Kata Amrapali: సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఏపీలో రిపోర్ట్ చేశారు. వాస్తవానికి క్యాట్ నిబంధనల ప్రకారమే కేంద్ర సర్వీస్ అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. అప్పట్లో ఆమ్రపాలి క్యాట్ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో పని చేశారని విమర్శలు వినిపించాయి.. అయితే ఏపీలో రిపోర్ట్ చేసిన ఆమ్రపాలి.. తనను ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ కు కేటాయించడం సరికాదని ఆమె క్యాట్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ చాలా రోజులపాటు విచారణకు రాలేదు. మొత్తానికి ఆమె పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత క్యాట్ కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది..
వాస్తవానికి తనను తెలంగాణ క్యాడర్ కు కేటాయించాలని ఆమ్రపాలి గత ఏడాది డిఓపిటి(ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ) కి దరఖాస్తు చేసుకున్నారు. దానిని డిఓపిటి తిరస్కరించింది. డి ఓ పి టి తిరస్కరించిన నేపథ్యంలో ఆమె ఏపీ కేడర్ కు వెళ్లక తప్పలేదు. ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్లోని పర్యాటకశాఖ కార్పొరేషన్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక డివోపిటి తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సవాల్ చేశారు.. ఆమె ఏకంగా క్యాట్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ను లతా బసవరాజ్, వరుణ్ సింధు ధర్మాసనం విచారించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అధికారుల కోసం ప్రత్యూష్ సిన్హా కమిటీని అప్పటికేంద్రం ఏర్పాటు చేసింది. అయితే నాటి కమిటీ కొంతమంది అధికారుల విషయంలో ఉదారత చూపించింది. మరి కొంతమంది అధికారుల విషయంలో అత్యంత కఠిన వైఖరి అవలంబించింది. ఈ విషయాన్ని లత, వరుణ్ ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది. 2010 బ్యాచ్ కు చెందిన ఆమ్రపాలి చేసిన పిటిషన్ అనుమతించిన ధర్మాసనం.. ఆమెను తెలంగాణ కేడర్ కు కేటాయిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో క్యాట్ ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే ఆమ్రపాలి తెలంగాణలో రిపోర్ట్ చేసే అవకాశాలున్నాయి. ఏడాదిగా ఆమె ఏపీ టూరిజం ఎండిగా కొనసాగుతున్నారు. విధి నిర్వహణలో కచ్చితంగా ఉంటారని ఆమ్రపాలికి పేరుంది. గతంలో ఆమె వరంగల్ జిల్లా కలెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసులోకి వెళ్లారు. ఎన్నికల సంఘం లోను కీలకంగా పనిచేసే పేరు తెచ్చుకున్నారు.
ఆమ్రపాలి తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో.. ఆమెను జిహెచ్ఎంసి కమిషనర్ గా నియమిస్తారని చర్చ జరుగుతోంది. క్యాట్ ఆదేశాలు రాకమందు ఆమె రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో జిహెచ్ఎంసి కమిషనర్ గా పనిచేశారు. జిహెచ్ఎంసిలో తనదైన మార్పులు తీసుకురావడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. జిహెచ్ఎంసి కమిషనర్ గా ఉన్నప్పుడే ఆమె ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు తిరిగి తెలంగాణకు వస్తున్నారు కాబట్టి.. జిహెచ్ఎంసి కమిషనర్ గా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది.