Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ విజభజనసై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ ఉమ్మడి రాష్ట్రం చేస్తే.. మొదట స్వాగతించేది వైఎస్సార్‌సీపీ అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను తిప్పి పంపాలని డిమాండ్ చేస్తూ.. ఉండవల్లి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కుదిరితే ఉమ్మడి ఏపీ మళ్లీ కలిసి ఉండాలన్నదే వైసీపీ విధానం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తీరు, సుప్రీంకోర్టులో కేసుపై ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్‌పై కావాలనే ఆయన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్ ఎప్పుడూ ముందుంటారని స్పష్టం చేశారు సజ్జల. అందుకోసం వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోబోమని తెలిపారు.

రాజీ పడితే రాజకీయం లేనట్లే..
రాష్ట్ర ప్రయోజనాల పట్ల రాజీ పడితే జగన్ రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో జగన్‌కు సత్సంబంధాలు ఉండవచ్చని, అందులో తప్పు లేదని, అయితే న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై వెనక్కు తగ్గకూడదని హితవు పలికారు. ఇప్పటికే జగన్ అనేక విషయాల్లో రాజీ పడినట్లు అర్థమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సుప్రీం తీర్పు.. ఎవరికి వారే అనుకూలంగా..
అమరావతిపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును ఎవరికి వారే తమకు అనుకూలంగా మలచుకున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అదేరోజు ఏపీ విభజన అంశాలపై చర్చ జరిగిందని, కానీ దానిని ఎవరూ పట్టించుకోలేదన్నారు. విచారణ జరుగుతుండగా ఏపీ ప్రభుత్వం తరుపున న్యాయవాది హాజరై తాము విభజనకు వ్యతిరేకం కాదని చెప్పారన్నారు. దీనిపై విచారిస్తే పండోరా బాక్స్‌ను ఓపెన్ చేసినట్లవుతుందని అన్నారు. ఇది జగన్‌కు తెలిసే జరుగుతుందా? నిర్ణయాలు ఎవరైనా తీసుకుంటున్నారా? అన్నది తేలాల్సి ఉందన్నారు. తెలిసి జరిగితే జగన్ ఆంధ్రప్రదేశ్‌కు మోసం చేస్తున్నట్లేనని అన్నారు.

విభజనకు వ్యతిరేకంగా పిటిషన్..
సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశామని సజ్జల పేర్కొన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యట సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోనూ ప్రధాని సమక్షంలోనే రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు ఇతర ప్రయోజనాలు ఏవీ లేవని సీఎం జగన్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, తాజా చర్చ మరోమారు తెలంగాణ అస్తిత్వంపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.