AP PRC Issue: ఏపీలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు జగన్ సర్కారు షాకిచ్చింది. ఇప్పటికే వేతన సవరణలో మొండిచేయి చూపగా.. వేతన బకాయిలోనూ మొండి చేయి చూపుతోంది. 11వ వేతన సవరణ సంఘ (పీఆర్సీ) బకాయిలను.. వారి పదవీ విరమణ సమయంలో చెల్లిస్తామంటూ ఉత్తర్వులు జారీచేయడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు. ప్రస్తుత పీఆర్సీ ఎరియర్స్‌ను ఎప్పుడో 20-25 ఏళ్లకు చెల్లిస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఏ ప్రభుత్వం ఉంటుందో.. దాని విధానం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరియర్స్‌ను పదవీ విరమణ సమయంలో చెల్లిస్తామనడం ముమ్మాటికీ మోసమేనన్నారు.
తమ ఆర్థిక భద్రత ప్రమాదంలో పడిందని ఆందోళన చెందుతున్నారు. ఒక్కో ఉద్యోగి రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు నష్టపోతామని వాపోతున్నారు. . జగన్ ప్రభుత్వం ఇచ్చింది పేరుకే ఐదేళ్ల పీఆర్సీ. అందులో 42 నెలలు ఉద్యోగికి రావాల్సిన పీఆర్సీ ప్రయోజనాలు కోల్పోతున్నారు. సచివాలయంలో బుధవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం హాట్ హాట్ గా సాగింది. ఆర్థిక శాఖ అధికారులను ఉద్యోగ సంఘాల నేతలు నిలదీశారు. ఈ భేటీకి ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించలేదు. లక్షలాది మంది ఉపాధ్యాయులకు ప్రతినిధులుగా ఉన్న ఆ సంఘాల నేతలు లేకుండా పీఆర్సీ అనుబంధ అంశాలు, జీవోలపై ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. జీవోలు కూడా విడుదల చేసేశారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాల నేతలు నిలదీస్తారేమోనన్న అనుమానంతోనే వారిని ఆహ్వానించలేదని చర్చ జరుగుతోంది.
జీవోలపై భగ్గు భగ్గు..
11వ పీఆర్సీ అమలుకు సంబంధించి ప్రభుత్వం బుధవారం ఇచ్చిన జీవోలు హక్కులను నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయి. ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతర భృతి(ఐఆర్)ని వారి డీఏ బకాయిల నుంచి రికవరీ చేయబోమని స్పష్టం చేసింది. జనవరిలో ఇచ్చిన జీవో నంబరు 1లో 2019 జూలై నుంచి 2021 డిసెంబరు 31 వరకు ఉద్యోగులు అందుకున్న ఐఆర్‌ను.. డీఏ బకాయిల నుంచి రికవరీ చేస్తామని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఉద్యోగుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఐఆర్ రికవరీని నిలిపివేస్తున్నట్లు తాజా జీవోలో పేర్కొంది.అయితే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ ఎరియర్స్‌ను మాత్రం రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని తెలిపింది. ఉద్యోగులకు రావలసిన 5 డీఏల బకాయిల గురించి, వాటిని ఎప్పుడు చెల్లిస్తారో తాజా జీవోలో ప్రస్తావించలేదు. పీఆర్సీ బకాయిలు లెక్కించినప్పుడే 2020 ఏప్రిల్ 1 నుంచి డీఏ ఎరియర్స్ కూడా కలిపి లెక్కించామని జీవో నంబర్ 1లో తెలిపింది. అంటే రిటైర్మెంట్ సమయంలో ఇచ్చే పీఆర్సీ బకాయుయిల్లోనే డీఏ బకాయిలు కూడా ఉంటాయనేది దాని వాదన. జగన్ అధికారంలోకి వచ్చాక 2018 జూలై 1, 2019 జనవరి 1 డీఏ ఎరియర్లను మంజూరు చేస్తూ అట్టహాసంగా ఉత్తర్వులిచ్చారు. ఉద్యోగులకు ఆ రెండు డీఏల బకాయిల రూపంలో రూ.8 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు.
ఏ ఏడాదికా ఏడాది బిల్లులను ఆర్థిక సంవత్సరం చివరి రోజు వెనక్కి తిప్పిపంపుతున్నారు. ఆ డీఏలకే దిక్కులేదని.. ఇప్పుడు ఐదు డీఏలను పీఆర్సీ ఎరియర్స్‌లో కలిపి లెక్కించారంటే ఎలా నమ్మాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వాదనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరువు ఇప్పుడైతే.. భత్యం ఎప్పటికో చెల్లిస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున రూపాయి విలువ పదేళ్ల తర్వాత కూడా అలాగే ఉంటుందని గ్యారెంటీ లేదని.. కాలం గడిచే కొద్దీ విలువ పడిపోవచ్చు కాబట్టి తమ డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలకు మళ్లించి.. జీపీఎ్‌ఫపై అమలవుతున్న విధంగా 8.5 శాతం వడ్డీ ఇస్తేనే తమకు ప్రయోజకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఉదాహరణకు ఒక ఉద్యోగికి ప్రస్తుత గణాంకాల ప్రకారం డీఏ ఎరియర్స్ లక్ష రూపాయలు రావాలనుకుంటే.. ఆ ఉద్యోగికి మరో 20 ఏళ్లు సర్వీసు ఉందనుకుంటే.. 20 ఏళ్ల తర్వాత ఆ ఉద్యోగికి అందేది రూ.లక్షే.. కానీ 20 ఏళ్లలో ఆ లక్ష విలువ ఎంతకు తగ్గుతుంది.. దాని వల్ల ఉద్యోగి ఎంత నష్టపోతాడనే అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు. పైగా పీఆర్సీ బకాయిల్లోనే డీఏ ఎరియర్స్ కూడా ఉన్నాయనడానికి ప్రభుత్వం ఎలాంటి ఆధారం చూపడం లేదని.. ఒక్కో ఉద్యోగికి పీఆర్సీ ఎరియర్లు ఎంత రావాలో రాతపూర్వకంగా ఇస్తే అందులో డీఏ బకాయిలు కలిసి ఉన్నాయో లేవో అర్థమవుతుందని అంటున్నారు.
Recommended Videos
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: When will the prc pay the arrears
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com