
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. క్రికెట్ ప్రేమికులను, అభిమానులను ఎంతగానో ఉర్రూతలూగిస్తోంది. ఈ టోర్నమెంట్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆశగా ఎదురుచూసే కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇప్పటి వరకు 15 సీజన్ లు విజయవంతంగా పూర్తి చేసుకుని.. ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోంది. ఏటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తోంది. అసలు ఈ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా ఆదాయం ఎలా వస్తుంది వంటి విషయాలు చాలా మందికి తెలియదు. అయితే ఐపీఎల్ కు స్పాన్సర్షిప్ ద్వారానే కోట్లాది రూపాయల ఆదాయం చేకూరుతుంది. అయితే ఐపీఎల్ లో స్పాన్సర్షిప్ చేస్తున్నది ఎవరు..? ఎన్ని కోట్ల రూపాయలు పెట్టారు..? వీరికి లాభాలు ఎలా వస్తాయన్న విషయాన్ని తెలుసుకుందాం.
ఏటా పెరుగుతూ వస్తున్న స్పాన్సర్ షిప్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు స్పాన్సర్షిప్ చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతుంటాయి. ఐపీఎల్ సంబంధించి బిడ్డింగ్ నిర్వహించి ఈ స్పాన్సర్షిప్ ను అప్పగిస్తారు. ఏటా ఈ స్పాన్సర్షిప్ దక్కించుకునేందుకు అనేక దిగ్గజ సంస్థలు పోటీ పడుతుండడంతో స్పాన్సర్షిప్ అమౌంట్ కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. ఐపీఎల్ ప్రారంభంలో రూ.200 కోట్ల లోపు ఉండగా.. అది ప్రస్తుతం రూ.600 కోట్లకు పైగా దాటిందంటే ఏ స్థాయిలో పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎక్కువమందిలోకి వెళ్లేందుకు అవకాశం..
ప్రతి ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు వీక్షించే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ఈ ఐపీఎల్ కు స్పాన్సర్షిప్ చేసే సంస్థలు తమ సంస్థలను కోట్లాదిమందికి చేరువ చేసేందుకు ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతోనే ప్రముఖ సంస్థలు స్పాన్సర్షిప్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటాయి. ఐపీఎల్ స్పాన్సర్షిప్ చేసే సంస్థలు ఆ తర్వాత కాలంలో భారీగానే లాభాలు బాట పట్టడంతో.. పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో స్పాన్సర్షిప్ అమౌంట్ కూడా భారీ మొత్తంలో పెరుగుతూ వస్తుంది.
డిఎల్ఎఫ్ సంస్థ.. 160 కోట్లు..
ఐపీఎల్ ప్రారంభంలో మొదటి నాలుగేళ్లపాటు డిఎల్ఎఫ్ సంస్థ స్పాన్సర్షిప్ చేసింది. 2008 నుంచి 2012 వరకు సంస్థ స్పాన్సర్షిప్ చేయగా.. రూ.160 కోట్ల రూపాయలను చెల్లించింది. నాలుగేళ్లకు స్పాన్సర్షిప్ దక్కించుకోగా.. ఏడాదికి రూ.40 కోట్లు చొప్పున అప్పట్లో ఈ సంస్థ ఐపీఎల్ కు స్పాన్సర్షిప్ రూపంలో చెల్లించింది.
మూడేళ్లపాటు పెప్సీ స్పాన్సర్షిప్..
ఆ తర్వాత మూడేళ్ల పాటు ప్రముఖ కూల్ డ్రింక్ సంస్థ పెప్సీ స్పాన్సర్షిప్ చేసింది. 2013 నుంచి 15 వరకు ఈ సంస్థ స్పాన్సర్షిప్ చేయగా.. ఇందుకోసం రూ.396 కోట్ల రూపాయలు మొత్తాన్ని వెచ్చించింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ మొత్తం భారీగా పెరిగింది. ఏడాదికి రూ.132 కోట్లకు పైగా ఈ సంస్థ చెల్లించింది. ముందు నాలుగేళ్లకు రూ.160 కోట్లు మాత్రమే డీఎల్ఎఫ్ సంస్థ చెల్లించగా.. మూడేళ్లకే పెప్సీ సంస్థ రూ.396 కోట్ల రూపాయలను వెచ్చించింది. ఇక 2016, 2017 ఐపీఎల్ సీజన్ కు వివో సంస్థ స్పాన్సర్షిప్ చేసింది. ఏడాదికి రూ.100 కోట్లు చొప్పున.. రెండేళ్లకు రూ.200 కోట్ల రూపాయలను ఈ సంస్థ చెల్లించింది.

రికార్డు స్థాయిలో వివో సంస్థ..
ఇక ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత రికార్డు స్థాయిలో వివో సంస్థ స్పాన్సర్షిప్ చేసేందుకు ముందుకు వచ్చింది. 2018, 2019 సంవత్సరాల్లో నిర్వహించిన ఐపీఎల్ కు వివో సంస్థ స్పాన్సర్షిప్.. ఇందుకోసం సదరు సంస్థ ఐపిఎల్ యాజమాన్యానికి రూ.880 కోట్ల రూపాయలను చెల్లించింది. అంటే ఏడాదికి రూ.440 కోట్ల రూపాయలను ఈ సంస్థ ఐపీఎల్ కు స్పాన్సర్ చేసినట్లు అయింది.
2020లో డ్రీమ్ ఎలెవెల్ సంస్థకు..
2020లో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు స్పాన్సర్ షిప్ చేసే అవకాశం డ్రీమ్ ఎలెవెల్ కు దక్కింది. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించేందుకు ఈ సంస్థ రూ.222 కోట్ల రూపాయలను వెచ్చించాల్సి వచ్చింది. 2021లో ఐపీఎల్ కు వివో సంస్థ మరోసారి స్పాన్సర్షిప్ చేసింది. ఈ సీజన్ ను దక్కించుకునేందుకు వివో సంస్థ ఏకంగా రూ.440 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.
రెండేళ్లకు రూ.660 కోట్లు స్పాన్సర్షిప్ చేసిన టాటా..
ఇక గడిచిన రెండేళ్లుగా టాటా సంస్థ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు స్పాన్సర్షిప్ చేస్తోంది. గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్షిప్ కింద రూ.330 కోట్లు వెచ్చించిన టాటా సంస్థ, ఈ ఏడాది స్పాన్సర్షిప్ కోసం అంతే మొత్తాన్ని వెచ్చించింది. 2022, 2023 లో ఐపీఎల్ స్పాన్సర్షిప్ కోసం టాటా సంస్థ రూ.660 కోట్ల రూపాయలను వెచ్చించడం గమనార్హం. ఏటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు స్పాన్సర్షిప్ చేస్తున్న సంస్థలు సంఖ్య భారీగా పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగానే ఆదాయం వస్తోంది.