
YCP- TDP: సంక్షేమ పథకాలే ఆయువుగా భావిస్తున్న వైసీపీ వాటినే ఆస్త్రంగా మలుచుకొని ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతుంది. టీడీపీ అధికారం చేపడితే పథకాలన్నీ ఆగిపోతాయనే ప్రచారం మొదలుపెట్టింది. ప్రజలను మానసికంగా వైసీపీ వైపు మరలేలా ఎత్తుగడ వేస్తుంది. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఈ పథకాలకు ఢోకా ఉండదనే భావనను ఆ పార్టీ నాయకులు కల్పిస్తున్నారు. ఆ ప్రచారాలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫుల్ స్టాప్ పెట్టారు.
Also Read: Annamalai challenges DMK : అన్నామలై పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు – చేసిన తప్పేంటి?
ముఖ్యంగా నవరత్నాల్లో అమ్మఒడి, విద్యా దీవెన, రైతు భరోసా, ఆసరా, చేయూత, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, సున్నావడ్డీ తదితర అనేక పథకాలు ఉన్నాయి. వీటిలో అమ్మఒడి, విద్యా దీవెన పథకాలను నేరుగా తల్లిదండ్రులకు కాకుండా ఆయా విద్యా సంస్థలకు డైరెక్టుగా అందేలా ఏర్పాట్లు చేస్తామని టీడీపీ మాజీ మంత్రి జవహర్ చెప్పినట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. లోకేష్ కూడా కొన్ని పథకాల్లో మార్పు చేర్పులు చేస్తామని అన్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత టీడీపీ నేతలు తాము అనని మాటలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని అన్నారు. ప్రజల్లో భయాందోళనకు గురి చేసేందుకు ఇలా తప్పుడు కథనాలు అల్లుతున్నారని మండిపడ్డారు.
తాజాగా యువగళం పాదయాత్రలో ఉన్న లోకేష్ టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలను రద్దు చేస్తామనే పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. పీలేరులో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే వేటినీ రద్దు చేయని అన్నారు. సచివాలయాల వ్యవస్థ కొనసాగిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలేవి చంద్రబాబు రద్దు చేయలేదని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీని కొనసాగించామని చెప్పుకొచ్చారు.

వాస్తవానికి రాష్ట్రం దివాలా తీయడానికి ప్రధాన కారణం సంక్షేమ పథకాలే. జగన్ సీఎం అయిన వెంటనే నవరత్నాల పేరుతో పథకాలను అమలు చేసే పనిలో పడ్డారు. అప్పటికే రాష్ట్ర పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. నవరత్నాలు ఐదేళ్ల పాటు అమలు చేయాలనంటే రూ.6 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా కట్టినట్లు అప్పట్లో కథనాలు కూడా వెలువడ్డాయి. ఇవన్నీ లెక్కచేయని జగన్ పథకాల అమలుకు సరైన ఆర్థిక వనరులు లేక ఇతర అవసరాలకు కేటాయించిన నిధులను కూడా దారిమళ్లించారు. ఇవి చాలక కేంద్రం నుంచి అప్పులు తీసుకువస్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని దివాళా తీయించారు. పథకాల రద్దు చేస్తారనే పుకార్ల కంటే వైసీపీ ఇలాగే ఉండి పథకాలు కొనసాగిస్తే పరిస్థితి ఏంటనే భయమే ప్రజలను వెంటాడుతుంది.
Also Read:Jathi Ratnalu: షాకింగ్..’జాతి రత్నాలు’ సినిమా ఆ చిత్రానికి రీమేకా..? ఇన్ని రోజులు తెలియలేదే!