
Vijayasai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డిది పార్టీలో నంబర్ 2 స్థానం. జగన్ తరువాత పార్టీ శ్రేణులు అంతలా అభిమానం చూపేవారు. ఎక్కడికి వెళ్లినా మందీ మార్భలంతో పెద్ద తతంతగమే నడిచేది. చివరకు సామాన్య కార్యకర్త పార్టీపై అభిమానంతో బ్యానర్ పెట్టుకున్నా జగన్ సరసన విజయసాయిరెడ్డి ఫొటో ఉండేది. అటు ఢిల్లీలో సైతం చక్రం తిప్పేవారు. పేరుకే 22 మంది లోక్ సభ సభ్యులు కానీ.. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి అనుమతితోనే ఎటువంటి కార్యక్రమాలైనా నిర్వహించాలి. ఎవరినైనా కేంద్ర పెద్దలను కలవాలి. అంటే విప్ మొత్తం విజయసాయిరెడ్డికే కట్టబెట్టేశారు. అయితే మొన్నటివరకూ ఈ దర్పం నడిపిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఒంటరయ్యారు. ఎక్కడికి వెళ్లినా ఒంటరిగానే వెళుతున్నారు. ఆయనను ఎవరకూ కలవొద్దని హైకమాండ్ ఆదేశాలిచ్చేలా పరిస్థితి కనిపిస్తోంది.
వైసీపీ సర్కారు కేంద్ర సాయం లేకుండానే విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. గతంలో చంద్రబాబు 2016, 17,18 సంవత్సరాల్లో వరుసగా సీఐఐ సదస్సులను కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఏర్పాటుచేశారు. కానీ కేంద్రంతో ఏం పని అనుకుందో.. లేకుంటే సొంతంగానే పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించాలనుకుందో తెలియదు కానీ జగన్ సర్కారు సొంతంగానే ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ స్థాయిలో దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించింది. అందుకుగాను భారీ ఖర్చుచేసి కర్టెన్ రైజర్ ఈవెంట్లను సైతం నిర్వహించింది. అయితే జాతీయ స్థాయిలో పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను చూసిన విజయసాయిరెడ్డికి మాత్రం దీనికి ఎంట్రీ లేదని తెలుస్తోంది. కనీసం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే టీమ్ లో కూడా ఆయనకు చోటుదక్కలేదు.
ఒక వైపు అంగరంగ వైభవంగా సమ్మిట్ కు విశాఖలో ఏర్పాట్లు జరుగుతుండగా విజయసాయిరెడ్డి ఒక్కరే కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు. ఎందుకోసమని అడిగితే విశాఖ ప్రాజెక్టులకోసమని చెబుతున్నారు. అయితే ఇది నమ్మశక్యంగా లేదు. విశాఖలో భూదేవి అంత పందిరి వేసి వివాహం చేస్తున్నట్టుగా గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు చేస్తుండగా ఢిల్లీలో విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నట్టు అని అక్కడ వారు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో అధికార వైసీపీలో ఏదో జరుగుతందని అనుమానిస్తున్నారు. పిలవని పేరంటానికి వెళ్లడం ఎందుకు అనుకున్నారేమో కానీ..విజయసాయిరెడ్డి ఏపీ వైపు చూడడం మానేశారు. అందుకే ఇప్పుడు కేంద్ర పెద్దలను కలిసే పనిలో పడ్డారని టాక్ నడుస్తోంది.

అయితే సందట్లో సడేమియా అన్నట్టు ముందు రోజు ప్రధాని మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను రైతుల ఖాతాలో జమ చేశారు. తరువాత రోజు ఆ పథకాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి అన్నట్టు జగన్ తెనాలి వెళ్లి బటన్ నొక్కారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి తన ట్లిట్టర్ ను ఆన్ చేశారు. పీఎం కిసాన్ మంచి పథకమని అభివర్ణిస్తూ అది కేంద్ర పథకమని గుర్తుకు తెచ్చేలా ప్రధానిని అభిమానిస్తూ ట్విట్ చేశారు. దీంతో ఇది వైరల్ గా మారింది. అయితే వైసీపీ ఆవిర్భావనం నుంచి ఉండే విజయసాయిరెడ్డికి జగన్ వ్యవహార శైలి తెలియంది కాదు. కానీ ఎందుకో ఆయన వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అది అలకో, అసంతృప్తో, అంతకు మించి ఏమైనా ఉందో? అన్నది తెలియాలంటే మరి కొద్దిరోజుల పాటు ఆగాల్సిందే.