
Panjshir : రక్తం రుచిమరిగిన తాలిబన్లు శాంతి మంత్రం జపించడంపై.. మెజారిటీ ఆఫ్ఘన్లు ఒకే మాట చెప్పారు. ‘‘వాళ్లను నమ్మడానికి లేదు..’’ ఈ మాట ఎంత నిజమో.. ప్రపంచానికి అర్థం కావడానికి ఎంతోకాలం పట్టలేదు. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష పెట్టామని, మహిళల హక్కులను కాపాడుతామని, వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తామని తాలిబన్లు చెప్పిన మాటలు.. పచ్చి అబద్ధాలనే విషయం ఒక్కొక్కటిగా బయటపడుతూ వచ్చాయి. ఇప్పుడు వారి రాక్షసానికి సంబంధించి మరో దారుణం వెలుగులోకి వచ్చింది.
తాలిబన్లు ముస్లిం తెగకే చెందిన హజారాలను చూస్తేనే సహించరు. వారిని పిట్టల్లా కాల్చి చంపేస్తారు. 1996 నుంచి 2001 వరకు అధికారంలో ఉన్న తాలిబన్లు ఇదే విధంగా మారణహోమం సృష్టించారు. ఆఫ్ఘనిస్తాన్ లో మైనారిటీలుగా ఉన్న హజారాలను వీధి వీధి తిరిగి మరీ చంపేశారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ పెద్దల గొంతులు కోసి చంపేశారు. ఇప్పుడు పంజ్ షీర్ లోనూ ఇదే తరహా దారుణాలకు పాల్పడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
పంజ్ షీర్ ప్రావిన్స్ తాలిబన్లకు కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. రష్యా సైన్యాలకు సైతం లొంగకుండా పోరాటం సాగించారు పంజ్ షీర్ వాసులు. తాలిబన్లు 1996 నుంచి 2001 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా పంజ్ షీర్ లో అడుగు పెట్టలేకపోయారు. ఇప్పుడు కూడా వెంటనే పంజ్ షీర్ వాళ్ల చేతుల్లోకి రాలేదు. అయితే.. ఇటీవల పంజ్ షీర్ తమ వశమైందని తాలిబన్లు ప్రకటించారు. అటు తిరుగుబాటు దారులు ఈ విషయాన్ని అంగీకరించలేదు. తాము పోరాడుతున్నామని ప్రకటిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో.. పాకిస్తాన్ సహాయంతో పంజ్ షీర్ లో తాలిబన్లు పాగా వేశారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఆ ప్రావిన్స్ లో చొరబడిన తాలిబన్లు తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని మట్టుబెడుతున్నారు. కత్తులతో తలలు నరకడం.. బుల్లెట్లతో దేహాలను తూట్లు పొడవడం చేస్తున్నారు. వీరికి భయపడి పంజ్ షీర్ నుంచి చాలా మంది పారిపోయారని ట్విటర్ ద్వారా తిరుగుబాటు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా.. తాము ఇచ్చిన మాటను తీసి గట్టుమీద పెట్టేస్తున్న తాలిబన్లు.. తమ అరాచక పాలనను మరోసారి తెరపైకి తెస్తున్నారు. సెక్స్ వర్కర్లుగా పనిచేసిన వారిని గుర్తించిన చంపేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. మహిళలు కేవలం పిల్లలు కనడానికేనని స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అక్కడి వాస్తవాలను కవర్ చేసిన జర్నలిస్టులపైనా దాడులు చేస్తున్నారు. ఈ విధంగా.. తాలిబన్లు తమ రాక్షన పాలనను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారనే విషయం స్పష్టమవుతోందని అంటున్నారు. మరి, రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.