
Ponguleti Srinivas Reddy- Jupalli Krishna: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును భారత రాష్ట్ర సమితి అధిష్టానం సస్పెండ్ చేసిన నిర్ణయంలో వారి పయనం ఎటువైపు ఉంటుందని దానిపై భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి తమకు తోడుగా మరింతమంది నేతలు వచ్చే వరకు వేచి చూస్తారనే అభిప్రాయం ప్రబలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితిలోని అసంతృప్త నాయకులకు ఒక వేదికగా ఉండేలా కూటమి ఏర్పాటు చేయాలనేది వీరి లక్ష్యమని పలువురు చెబుతున్నారు.. వీరు లక్ష్యం చేరుకున్న తర్వాత… ఎవరితో జట్టు కడతారు, లేకుంటే ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం కూడా సాగుతోంది.
ఇలాంటి పార్టీ ఒకటి ఏర్పాటు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా 20 స్థానంలో గెలుచుకోగలిగితే రానున్న ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా ఉంటామని వీరి అంచనాగా ఉంది. ఒకవేళ హంగ్ లాంటి పరిస్థితులు ఏర్పడితే తామే కీలకం అవుతామనే ఉద్దేశం కూడా కనిపిస్తోంది. అయితే కొత్తగా రాజకీయ పార్టీని పెట్టి తద్వారా జనంలోకి వెళ్లి ఇన్ని సీట్లను ఇప్పటికిప్పుడు గెలవడం సాధ్యమవుతుందా? అనే చర్చ కూడా నడుస్తోంది. దీనికి బదులుగా తమతో కలిసివచ్చే నాయకులకు, అసంతృప్త నేతలు అందరూ కలిసి ఏదో ఒక పార్టీతో, ఒక ప్రత్యేకమైన ఒప్పందం చేసుకొని ఎన్నికల బరిలోకి దిగాలనే ఆకాంక్షతోనూ వీరిద్దరు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమతో కలిసి వచ్చేది ఎవరు? అనేది చూసుకొని రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం..
ప్రస్తుతానికి అటు కాంగ్రెస్, బిజెపి నేతలతో పాటు వై ఎస్ ఆర్ టి పి నేత విజయమ్మ తోనూ టచ్ లో ఉంటున్నా తమ నిర్ణయాన్ని మాత్రం రెండు నెలల తర్వాతే వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అయితే పొంగులేటిని తమ పార్టీలోకి చేర్చుకోవాలని అటు కాంగ్రెస్, ఇటు బిజెపిలు ప్లాన్ చేస్తున్నాయి. అయితే ఈ ఇద్దరు నేతల గతం కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉంది. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుత బీజేపీ నేత డీకే అరుణ ఒకప్పుడు కాంగ్రెస్ లో కొనసాగారు. అప్పుడు జూపల్లికి, అరుణకు వర్గ పోరు తారస్థాయిలో నడిచింది. ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు పార్టీలోకి వస్తే మళ్ళీ ఇవే పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. జూపల్లి కూడా ఇంతవరకు బిజెపి వైపు దృష్టి సారించలేదు.

ఇక పొంగులేటి బిజెపిలో చేరిక పైన మొదట్లో మంచి అభిప్రాయమే వ్యక్తమైనా.. క్రమేణా అది మారుతూ వచ్చింది. దీంతో జిల్లాలో కమ్యూనిస్టుల ప్రభావం ఉండటంతో పాటు ఆశించిన మేర ముస్లింల ఓట్లు పడవని చర్చ మొదలైంది. దీంతో పొంగులేటి బిజెపి ఆలోచనపై ఒక అడుగు వెనక్కి వేస్తారని చర్చ జరుగుతుంది. మరో వైపు పొంగులేటి తో రేవంత్ రెడ్డి టచ్ లో ఉన్నారని చర్చ జరుగుతోంది. అయితే ఖమ్మం జిల్లాలో రేణుక చౌదరి, భట్టి విక్రమార్క వర్గాలు ఉండటంతో పొంగులేటి అటువైపు కూడా వెళ్లే అవకాశాలు ఉండమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరో రెండు నెలల తర్వాత నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి, జూపల్లి ప్రకటించిన నేపథ్యంలో.. అది ఏమై ఉంటుందనే ఆసక్తికర చర్చ కూడా మొదలైంది.