Gujarat And Himachal Pradesh: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్ లో బీజేపీ, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారారాన్నిహస్తగతం చేసుకున్నాయి. గుజరాత్ లో బీజేపీ గెలుపు ఊహించిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ బీజేపీ దూకుడు ప్రదర్శించింది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో బీజేపీ 150 స్థానాలు కైవసం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. పశ్చిమ బెంగాల్ లో ఏడుసార్లు వరసగా గెలిచి సీపీఎం పార్టీ నెలకొల్పిన రికార్డును బీజేపీ బద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో బీజేపీ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది. పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు.

ఇక హిమాచల్ ప్రదేశ్ చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్ 39 చోట్ల విజయం సాధించగా కాంగ్రెస్ 26 సీట్లతోనే సరిపెట్టుకుంది. ఇక్కడ హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా అదేమీ జరగలేదు. ఇక్కడి ఓటర్లు వినూత్నంగా తీర్పు ఇవ్వడం పరిపాటే. వరసగా రెండుసార్లు ఏ పార్టీ కూడా అధికారం చేపట్టలేదు. చరిత్రను మార్చాలని కొత్త చరిత్ర సృష్టించాలని బీజేపీ భావించినా అది కుదరలేదు. దీంతోనే కాంగ్రెస్ కు ఓటర్లు పట్టం కట్టారు. అధికార బీజేపీకి ఓటర్లు షాకిచ్చారు. కాంగ్రెస్ కు మరోమారు అధికారం అందించారు.
గుజరాత్ ఎన్నికల్లో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా బీజేపీ టికెట్ పై జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్ లో గత ముప్పై అయిదేళ్లుగా ఒకే పార్టీకి అధికారం ఇచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించడం గమనార్హం. ఈ నేపథ్యంలో బీజేపీకి గుజరాత్ అండగా నిలిచినా హిమాచల్ ప్రదేశ్ మాత్రం షాక్ ఇచ్చింది. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తుందని భావించిన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించింది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అవకాశం ఇవ్వకుండా చేయడానికి చర్యలు తీసుకుంటోంది.

ఇక గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం చూస్తుంటే మోడీ స్టామినా తగ్గలేదని తెలుస్తోంది. ఆప్ కూడా పోటీలో నిలిచినా సింగిల్ అంకెకే పరిమితం కావడం గమనార్హం. ఢిల్లీ, పంజాబ్ లలో అధికారం సాధించిన ఆప్ గుజరాత్ లో పాగా వేయాలని చూసినా కుదరలేదు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ఆశలకు నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఆప్ కు 13 శాతం ఓట్లు రావడం ఒక్కటే వారికి ఊరట కలిగించే అంశం. మొత్తానికి బీజేపీకి గుజరాత్ మంచి శక్తిని ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోమారు ప్రధాని నరేంద్ర మోడీకి పదవి కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ ఎన్నికలు 2024 ఎన్నికలకు రెఫరెండంగా బీజేపీ భావిస్తోంది. దీంతో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయోననే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.