
ప్రస్తుత ఆధునిక యుగంలో పెళ్లిపై యువతకు ఓ రకమైన అభిప్రాయం ఏర్పడి పోయింది. పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ పోతుందని, బాధ్యతలు పెరిగి సంతోషం దూరమవుతుందనే భావన మొదలైంది. దీంతో చాలా మంది పెళ్లి, సంసారం, బంధాలు, బాంధవ్యాలు ఎందుకని.. పాశ్చాత్య తరహాలో సహజీవనం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. పెళ్లి చేసుకున్నా, ఇబ్బందులు పడకుండా ఉండేలా వీకెండ్ మ్యారేజెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ అమెరికా, జపాన్‌లో వేగంగా విస్తరిస్తోంది.
వీకెండ్ మ్యారేజ్..
అసలేంటీ ఈ వీకెండ్ మ్యారేజ్ అంటే.. వీరూ అందరిలాగానే పెళ్లి చేసుకుంటారు. అయితే ఇద్దరూ వారంతంలో మాత్రమే కలిసి ఉంటారు. మిగతా రోజుల్లో ఎవరి జీవితం వారు స్వేచ్ఛగా గడుపుతారు. ఈ పద్ధతిలో ఎవరి ఉద్యోగం, ఎవరి ఖర్చులు వారివే. వారాంతంలో మాత్రం కలిసి ఖర్చులు పంచుకుని ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పుడితే ఖర్చులు సగం సగం పెట్టుకుంటారు. ఈ వీకెండ్ మ్యారేజెస్‌తో చాలా లాభాలున్నాయని యువత భావిస్తోంది. వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే కలిసి ఉంటారు కాబట్టి, విభేదాలు, గొడవలు ఉండవు.
మ్యారేజ్ లైఫ్.. బ్యాచిలర్ లైఫ్ రెండూ..
ఈ వీకెండ్ మ్యారేజ్‌తో అటు బ్యాచిలర్ లైఫ్, ఇటు మ్యారీడ్ లైఫ్ ఒకేసారి ఎంజాయ్ చేయవచ్చని యువత భావిస్తోంది. పైగా వారంతంలో ఇద్దరూ పని ఒత్తిడి లేకుండా ఉంటారు కాబట్టి, సంతోషంగా, సరదాగా గడుపుతారని ఇద్దరి మధ్య బంధం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వారమంతా కలిసి ఉండే జంటల కంటే ఇలా వారానికి రెండు రోజులు మాత్రమే కలిసి ఉండేవారు వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
ఇండియాలో ఇంకా మొదలు కాలే..
ఈ సంస్కృతి ఇండియాలో ఇంకా మొదలు కాలేదు. హిందూ సంప్రదాయంలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కానీ, పెరుగుతున్న పాశ్చాత్య సంస్కృతితో మన దేశంలోనూ వివాహ బంధాలు తెగిపోతున్నాయి. వైవాహిక జీవితాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే త్వరలోనే వీకెండ్ మ్యారేజెస్ మన దేశంలోనూ త్వరలో జరిగే అవకాశమే కనిపిస్తోంది. అయితే జపాన్ తరహాలో భారత్‌లో కూడా ఈ ట్రెండ్ సక్సెస్ అవతుందని చెప్పలేం.