15 Crore School Donation: నేటి కాలంలో శిబి చక్రవర్తి లాంటి మనుషులు లేకపోయినప్పటికీ.. అక్కడక్కడ కొంతమంది గంజాయి వనంలో తులసి మొక్కల్లాగా కనిపిస్తున్నారు. ఉన్న ఊరికి.. చదువుకున్న బడికి.. చేయూత అందించిన మనుషులకు సహాయం చేస్తున్నారు. అయితే ఆ జాబితాలో వీరికి శిఖర స్థానం ఇవ్వవచ్చు. ఎందుకంటే వీరు చేసిన సహాయం మామూలుది కాదు. వీరు అందించిన చేయూత అంచనాలకు అందదు. వీరు చూపించిన చొరవ కొలమానానికి సరిపోదు. ఎందుకంటే నువ్వు ఉన్న ఊరిని.. చదువుకున్న పాఠశాలను..చేయూత అందించిన మనుషులను మర్చిపోతున్న రోజులువి. ఇలాంటి ఈ రోజుల్లో ఈ ఇద్దరు సోదరులు ఒక బృహత్తరమైన కార్యానికి పాల్పడ్డారు. కనివిని ఎరుగని స్థాయిలో విరాళం అందించి ఊరి పాఠశాలకు కార్పొరేట్ లుక్ తీసుకొచ్చారు. కాదు కాదు కార్పొరేట్ పాఠశాల కూడా దిగదుడుపు అనే స్థాయిలో సౌకర్యాలు కల్పించారు. వీరు నిర్మించిన పాఠశాలలో ఇది ఉంది.. అది లేదు అనడానికి లేదు.. తాగడానికి నీరు.. బాల బాలికలకు వేరువేరుగా మూత్రశాలలు.. అత్యంత అధునాతనమైన లైబ్రరీ.. విశాలమైన తరగతి గదులు.. మూడు అంతస్తులలో పాఠశాల భవనం.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అద్భుతమే.
Also Read: Blood Donation: మీకు బ్లడ్ అత్యవసరమా.. అయితే వీరిని సంప్రదించండి
నేటి కాలంలో చదువుకున్న పాఠశాలను మర్చిపోతున్న వారు చాలామంది. అయితే రాజస్థాన్ రాష్ట్రంలోని మేఘరాజ్, అజిత్ దకాడ్ అనే ఇద్దరు సోదరులు తమ చిన్ననాడు చదువుకున్న పాఠశాల రూపు రేఖలు మార్చారు. మేఘరాజ్, అజిత్ శిశోడా ప్రాంతంలో చదువుకున్నారు. వారు ఉన్నత చదువులు చదివి భారీగా సంపాదించడం మొదలుపెట్టారు.. అయితే తమ గ్రామంలో చదువుకున్న ప్రభుత్వ పాఠశాలను సరికొత్తగా మార్చాలని వారిద్దరు తలచారు. అందులో భాగంగానే వారు మంగళం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి.. దానిద్వారా 15 కోట్లను విరాళంగా ఇచ్చారు. వారి తల్లిదండ్రులు కంకు బాయ్, సోహన్ లాల్ పేరును పాఠశాలకు పెట్టారు. మూడు అంతస్తుల లో నిర్మించిన ఈ పాఠశాల భవనం 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్ లు, ప్రార్థన మందిరం, సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ పాఠశాల సముదాయంలో 40 గదులున్నాయి.. అంతేకాదు పిల్లలకు అద్భుతంగా బోధించడానికి సిబ్బందిని కూడా ప్రభుత్వ నియమించింది.. ఇక ఈ పాఠశాల సముదాయంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం వాలీబాల్, బాస్కెట్ బాల్ మైదానాలు కూడా నిర్మించారు. ఈ పాఠశాల అత్యంత ఆధునిక రూపు సంతరించుకోవడానికి దాదాపు 6 సంవత్సరాల సమయం పట్టింది.
A Rajasthan family donates ₹15 crore to build a world-class school in their village.
Meghraj and Ajit Dhakad transformed their childhood government school into a world-class institution.
In Shishoda village, Rajsamand district, Meghraj Dhakad and his family donated ₹15… pic.twitter.com/ki0PbutEQo
— Woke Eminent (@WokePandemic) May 26, 2025
గడిచిన నెల పదవ తేదీన ఈ పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ విద్య, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మదన్ డిలావర్ హాజరయ్యారు.. అంతేకాదు ఈ పాఠశాలను ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా కార్యక్రమంలో చేర్చే ప్రణాళికను పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత ఈ పాఠశాలలకు ఈ స్థాయిలో రూపురేఖలు తీసుకొచ్చిన మేఘరాజ్ సోదరులను మంత్రి ప్రశంసించారు. సన్మానించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పార్లమెంట్ సభ్యురాలు మహిమాకుమారి హాజరయ్యారు..