Adivi Sesh- HIT 2: 2020లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ మంచి విజయం సాధించింది. శైలేష్ కొలను డెబ్యూ మూవీగా తెరకెక్కిన ఆ చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. కిడ్నాప్ కి గురైన అమ్మాయి చుట్టూ కథ నడుస్తుంది. ఊహించని ట్విస్ట్స్ తో సాగే హిట్ ప్రేక్షకులను అలరించింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని నిర్మించారు. రుహాని శర్మ హీరోయిన్ గా నటించారు. హిట్ మూవీ సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ ప్రకటించారు.

హిట్ 2 మూవీ హీరోగా అడివి శేష్ నటిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదల కాగా మూవీపై ఆసక్తి రేపింది. రెండున్నర నిమిషాల ట్రైలర్ గూస్ బంప్స్ కలిగించింది అనడంలో సందేహం లేదు. సంజన అనే అమ్మాయి మర్డర్ ఇన్వెస్టిగేషన్ తో మొదలైన కథ ఊహించని మలుపులు తీసుకుంటుంది. మర్డర్ చేయబడింది ఒక్క సంజన మాత్రమే కాదని, ఆమె డెడ్ బాడీ కొందరు అమ్మాయిల శరీర భాగాలతో కూడుకొని ఉందని తెలుసుకొని నివ్వెరపోతారు. సంజన మర్డర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అడివి శేష్ వ్యవహరిస్తారు.
టీనేజ్ అమ్మాయిలను చంపే ఇంటెలిజెంట్ సైకో కిల్లర్ పోలీస్ అధికారి అయిన అడివి శేష్ ని ముప్పతిప్పలు పెడతాడు. కిల్లర్ ఎవడని కనుక్కోవడం చిక్కు ప్రశ్నగా మారుతుంది. అయితే హిట్ మూవీలో ఊహించని మలుపులు ఉంటాయని టీం చెబుతున్నారు. ఆ ట్విస్ట్ విలన్ ఎవరు అనేది. అయితే ఆ సైకో కిల్లర్ అడివి శేష్ అంటున్నారు. పోలీస్ అధికారిగా తనని తానే వెతుక్కుంటూ, సీరియస్ నెస్ నటిస్తూ మోసం చేస్తాడట. క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ఈ ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుందట.

అప్పటి దాకా హీరోగా కనిపించిన అడివి శేష్ లోని నెగిటివ్ షేడ్ ప్రేక్షకులకు దిమ్మతిరిగే షాక్ ఇస్తుందట. అందుకే సినిమా చూసిన ప్రేక్షకులు క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరికీ రివీల్ చేయవద్దని టీమ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరొక విశేషం ఏమిటంటే.. హిట్ 3 హీరో ఎవరో కూడా పతాక సన్నివేశాల్లో చూపిస్తారట. మొత్తంగా హిట్ 2 ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం అందకుండా గొప్ప అనుభూతిని పంచుతుందన్న టాక్ వినిపిస్తుంది. అయితే హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అడివి శేష్ విలన్ షేడ్స్ లో కనిపిస్తే రిస్క్ అంటున్నారు. కెరీర్ బిగినింగ్ లో అడివి శేష్ విలన్ గా నటించిన విషయంలో తెలిసిందే. బాహుబలి 2లో సైతం భల్లాలదేవుడు కొడుకు పాత్ర చేశాడు.