 22న) నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈమేరకు ప్రకటన చేశారు.

అధ్యక్ష రేసు నుంచి తప్పుకుని..
నిక్కీహేలీ అధ్యక్ష రేసులో రిపబ్లిక్‌ పార్టీ తరఫున నిలిచారు. అయితే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్‌ కన్నా తక్కువ ఓట్లు సాధించారు. దీంతో చేసేది లేక పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చివరకు పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌ ఖరారయ్యాడు. అయితే పోటీ నుంచి తప్పుకున్న నిక్కీ హేలీ.. ట్రంప్‌ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. మద్దతు ఇస్తానని కూడా తెలుపలేదు. దీంతో చాలా మంది ఆమె మద్దతు ట్రంప్‌కు దక్కదని భావించారు. నిక్కీ మద్దతు దారులు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడతారేమో అన్న అనుమానాలు వచ్చాయి. కానీ ఎట్టకేలకు ఆమె మౌనం వీడారు. అనుమానాలను పటాపంచలు చేశారు. రిపబ్లికన్‌ పార్టీ ఏకతాటిపై ఉందన్న సందేశాన్ని ఇచ్చారు.

తన మద్దతుదారులను ట్రంప్‌ తిప్పుకోవాలి..
ఈ సందర్భంగా హేలీ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల రేసులో తనకు అండగా నిలిచిన మద్దతుదారులను ట్రంప్‌ ఇపుపడు తనవైపు తిప్పుకోవాలని సూచించారు. వారి మద్దతు కూడగట్టడం కోసం ఆయన శ్రమించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. గుడ్డిగా వారంతా తన వెనకాలే ఉంటారని ట్రంప్‌ అనుకుంటే పోరపాటే అవుతుందని పేర్కొన్నారు. ప్రైమరి ఎన్నికల రేసులో నిలిచిన సమయంలో హేలీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌పై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. పోటీ నుంచి తప్పుకున్నాక ట్రంప్‌వైపు నిలబడలేదు. దీంతో రిపబ్లికన్‌ పార్టీ చీలిపోతుందన్న అనుమానాలు కూడా వచ్చాయి. కానీ ఎట్టకేలకు మద్దతు ప్రకటించారు. కానీ, తన మద్దతుదారులను బైడెన్‌ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడని నిక్కీహేలీ తెలిపారు.

బైడెన్‌పై తీవ్ర విమర్శలు..
ఇదిలా ఉండగా, నిక్కీహేలీ అధ్యక్షుడు బైడెన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అమెరికా–మెక్సికో సరిహద్దు వివాదాన్ని ఉదహరిస్తూ బైడెన విదేశాంగ విధానాన్ని తపుప పట్టారు. తన ప్రచారానికి విరాళాలు ఇచ్చిన వారికోసం ఇటీవల ఆమె దక్షిణ కరోలినాలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే తదుపరి రాజకీయ కార్యాచరణ ప్రకటించలేదు.