
Telugu Heroines: ఎన్టీఆర్, నాగేశ్వరావు కాలంలో హీరోయిన్లు 90 శాతం వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళే ఉండేవారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అంతే.. కథకి అత్యంత కీలకం అనిపిస్తే తప్ప ఇతర రాష్ట్రం నుంచి హీరోయిన్స్ కోసం చూసేవాళ్ళు కాదు దర్శక నిర్మాతలు. కానీ తరాలు మారేకొద్ది అభిరుచులు మారిపోయాయి. ఇప్పుడున్న దర్శకులకు.. నిర్మాతలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన హీరోయిన్స్ అంటే చాలా చులకన భావం. సంవత్సరాల తరబడి ఇండస్ట్రీలో ఉంటున్నా కూడా వాళ్ళు కోరుకున్న పొరుగు రాష్ట్ర హీరోయిన్స్ కి ఇప్పటికీ తెలుగు మాట్లాడడం రాదు. అలాంటి వాళ్లకు ఇప్పటికీ అవకాశాలు ఇస్తూ పెంచి పోషిస్తున్నారు కానీ.. చక్కగా తెలుగు మాట్లాడుతూ మన తెలుగింటి అమ్మాయి లాగా ఉండే హీరోయిన్స్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ.
టాలీవుడ్ లో అందంతో పాటుగా అభినయం ఇచ్చే అచ్చ తెలుగు హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. రీతూ వర్మ, శోభిత దూళిపాళ్ళ, ఇషా రెబ్బ,ప్రియాంక జవాల్కర్,అంజలి, బింధు మాధవి, శ్రీదివ్య ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఇక్కడితో ఆగదు. వీళ్లందరిలో అసలు ఏమి తక్కువ? అందం లోనూ అభినయం లోనూ ఇప్పుడు ప్రస్తుతం టాప్ స్టార్ హీరోయిన్స్ కంటే ఎంతో బెటర్.

కానీ వీళ్ళకి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేక ఖాళీగా ఇంట్లో కూర్చున్నారు. కొంతమంది హీరోయిన్స్ అయితే ఇతర ఇండస్ట్రీస్ వలస వెళ్లిపోయారు. వారిలో రీతూ వర్మ లాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు వీళ్ళని దర్శక నిర్మాతలు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు. కారణం ఇక్కడి హీరోయిన్స్ దర్శక నిర్మాతలు డిమాండ్ చేసినట్టు అందాల ఆరబోతులు మరియు లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడకపోవడం వల్లనేనా..?, తెలుగు సంస్కృతి కి అలవాటు పడ్డవారు కాబట్టి వాళ్ళ అభిరుచులు అలాగే ఉంటాయి. అదే వాళ్లకి సినిమాల్లో అవకాశాలనీ రానివ్వకుండా చేస్తుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.అంటే మన దర్శకుల దృష్టిలో హీరోయిన్స్ అంటే కేవలం అందాలు ఆరబోయ్యడానికి మాత్రమే పనికొచ్చేవారా..? నటనకి అసలు ప్రాధాన్యత ఇవ్వరా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు గత రెండు దశాబ్దాల నుండి మన ప్రేక్షకుల్లో ఉన్న సందేహాలు. ఇప్పటికీ వీటికి జవాబులు దొరకడం లేదు. భవిష్యత్తు లో కూడా దొరుకుతుంది అనే ఆశ చాలామందిలో చచ్చిపోయింది.