Homeఅంతర్జాతీయంMecca Heat Wave: మండే ఎండకు మక్కా మలమల.. కనీ వినీ ఎరుగని స్థాయిలో మరణ...

Mecca Heat Wave: మండే ఎండకు మక్కా మలమల.. కనీ వినీ ఎరుగని స్థాయిలో మరణ మృదంగం

Mecca Heat Wave: పవిత్ర మక్కా మాడిపోతుంది. మండే ఎండలకు విలవిలలాడుతోంది. గాలిలో తేమ తగ్గిపోయి, వేడిగాలులు తీవ్రంగా విస్తుండడంతో జనం నరకం చూస్తున్నారు. మక్కా గ్రాండ్ మసీదు వద్ద 51.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో హజ్ యాత్రికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వేడిగాలులు, తీవ్రమైన ఉక్కపోత వల్ల ఇప్పటివరకు 550 మంది హజ్ యాత్రికులు మృత్యువాత పడ్డారు. హజ్ యాత్ర చరిత్రలో ఇటువంటి విషాదం గతంలో ఎన్నడూ చోటు చేసుకోలేదు. యాత్రికుల మృతి విషయాన్ని సౌదీ దౌత్య వ్యక్తులు ధ్రువీకరించారు. మరణించిన యాత్రికుల్లో 323 మంది ఈజిప్షియన్లు ఉన్నారని తెలుస్తోంది. వేడి గాలులు, ఉక్కపోత వల్ల చనిపోయిన వారి మృతదేహాలను(550 మంది) మక్కాలోని ఆల్ ముయిసెమ్ ఆసుపత్రిలో భద్రపరిచారు.. ఇక జోర్డాన్ ప్రాంతంలో కూడా 60 మంది వరకు చనిపోయారు. గతంలో వేడి గాలుల వల్ల ఈ ప్రాంతంలో 41 మంది చనిపోయారు.. ఇక వివిధ దేశాల లెక్కల ప్రకారం మొత్తంగా హజ్ యాత్రలో వేడిగాలు వల్ల చనిపోయిన వారు 577 మంది అని తెలుస్తోంది.

మక్కా ప్రాంతంలో ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటిగా హజ్ నిలుస్తోంది. ముస్లింలు తమ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ ను దర్శించుకోవాలని భావిస్తారు. దీనికోసం ఎంత కష్టమైనా పడతారు. వాస్తవానికి ఈసారి హజ్ యాత్ర ప్రారంభ సమయంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయని.. గతంతో పోల్చితే ఈసారి 0.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరగడం.. వేడి గాలులు తీవ్రంగా ఉండడంతో అది యాత్రికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని సౌదీ అరేబియా అధికారులు అంటున్నారు. మక్కా గ్రాండ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటడంతో యాత్రికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎండ నుంచి, వేడి గాలుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఈజిప్షియన్లు ఇతర ప్రాంతాలకు పరుగులు తీశారు. దీంతో వారు తప్పిపోయారు. ఈ విషయాన్ని ఈజిప్ట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌదీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే వారందరినీ కూడా వడ దెబ్బ మృతుల కింద సౌదీ అధికారులు ఆ నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక యాత్రికుల్లో 2000 మంది వడదెబ్బకు గురి కావడంతో.. వారందరికీ స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గత ఏడాది హజ్ యాత్ర సమయంలో వివిధ దేశాలకు చెందిన 240 మంది యాత్రికులు వడదెబ్బకు గురై మరణించారు..

ఈసారి వడ తీవ్రంగా ఉండడంతో మక్కా సమీపంలోని మీనా ప్రాంతంలో పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన సేవకులు యాత్రికులకు శీతల పానీయాలు, ఐస్ క్రీమ్ పంపిణీ చేస్తున్నారు. చల్లని నీళ్లను అందిస్తుండడంతో.. ఒంటిపై పోసుకొని చల్లబరుచుకుంటున్నారు. ఎండ వేడిమి నుంచి యాత్రికులు తమను తాము రక్షించుకునేందుకు గొడుగులు, హైడ్రేట్ డ్రింకులు వాడాలని సూచిస్తున్నారు. అయితే ఆచారంలో భాగంగా మంటూ అరాఫత్ ప్రార్ధన సమయంలో యాత్రికులు బహిరంగంగా ఉండాల్సి ఉంటుంది.. అలాంటి సమయంలో పైన వేడి, తీవ్రమైన ఉక్కపోత వల్ల యాత్రికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం సుమారు 1.8 మిలియన్ల మంది హజ్ యాత్రలో పాల్గొన్నారు. ఇందులో విదేశాల నుంచి 1.6 మిలియన్ల మంది వచ్చారు.. వీరందరికీ సౌదీ అరేబియా ప్రభుత్వం అపారమైన భద్రత కల్పించింది. అయితే ఈసారి ఎండలు పెరగడంతో యాత్రికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వడదెబ్బ మృతుల్లో ఎక్కువ శాతం మధుమేహం, రక్తపోటు సంబంధిత వ్యాధులు ఉన్న వారేనని సౌదీ అరేబియా ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular