అది దేశ రాజధాని ఢిల్లీ.. ఆ మహానగరంలోని ఉత్తమ నగర్ లో కరణ్ దేవ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. ఈనెల 13న అతడు చనిపోయాడు. కరణ్ కు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. వ్యసనాలు కూడా లేవు. ఫ్యామిలీ పరంగా చూసుకుంటే అతని కుటుంబానికి కూడా ఎటువంటి దీర్ఘకాలిక రోగాలు లేవు.. పైగా కరణ్ వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటాడు. మితంగానే ఆహారం తింటాడు. మద్యం, మాంసం వంటి అలవాట్లు అతడికి లేవు. ఆరోగ్యంగా ఉన్న కరణ్ చనిపోవడం పట్ల చుట్టుపక్కల వారు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్నేహితులయితే షాక్ కు గురయ్యారు.
కరణ్ దేవ్ చనిపోయిన విషయం పోలీసులకు కూడా తెలిసింది. వారు ఆగమేఘాల మీద సంఘటనా స్థలానికి వచ్చారు. పలు ఆధారాలు సేకరించారు.. అయితే పోలీసులు నిర్వహించిన ప్రాథమిక విచారణలో కరణ్ విద్యుదాఘాతం వల్ల చనిపోయాడని తెలిసింది. అయితే కరణ్ ఇంట్లో విద్యుత్ షాక్ కొట్టేంత తీరుగా ఏదీ లేదు. ఎందుకంటే అతని ఇంట్లో విద్యుత్ సరఫరా అత్యంత పకడ్బందీగా ఉంటుంది. పైగా అతడు అత్యంత ఆధునికమైన స్విచ్ బోర్డులు.. విద్యుత్ తీగలు ఏర్పాటు చేశాడు. అలాంటప్పుడు విద్యుదాఘాతం ఏర్పడేందుకు ఆస్కారం లేదు.. దీంతో పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చింది. వారి స్టైల్లో దర్యాప్తు మొదలుపెట్టారు.
కరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం తీసుకెళ్తున్నప్పుడు అతడి భార్య ఒప్పుకోలేదు. పోస్టుమార్టం చేయనీయకుండా ఆమె ఆపింది. అయితే కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో ఆమె తలవంచక తప్పలేదు. ఇది ఎందుకో పోలీసులకు అనుమానం లాగా అనిపించింది. మరోవైపు మృతి సోదరుడు ఎందుకనో తన మేనల్లుడి ఫోన్ పరిశీలించాడు. అది అతడికి దిమ్మతిరిగేలా చేసింది. ఎందుకంటే అతడి ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా కరణ్ భార్య మాట్లాడినట్టు కనిపించింది. దీంతో కునాల్ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు.. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా.. అసలు విషయం బయటపడింది.. కరణ్ మేనల్లుడు, అతని భార్యకు వివాహేతర సంబంధం ఉంది. చాలా రోజులుగా అది కొనసాగుతోంది. అయితే ఇటీవల వారిద్దరూ ఏకాంతంగా ఉండడాన్ని కరణ్ చూశాడు. అంతేకాదు భార్యను మందలించాడు. తీరు మార్చుకోకపోతే బాగోదని హెచ్చరించాడు. భర్త వల్ల తమ బంధానికి బ్రేక్ ఏర్పడుతుందని భావించిన వారిద్దరు.. కరణ్ ను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే కరణ్ కు మత్తు మాత్రలు ఇచ్చారు. అతడు చనిపోయిన తర్వాత.. కరెంట్ షాక్ కొట్టి కన్నుమూశాడని ప్రచారం చేశారు.. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో కరెంట్ షాక్ తోనే చనిపోయాడని అనుకున్నారు. అని ఎప్పుడైతే పోస్టుమార్టం నివేదికలో మత్తుమాత్రలు అధికంగా తీసుకుని అతడు చనిపోయాడని రిపోర్టు వచ్చిందో.. అప్పుడే పోలీసులకు అనుమానాలు బలపడ్డాయి. దీనికి తోడు కరణ్ మేనల్లుడి వాట్సాప్ కాల్.. ఫోటోలు కీలకంగా మారాయి. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించారు.