Homeఆంధ్రప్రదేశ్‌YCP: వైసీపీ కొత్త గేమ్..

YCP: వైసీపీ కొత్త గేమ్..

YCP
JAGAN

YCP: ప్రచారంలో వెనుకబడినట్టు వైసీపీ భావిస్తుందా? అందుకే ప్రతికూల ఫలితాలు వస్తాయని కలత చెందుతోందా? దానిని అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందా? తమ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలని చూస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా ప్రచారం చేయాలని చూస్తుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. తాము చేసిన పనులను నోటీసు బోర్డులో పెట్టి ప్రజల ఆలోచనను మార్చాలని చూస్తోంది. తమపై నమ్మకం తగ్గకుండా ఉండేందుకు ప్రతి సచివాలయంలో పెద్ద పెద్ద ప్రచార బోర్డులు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ప్రజల్లో మారుతున్న వైఖరిని గమనించి కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే జగనన్న మా నమ్మకం నువ్వే.. మా భవిష్యత్ నువ్వే అంటూ ఇంటింటా స్టిక్కర్లు అతికిస్తోంది. అది చాలదన్నట్టు సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల్లో సంక్షేమ పథకాల లబ్థిదారుల వివరాలు, అభివృద్ధి పనుల జాబితాను పొందుపరచడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

స్థానిక సంస్థలు నిర్వీర్యం..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందన్న ఆరోపణలను ఎదుర్కొంటోంది. తన ఆర్ధిక అవసరాలకు పంచాయతీ నిధులను వాడుకోవటం దగ్గర నుంచి.. గృహ సారధుల నియామకం వరకు సీఎం జగన్ యావత్ పంచాయతీ రాజ్ వ్యవస్థనే భ్రష్టు పట్టించారని సొంత పార్టీ ప్రజాప్రతినిధులే ఆరోపిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక.. చేసేందుకు పని లేక గ్రామ సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు.. సచివాలయాలు, వాలంటీర్ల పేరుతో సమాంతర వ్యవస్థలను నడుపుతున్నట్టు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పంచాయతీల్లో ఏ చిన్న పని చేసుకోలేకపోతున్నామని వాపోతున్నారు. అటు విపక్షాలు, ఇటు స్థానిక సంస్థల ప్రతినిధులు వీధి పోరాటానికి దిగుతున్నారు. అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కొత్తగా ప్రచార బోర్డులు ఏర్పాటుచేయాలనుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సొంత పార్టీ సర్పంచ్ ల తిరుగుబాటు..
ఇటీవల ప్రభుత్వంపై సొంత పార్టీ సర్పంచ్ లే ఎదురుతిరుగుతున్నారు. మొన్న ఆ మధ్య పంచాయతీ చాంబర్ సమావేశంలో వైసీపీకి చెందిన సర్పంచే తన చెప్పుతో తానే కొట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. సర్పంచ్ గా ఎన్నికయ్యామే కానీ.. ప్రజల ఆకాంక్షలను తిర్చలేకపోతున్నామన్న బాధను వ్యక్తం చేశారు. అయితే ఆయన ఒక్కరే కాదు.. చాలా మంది సర్పంచ్ లు ఇదే ఆవేదన తో ఉన్నారు. పంచాయతీల్లో అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదు సరికదా.. కేంద్రం అందించే ఆర్థిక సంఘం నిధులను.. చివరకు పంచాయతీ సాధరణ నిధులను సైతం ప్రభుత్వం పక్కదారి పడుతుండడంతో వారంతా అంతర్మథనం చెందుతున్నారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళితే నష్టం తప్పదన్న అంచనాకు ప్రభుత్వం వచ్చింది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అలాగని నిధులు కేటాయించే పరిస్థితి లేదు. సొంత పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్న వేళ సరికొత్త ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యింది.

YCP
JAGAN

అభివృద్ధి లేకపోవడంతో..
గత నాలుగేళ్లలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి లేదు. మౌలిక వసతులు లేకుండా పోయాయి. కేవలం సంక్షేమ పథకాల పేరు చెప్పి నెట్టుకొస్తున్నారు. సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. దీంతో ప్రజలు సైతం పంచాయతీల వైపు చూడడం మానేశారు. అసలు సర్పంచ్ ను ఆశ్రయించడమే మానేశారు. అంతా వలంటీర్లదే రాజ్యం నడుస్తోంది. ఇటువంటి తరుణంలో చాలామంది సర్పంచ్ లు ప్రభుత్వంపై వ్యతిరేక భావనతో ఉన్నారు. ఎన్నికల నాటికి పక్క పార్టీల్లోకి చేరే అవకాశముంది. అందుకే ప్రభుత్వ గృహసారథులు, కన్వీనర్ల పేరిట ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూసుకుంది. ఇప్పుడు కొత్తగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులతో ప్రచార బోర్డులు ఏర్పాటుచేయడం ముందస్తు జాగ్రత్తలో భాగంగానే అన్న టాక్ అయితే వినిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version