KCR Vs BJP: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన అనంతరం ఖమ్మంలో తొలి ఆవిర్భావ సభ నిర్వహించారు. కానీ, ఈ సభకు 4 నుంచి 5 లక్షల దాకా జనం వస్తారని అందరూ భావించారు.. జరిగింది వేరు.. వాస్తవానికి సమావేశాన్ని మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు ప్రారంభించాలి.. జనం తక్కువగా ఉండటంతో సీఎం కేసీఆర్ అర్ధగంట ఆలస్యంగా సమావేశాన్ని ప్రారంభించారు.. 25 నిమిషాల పాటే ప్రసంగించారు. ఆ ప్రసంగంలోనూ పసలేదు.. ఈ ఆవిర్భావ సభ ద్వారా భారతీయ జనతా పార్టీ విధానాలను గణాంకాల ద్వారా ఎండగడతారని భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలు భావించారు.. కానీ అక్కడ జరిగింది పూర్తిగా వేరు.. జనం తక్కువగా ఉండడంతో కెసిఆర్ ప్రసంగంలో పస లేకుండా పోయింది.. పైగా కమ్యూనిస్టు నాయకులకు రెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇవ్వలేదు.. వారు కూడా ఇదే మా మహాభాగ్యం అనుకుని వెళ్లిపోయారు.. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్ హిందీ, ఇంగ్లీషులో ప్రసంగించారు. కనీసం వారికి అనువాదకులను నియమించాలనే సోయి కూడా భారత రాష్ట్ర సమితి నాయకులకు లేకపోవడం గమనార్హం.

ఎలా సాధ్యమవుతుంది?
ఆవిర్భావ సభ అంటే ఏ పార్టీ అయినా కూడా భారీ ఎత్తున నిర్వహిస్తుంది.. తామే ప్రత్యామ్నాయం ఎందుకో స్పష్టంగా చెప్తుంది.. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో వివరిస్తుంది.. ఉత్తము అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తుంది.. కానీ పైవేవీ లేకుండానే కేసీఆర్ ఆవిర్భావ సభ నిర్వహించాడు. 25 నిమిషాలు మాత్రమే ప్రసంగించిన కేసీఆర్.. గతంలో తానం మాట్లాడిన మాటలే ఉటంకించాడు.. అంత తప్ప ఇందులో కొత్తదనం ఏమీ లేదు. బిజెపి విధానాలు సరిగా లేవని చెప్పిన కేసీఆర్… మరి బీఆర్ఎస్ విధానాలు ఏమిటో స్పష్టంగా చెప్పలేకపోయారు.. ఇలాంటి సంకట స్థితిలో భారతీయ జనతా పార్టీని కేసీఆర్ ఎదుర్కొంటారో ఆయనకే తెలియాలి.
రెండు నిమిషాలే ఇచ్చారు
కమ్యూనిస్టులను ప్రగతిశీల శక్తులుగా అభివర్ణించిన కేసీఆర్… వారు మాట్లాడేందుకు రెండు నిమిషాలు మాత్రమే ఇచ్చారు.. వారు కూడా ఇదే మాకు దక్కిన అదృష్టమని భావించారు..ఇక భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ సందర్భంగా జిల్లాలో కొద్దిరోజులుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నేతలు ఎడ మొహం పెడమొహంగా ఉన్నారు.

ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లడం, అక్కడ సుదీర్ఘంగా ఇద్దరు ఏకాంతంగా భేటీ అవడం, ఆ తర్వాత నుంచి తుమ్మల సభ ఏర్పాట్లలో యాక్టివ్ కావడం వంటి అంశాలతో నేతలు జీర్ణించుకోలేకపోయారని, అందుకే వేదికపై కూడా ఎవరికి వారే అన్న తీరుగా వ్యవహరించాలని చర్చ జరుగుతున్నది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు తను పై పెత్తనం చెలాయించడం ఏంటన్న పలు అంశాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన సభ ఆశించిన స్థాయిలో జరగలేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. సొంత పార్టీలోనే ఇన్ని సమస్యలు పెట్టుకున్న కేసీఆర్… బిజెపిని ఎలా ఎదుర్కొంటారో ఆయనకే తెలియాలి.. దేశం గుణాత్మక అభివృద్ధి ఎలా చెందాలో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, దానిని ఇలాంటి బహిరంగ సభలో చెప్పడం కుదరదని వివరించిన కేసీఆర్… మరి ప్రజలకు ఏం చెప్పేందుకు ఈ సభ నిర్వహించారో ఆయనకు తెలియాలి. కెసిఆర్ మాటల్లోనే.. ఈ సభ గురించి చెప్పాలంటే బభ్రజమానం భజగోవిందం!