Anantapuram Became Gold : ఆంధ్ర ప్రదేశ్ లో కరువు జిల్లాగా అనంతపురానికి పేరుంది. ఇక్కడ పంటలు పండక రైతులు అల్లాడిపోతుంటారు. నీటి వనరులు చాలా తక్కువ. అటువంటి ఈ జిల్లా కడుపులో ఎంతో విలువైన ఖనిజాలు బయల్పడుతున్నాయి. ఆ మధ్య బంగారు నాణేలు దొరుకుతున్నాయని ప్రజలు పనులు మానుకొని మరీ తండోపతండాలుగా తరలివెళ్లి మరీ తవ్వకాలు జరిపారు. ప్రస్తుతం మరో విస్తుగొలిపే విషయం బయల్పడింది. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఖనిజం ఉన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇక్కడ దొరుకుతున్న సహజ సంపదను ఒకసారి పరిశీలిస్తే..
వజ్రాలు
అనంతపురంలో వజ్రాల సంపద ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఇండియా ప్రకటించింది. పెన్నార్ నదీకి సమీపంలో తిమ్మసముద్రం వద్ద అధిక సాంధ్రత కలగిని వజ్రాలు ఉన్నట్లు ప్రకటించింది. దాంతో అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. కళ్యాణదుర్గంలోని అటవీ ప్రాంతంలో కూడా వజ్రాల గని ఉందని తవ్వకాలు జరిపారు. ఇక్కడ ఎర్రమట్టి నేలలు ఎక్కువ. వజ్రకరూర్, పగిడిరాయి, పెరవలి, జొన్నగిరి, తుగ్గలి ప్రాంతాల్లో తొలకరి చినుకుల తరువాత వజ్రాల వేట మొదలవుతుంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చి వజ్రాన్వేషణ సాగిస్తుంటారు. అయితే, పోలీసులు మాత్రం వజ్రాల వేట నిషేధమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
బంగారు నాణేలు
ఇదే జిల్లాలో బంగారు నాణేలు కూడా దొరుకుతున్నాయి. అనంత పట్టణానికి సమీపంలోని ఉప్పరిపల్లిలోని ఓ రైతు పొలంలో నాణేలు దొరకడంతో, జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఇక్కడకు చేరుకొని తవ్వకాలు మొదలుపెట్టారు. వీటిపై ఒకవైపు లక్ష్మీదేవి, ఆంజనేయుడు, సీతారాములు, వెంకటేశ్వరస్వామి బొమ్మలు ఉన్నాయి. మరోవైపు శాసన లిపి ఉండటంలో పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుల నాటివిగా పురావస్తు శాఖ అధికారులు తేల్చి చెప్పారు. వాటిని కొనుగోలు చేసిన, తవ్విన వారి నుంచి చాలావరకు స్వాధీనం చేసుకున్నారు.
విస్తారంగా నిక్షేపాలు
తాజాగా అనంతపురం జిల్లాలో విస్తారంగా నిక్షేపాలు ఉన్నట్లు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. వీటిని ఆటో మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఉపయోగిస్తారని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ధ్రువీకరించారు. జిల్లాలో సాంప్రదాయమైన రాళ్ల కోసం అన్వేషిస్తుండగా, ఈ నిక్షేపాలు బయటపడ్డాయి. రెడ్డిపల్లి, పెద్దవాడగురు ప్రాంతాల్లో వీటిని గుర్తించామని, మరింత లోతైన అధ్యయనం చేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. శాస్త్రవేత్తలు గుర్తించిన వాటిలో ముఖ్యంగా సెరియేట్, థోరైట్, కొలంబైట్, అల్లనైట్, టాంటలైట్, జిర్కాన్, మోనాజైట్, అపాటైట్, ఫ్లోరైట్, పైరోక్లోర్ యుక్సనైట్ ఉన్నాయి.
అనంతపురం జిల్లాలో దొరుకుతున్నట్లు చెబుతున్న ఈ ఖనిజాలను వాడుకోగలిగితే, అక్కడ కరువు అనే మాట వినబడదు. ఏపీలో ఆటో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు స్థాపించే అవకావం ఉంటుంది. ఇక్కడ దొరకుతాయని చెబుతున్న ఖనిజాలకు అంతర్జాతీయంగా కూడా బాగా డిమాండ్ ఉంది. నిరుద్యోగ సమస్య చాలా వరకు పరిష్కారమవుతుందని ఈ ప్రాంతవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.