
AP MLC Elections Results: వైసీపీ ఉక్కపోతకు గురవుతోంది. వేసవి ప్రారంభంలోనే ఉక్కిరిబిక్కిరవుతోంది. పట్టభద్రులు కొట్టిన దెబ్బకు విలవిల్లాడిపోతోంది. సెమీ ఫైనల్ లోనే తడబడుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్న చిన్న పసికూనలతో తలబడి గెలిచినా.. అసలు సిసలైన పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం చతికిలపడుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో వెనుకబడిపోయింది. పశ్చిమ రాయలసీమలో కాస్తా మెరుగగా ఉన్నా.. రెండో ప్రాధాన్యత ఓట్లలో వెనుకబడిపోయే అవకాశముంది. ఈ మూడు సీట్లలో టీడీపీ పట్టుబిగించడం.. రెండుచోట్ల స్పష్టమైన విజయం కనిపిస్తుండడంతో వైసీపీ కలవరపాటుకు గురవుతోంది. ఫస్ట్ టైమ్ అటు నాయకులు, ఇటు పార్టీ శ్రేణుల్లో ఆందోళన ప్రారంభమైంది.
ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహాన్ని పట్టభద్రులు స్పష్టంగా చూపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో వారి వ్యతిరేకత కనిపిస్తోంది. మూడు రాజధానులు, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో వైసీపీ హడావుడి చేసినా పట్టభద్రులు, విద్యాధికులు పట్టించుకోలేదు. టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు ఏకపక్షంగా మద్దతు పలికారు. ప్రస్తుతం ఆయన గెలుపుబాటలో ఉన్నారు. నాలుగో రౌండ్ ముగిసేసరికి ఆయన 20 వేల ఓట్ల ఆధిక్యంతో ముందున్నారు. వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ రెండో ప్లేస్ లో ఉండగా.. పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభ మూడో స్థానంలో ఉన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాన్ని వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అతిరథ మహారధులైన నేతలు రంగంలోకి దిగారు. విశాఖ రాజధాని అంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారు. ఓట్లతో తమ స్పష్టతనిచ్చారు. అంతకు ముందు ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. అంతుకు ముందు రెండుసార్లు పీడీఎఫ్ అభ్యర్థులే విజయం సాధించారు. ఈసారి మాత్రం టీడీపీ స్పష్టమైన విజయాన్ని దక్కించే చాన్స్ కనిపిస్తోంది.

అటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో సైతం టీడీపీ అభ్యర్థి కంచకర్ల శ్రీకాంత్ భారీ ఆధిక్యంలో ఉన్నారు. ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యత కనబరుస్తూ వస్తున్నారు. ఆయన గెలుపు సునాయాసనమేని తెలుస్తోంది. గతంలో ఈ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఈసారి అధికారంలో ఉండడంతో ఎన్నిరకాలుగా అక్రమాలకు పాల్పడ్డారో అన్ని విధాలా చేసి చూపించారు. గెవలేమని అనుకున్నారేమో కానీ భారీగా దొంగనోట్లు సైతం వేయించారు. అయితే అసలైన పట్టభద్రుల మనసు మార్చలేకపోయారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చెరిపే ప్రయత్నం చేయలేదు. దీంతో ఇక్కడ వైసీపీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో సైతం వైసీపీకి స్వల్ప మెజార్టీయే. ఇక్కడ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాలరెడ్డి గట్టి పోటీనిస్తున్నారు. వైసీపీకి అంతులేని బలమున్న ప్రాంతంగా పశ్చిమ రాయలసీమ ఉంది. సీఎం జగన్ నుంచి హేమాహేమీలు ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి వెయ్యి ఓట్ల ముందంజలో ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరికీ 50 శాతం ఓట్లు వచ్చే చాన్స్ లేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యం. ఇప్పటికే పీడీఎఫ్, టీడీపీ మధ్య రెండో ప్రాధాన్యత ఓట్ల విషయంలో అవగాహన ఉండడంతో టీడీపీ ఆధిక్యత కనబరిచే చాన్స్ ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నికలను జగన్ చాలా లైట్ తీసుకున్నారు. సాధారణ ఎన్నికలుగా భావించి రంగంలోకి దిగారు. చేతులుకాల్చుకున్నారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటా కింద జరిగిన ఎన్నికలు పర్వాలేదు. కానీ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీచేయడం ఒకరకంగా రిస్కే. కానీ సాహసానికి దిగి చేజేతులా కష్టాలను తెచ్చుకున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగ యువత ప్రభుత్వంపై విపరీతమైన ఆగ్రహంతో ఉన్నారు. అయితే దొడ్డిదారుల్లో గెలిచి ప్రభుత్వ వ్యతిరేకత ఉత్తమాటేనని తేల్చాలని డిసైడ్ అయ్యారు. సెమీఫైనల్ గా భావించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగి పరువు పోగొట్టుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఒక ఎత్తు.. ఈ ఫలితాలతో మరో ఎత్తు అన్నట్టు విపక్షలు పట్టుబిగించే చాన్స్ ఉంది.
వాస్తవానికి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు పీడీఎఫ్ అభ్యర్థులే గెలుపొందుతుంటారు. ప్రజాసంఘాల మద్దతుతో పోటీలో నిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమకు అనుకూలమైన అభ్యర్థికి రాజకీయ పార్టీలు మద్దతు పలకడం రివాజుగా వస్తోంది. ఆ అనవాయితీని బ్రేక్ చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో మార్గం సుగమం చేసుకునేందుకు, పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయుల మద్దతు తనకే ఉందని చెప్పాలన్న ఉబలాటంలో జగన్ ఏకంగా అభ్యర్థులను బరిలో దించేశారు. అంతటితో ఆగకుండా గెలుపు కోసం అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు సరికదా వ్రతం చేసినా..దాని పుణ్యం పురుషార్థం దక్కనట్టు ఓటమిని ఏరికోరి పలకరించారు. ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నారు.