
Ramoji Rao Om City: కళ్ళు ఉన్నవాడు ముందు చూస్తాడు.. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు.. రామోజీరావు ఇలాంటి వాడు కాబట్టి పచ్చళ్ళు, పేపర్, చిట్ ఫండ్ ఏమాత్రం సంబంధంలేని ఈ మూడింటి కాంబినేషన్ లో వేల కోట్లు సంపాదించాడు. అనితర సాధ్యంగా ఎదిగిపోయాడు. అలాంటి రామోజీరావు మీడియా మొఘల్ గా వినతికెక్కాడు. ఇదంతా చాలామందికి తెలిసిన చరిత్రే.. కానీ ఇప్పుడు మార్గదర్శి మీద ఏపీ సిఐడి దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆసక్తికర అంశం తెరపైకి వస్తోంది.
అప్పట్లో అంటే 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి ఫోల్డ్ లోకి రామోజీరావు వెళ్ళిపోయాడు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యాడు. పనిలో పనిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశాడు. ఏదో ఫైల్ ని చూపించాడు. దానికి అమిత్ ఆశ్చర్యపోయాడు.. ఇదంతా ఎలా సాధ్యం అంటూ సైలెంట్ అయి పోయాడు. దానికి రామోజీ రావు ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆ ఫైల్ పేరు ఓం సిటీ. స్థూలంగా చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక నగరి.. రామోజీ ఫిలిం సిటీ ద్వారా ఎంత పేరు, ప్రఖ్యాతలయితే సంపాదించాడో.. అంతకుమించి తన కలల ఓం సిటీ ద్వారా ఆర్జించాలి అనుకున్నాడు. పనిలో పనిగా మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేశాడు.. ఎట్లాగూ కేసీఆర్ కూడా ఆ వెయ్యి నాగళ్ళ శపథాన్ని పక్కన పెట్టాడు కాబట్టి.. రామోజీ ఓం సిటీకి ఓకే చెప్పాడు. భూమి కూడా కేటాయించాడు. ఇంకేముంది రామోజీ ఆనందం డబుల్. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

రామోజీరావు కట్టాలి అనుకుంటున్న ఓం సిటీకి రామోజీ ఫిలిం సిటీకి కొంత దూరంలో ఉన్న భూములనే ప్రభుత్వం కేటాయించింది.. ప్రారంభ పనులు కూడా మొదలయ్యాయి. కానీ కొంతమంది దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు.. దానికి అధికారులు వచ్చి ఆ పనులు నిలుపుదల చేశారు. ఎందుకంటే ఓం సిటీ నిర్మించాలి అనుకుంటున్న భూములు అటవీ శాఖకు చెందినవి.. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అటవీ శాఖకు చెందిన భూములను బదిలాయించే అధికారం లేకపోవడంతో కెసిఆర్ జస్ట్ అలా సైలెంట్ అయిపోయాడు. ఈలోగా కేంద్రంతో కొంచెం గ్యాప్ పెరగడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా గట్టిగా పని చేయడం మొదలుపెట్టింది.. దీంతో రామోజీరావు ఓం సిటీ అలా ఆగిపోయింది.
అప్పట్లో ఓం సిటీకి సంబంధించి పలువురిని రామోజీరావు కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఇషా ఫౌండేషన్ జగ్గీ వాసుదేవ్, పండిట్ రవిశంకర్, పతంజలి రాందేవ్ బాబా వంటి వారికి ఓం సిటీ పై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇందులో వారు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా ఓం సిటీ ఆగిపోవడంతో వారంతా కూడా వెనక్కి మళ్ళినట్టు తెలుస్తోంది.
ఇక ఓం సిటీకి సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్ మోకాలడ్డిన నేపథ్యంలో పర్యాటక అభివృద్ధి కింద రామోజీ ఫిలిం సిటీకి 295 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. ఎందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి లో 250.13, అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్ లో 125.24 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 295 ఎకరాలు ఫిలిం సిటీ విస్తరణకు కావాలి అని రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం గతంలో దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. దీంతో ఆ భూములను పర్యాటకశాఖ ద్వారా అప్పగించాలని ప్రభుత్వ నిర్ణయించింది. అయితే కొండలు, బుట్టలుగా ఉన్న కొన్ని సర్వే నెంబర్లలోని భూమిని విభజించడం సాధ్యం పడదని, మొత్తం 378 ఎకరాలనూ అప్పగిస్తామని రెవెన్యూ అధికారులు పర్యాటకశాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మొత్తం 378.32 ఎకరాలకు సంబంధించిన అసైన్దారులకు పరిహారం చెల్లించేందుకు 37. 65 కోట్లను డిపాజిట్ చేయాలని ఫిల్మ్ సిటీ యాజమాన్యాన్ని సర్కార్ కోరింది.
ఇక ఈ భూములను గతంలో పేదలకు అసైన్ చేశారు. కానీ ఇక్కడ అసైన్ దారులు ఎవరూ సాగు చేయడం లేదు. అలాగే, పట్టాలు తీసుకున్న వారెవరూ ఇళ్ల నిర్మాణం చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఆ భూములను సేకరించి రామోజీ ఫిలిం సిటీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మిగిలిన 81.18 ఎకరాలను తీసుకునేందుకు ఆసక్తి చూపితే.. అవి కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఓం సిటీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మోకాలడ్డిన నేపథ్యంలో రామోజీరావు ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీ విస్తరణ పేరుతో ఇక్కడ ఓం సిటీ కట్టేందుకు సమయతమవుతున్నట్టు సమాచారం.