
Kommareddy Pattabhiram: రెండు రోజుల నుంచి గన్నవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. టీడీపీలో గెలిచి ఆ తరువాత వైసీపీ పంచన చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ వ్యవస్థాపకుడు చంద్రబాబు, లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశాంటూ ఆ పార్టీ సీనియర్ నేత పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి మరీ వల్లభనేని వంశీని తిట్టిపోశారు. చిన్న సైకో అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇరు నేతల మధ్య చెలరేగిన వ్యాఖ్యల దుమారం చినికి చినికి గాలివానలా మారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి దారితీసింది. గన్నవరం రణరంగంగా మారింది.
అంత పగ ఎందుకు?
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతుందని అక్కడికి వెళ్తున్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను పోలీసులు మార్గమధ్యలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయన కారులోనే ఊరంతా తిప్పి సాయంత్రానికి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ చిత్రహింసలు పెట్టినట్లు ఆయన కోర్టులో వాగ్మూలం ఇవ్వడం మరో వివాదానికి కారణంగా నిలిచింది. పోలీసులు థార్డ్ డిగ్రీ ప్రయోగించారని చెబుతున్నారు. ఆయనను అంతలా కొట్టేంత పగ ఏముందని సర్వత్రా చర్చ జరుగుతుంది. బయటకు వంశీ, పట్టాభీల వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు కనబడుతున్నా, స్థానికంగా ఇరువురి మధ్య ఆధిపత్య పోరు ఎప్పటి నుంచో జరుగుతుందనే ప్రచారం ఉంది. టీడీపీలో గెలిచిన వంశీ వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నారు. రెండుసార్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మరోసారి గెలుపు రుచిచూడాలని భావిస్తున్నారు. అయితే, నియోజకర్గ ప్రజానీకంలో ఆయనపై కొంత పట్టు సడలినట్లు చెబుతున్నారు. ప్రభుత్వంపై ఉన్నవ్యతిరేకత ఈ సారి ఆయన గెలుపు అసామన్యంగానే ఉన్నట్లు కనిపిస్తుంది.
పట్టు నిలుపుకునే పనిలో పట్టాభి
తెలుగుదేశం పార్టీలో రాష్ట్రస్థాయి నాయకుడిగా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవాలనే కోరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నాయి. ప్రతి విషయంపై పట్టాభి స్పందిస్తూ తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఈయన గన్నవరం సీటు ఆశిస్తూ, నియోజకవర్గంలో పార్టీ నేతలను కలుపుకొని పోతూ పట్టు నిలుపుకునే పనిలో పడ్డారు. వంశీపై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పలుమార్లు ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. చంద్రబాబును, ఆయన కుటంబాన్ని పదేపదే తీవ్రంగా విమర్శలు చేస్తున్న వంశీని ఈ సారి అసెంబ్లీ గేటు దాటకుండా చేసేందుకు చంద్రబాబు పథక రచన చేసినట్లు పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తుంది. ఈ మేరకు పట్టాభిని ఇక్కడ నుంచి బరిలో నిలిపేందుకు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ కారణాలే దాడికి కారణమయ్యాయా?
ఇదంతా సహించని వల్లభనేని వంశీ తన నియోజకవర్గంలో టీడీపీని అణదొక్కేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీడీపీ శ్రేణులపై కేసులు పెట్టించారు. వార్డుల్లో ఆ పార్టీ ముఖ్యనేతలను, క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని కట్టడి చేస్తున్నారు. లోకేశ్ చేస్తున్న పాదయాత్రపై విమర్శల దాడి పెంచారు. అనుకున్నట్లుగానే పట్టాభి స్పందించి వ్యాఖ్యల ప్రతి దాడి చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులను ఉసిగొల్పి టీడీపీ నేతలపై దాడి చేయించారు. గన్నవరాన్ని ఓ రణరంగంగా మార్చి అంతా తనదే ఇక్కడ చెల్లుబాటవుతుందని చెప్పేందుకు ప్రయత్నం చేశారు. అందుకు పోలీసులను పావుగా వాడుకున్నారు. పట్టాభికి పుట్టగతుల్లేకుండా చేయడానికి వేసిన పన్నాగం ఫలించేందుకు, ప్రజల్లోకి ఆ మేరకు తీసుకుళ్లగలిగారు. ఈ పరిణామాలు టీడీపీకే అనుకూలంగా కనిపిస్తున్నా, వచ్చేది తమ ప్రభుత్వమేనని ప్రజల మనసులో నాటడానికి వంశీ ఎత్తులు వేసినట్లు కనిపిస్తుంది.